చంద్రబాబూ…! టీఆర్‌ఎస్ అడ్రస్ ఎక్కడో కనపడుతోందా?.. టీఆర్‌ఎస్సా అదెక్కడుంది. అడ్రస్ ఎక్కడ అంటూ చంద్రబాబు చేసిన వెటకారానికి సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన చరిత్రాత్మక సభ వేదికపైనుంచి కేసీఆర్ వేసిన ప్రశ్న ఇది. ఉద్యమ ప్రస్తానంలో అలసిన ప్రతిసారి టీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణ వాదులను రీచార్జీ చేసింది భారీ బహిరంగ సభలతోనే. తొలిదశ ఉద్యమమంతా సభల రూపంలోనే కేసీఆర్ నడిపించారు. ప్రతిసారీ ఇదే పెద్ద సభ అనుకోవడం.. మరుసటి సారి ఆ రికార్డు బద్దలు కావడంగా సభల నిర్వహణ కొనసాగింది. చివరకు వరంగల్ ప్రజాగర్జన సభ ప్రపంచంలోని 10 గొప్ప సభల్లో ఒకటిగా చరిత్రకెక్కింది.
– సభలతోనే సగం విజయం – చరిత్రకెక్కిన వరంగల్ మహాగర్జన – మలుపుతిప్పిన సిద్దిపేట సభ25 లక్షల మంది హాజరైన ఈ సభలో పాల్గొన్న స్వామి అగ్నివేశ్ నా జీవితంలో ఇలాంటి భారీ సభ ఎప్పుడూ చూడలేదు అని వ్యాఖ్యానించారు. అప్పటికీ ఇప్పటికీ కూడా తెలంగాణలో సభల నిర్వహణలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. 2001లో వచ్చిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల నాటినుండి ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహిస్తున్న సభల వరకు కేసీఆర్ ఒకటే అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ వందకుపైగా బహిరంగ సభల్లో పాల్గొని ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భారీ బహిరంగ సభలు 25 కు పైబడి ఉంటాయని అంటున్నారు. 2004 ఎన్నికల సమయంలో జాతీయ పార్టీల నేతలను తెచ్చి టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు, తెలంగాణవాదానికి బలాన్ని చేకూర్చారు.

కేసీఆర్ వరంగల్‌లో నిర్వహించిన ప్రజాగర్జన, మహాగర్జనలు చరిత్రలో చిలిచిపోయాయి. హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభ అన్ని రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగేలా చేసింది. తెలంగాణవాదం ఇంత బలంగా లేనిరోజుల్లోకూడా కేసీఆర్ పరేడ్‌గ్రౌండ్‌లోనిర్వహించిన సభ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది. ఆ రోజు కేసీఆర్ మాట్లాడటం అయిపోయిన తరువాత కూడా జనం సభకు వస్తూనే ఉండడం విశేషం. ఆరోజు హైదరాబాద్ నగరం ట్రాఫిక్ ఇబ్బంది నుండి బయట పడటానికి తెల్లవారి నాలుగు గంటల సమయం పట్టిందని విశ్లేషకులు చెబుతుంటారు. అదేసమయంలో 2004 ఎన్నికలకు ముందు వరంగల్‌లో నిర్వహించిన ప్రజాగర్జన సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభ తరువాత ప్రతి సందర్భంలోనూ ప్రజాగర్జన సభలో పల్లిబఠాణీలు ఏరుకునేంత మంది కూడా ఇతరపార్టీల సభలకు రాలేదని కేసీఆర్ అంటే కనీసం అవతలివైపునుంచి ఖండన కూడా వచ్చేది కాదు.

మలుపు తిప్పిన సిద్దిపేట సభ: కేసీఆర్ 2009 ఎన్నికల తరువాత, దీక్షకు వెళ్లడానికి ముందు సిద్దిపేటలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. 14ఎఫ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ గర్జన నిర్వహించారు. ఉద్యోగులు వేలాదిగా తరలిరాగా, భారీ ఎత్తున వచ్చిన ప్రజా మద్దతుతో ఈ సభ జరిగింది. ఈ సభలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరణ నిరాహార దీక్షకు కూడా వెళ్తున్నట్లుగా ప్రకటించారు.
కేసీఆర్ సభలంటే…: కేసీఆర్ సభలు సాధారణంగా సాయంత్రం సమయాల్లోనే ఎక్కువగా జరుగుతాయి. ఉదయం నుండి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రెడీ అయి సభా ప్రాంగణానికి రావడానికి సాయంత్రం అవుతుంది. అదే సమయానికి ఎండ, వేడి కూడాతగ్గుముఖం పడుతుంది. దీంతో కేసీఆర్ ప్రజలు ప్రశాంతంగా ఉన్న సమయంలో తన ప్రసంగాన్ని ముగిస్తారు. కేసీఆర్ నిర్వహించే ప్రతి సభకు వారం, తిథి, నక్షత్రం చూసుకోవడం అలవాటుగా వస్తోంది.