-తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతా
-మీలో ఒకడిగా.. మీ సోదరుడిలా ఉంటా
-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్
తెలంగాణ ప్రజల ఆశీస్సులతో, అన్నివర్గాల ప్రజల మద్దతుతో టీఆర్ఎస్ను అజేయశక్తిగా మలుస్తానని, దానికోసం భగవంతుడు తనకు ఇచ్చిన శక్తినంతా వినియోగిస్తానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. పేదలు, రైతులు సహా అన్నివర్గాల సంక్షేమానికి అంకితం అయ్యేందుకు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోవడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వ నిర్వహణలో నిమగ్నమై ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అంటే.. తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచే ముఖ్యమైన బాధ్యతను తనకు అప్పగించారని చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో మీలో ఒకడిగా, మీ సోదరుడిగా ఉంటూ, పేదలకు, రైతులకు, మహిళలకు, యువకులకు, ప్రతి కులానికి, అన్ని వర్గాలవారికి అండగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకుపోతాను అని కేటీఆర్ చెప్పారు.
వంద సంవత్సరాలపాటు టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల సేవలో నిమగ్నమయ్యే విధంగా పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించి సంస్థాగత నిర్మాణం చేపడతామని తెలిపారు. పార్టీ కార్యాలయాల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ వంటి చర్యలు చేపట్టి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పార్టీని నిలుపుతామని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయం అందించారని, అన్ని మతాల ప్రజలు ఆశీర్వదించి బంగారు తెలంగాణ నిర్మాణాన్ని కొనసాగించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతను అందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా నిర్వర్తిస్తానని చెప్పారు. తనను ఆశీర్వదించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.