Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆకుపచ్చ తెలంగాణ కావాలి.

ఇదే నా స్వప్నం

-పిల్లల్ని పెంచినట్టే మొక్కల్ని పెంచాలి -ఒక్కో వ్యక్తి రెండు మొక్కలు నాటాలి.. హరితహారం విజయవంతం చేసే వారికి రివార్డులు -కరీంనగర్ హరితహారంలో సీఎం కేసీఆర్.. మూడో విడుత కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం -మానేరు డ్యామ్ వద్ద మహాగని మొక్క నాటిన సీఎం.. ముఖ్యమంత్రికి అడుగడుగునా ఘనస్వాగతం -వచ్చే జూన్ నాటికి మధ్యమానేరు-కాళేశ్వరం అనుసంధానం పూర్తి -ఎస్సారెస్పీ కింద వచ్చే జూన్ నుంచి రెండు పంటలకు సాగునీరు -డిసెంబర్ నుంచి మిషన్ భగీరథ కింద దశలవారీగా తాగునీరు -రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న నిర్ణయంపై ప్రధాని ఆశ్చర్యం -విపక్ష గొర్రెల అవాకులు చెవాకులు.. సన్నాసుల మాటలు ఖాతరు చేయొద్దు -కాంగ్రెస్ పంటికి అంటకుండానే మింగేస్తుంది.. కరీంనగర్ సభలో సీఎం వ్యాఖ్య

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం పచ్చలహారంలా మారాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ రెండేసి మొక్కలునాటి యావత్తు తెలంగాణను హరితవనంలా మార్చాలని పిలుపునిచ్చారు. ఇంట్లో పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలను కూడా అలా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను పెంచి, చదివించి, ఎంత ధనం ఇచ్చినా.. వారు బతికే పరిస్థితి ఇవ్వకపోతే లాభం లేదని సీఎం వ్యాఖ్యానించారు. మనం ఇచ్చే ఆస్తి ముఖ్యం కాదని.. దాంతోపాటు ఆ ఆస్తిని అనుభవించే మంచి వాతావరణాన్ని కూడా కల్పించాలని సూచించారు. అప్పుడే పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చినట్లని, లేదంటే వారి జీవితాలు వ్యర్థం అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు కచ్చితంగా ఇచ్చి తీరుతానని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నదన్న సీఎం.. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్ష గొర్రెలు అవాకులు చెవాకులు పేలుతున్నామని మండిపడ్డారు. బుధవారం ఉదయం 11.50 నిమిషాలకు కరీంనగర్ శివారులోని మానేరు డ్యాం తీరాన (బతుకమ్మ పాయింట్ వద్ద) మహాగని మొక్క నాటడం ద్వారా మూడో విడుత హరితహారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.100 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల నమూనా డిజైన్ల ఫొటో ప్రదర్శనను తిలకించారు. అక్కడి నుంచి అంబేద్కర్ స్టేడియానికి వెళ్లి, అక్కడ నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలను, ఇప్పటివరకు సాధించిన విజయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. సమైక్య రాష్ట్రంలో చెరువుల తరహాలోనే పచ్చదనాన్నీ నాశనంచేశారని, కరువు కాటకాలే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మన సొంత రాష్ట్రం కాబట్టి అద్భుతంగా పనిచేయాలి.

కరువు కాటకాలు దూరం కావాలంటే తెలంగాణ ముందుగా పచ్చనిహారంలా మారాలి అని అభిప్రాయపడ్డారు. హరితహారం అనేది వేరేవాళ్ల పని కాదని, ఇది మన సొంత పని అని చెప్పారు. మనిషి జీవితంతో అడుగడుగునా మొక్క పెనవేసుకొని ఉంది. మనిషి పుట్టినప్పుడు ఊ గే ఊయల నుంచి.. చనిపోయినప్పుడు కాల్చే చితివరకు అంతా చెట్టుద్వారా వచ్చే కట్టెతో ముడిపడి ఉంది అని సీఎం చెప్పారు. వాతావరణ శాఖ చెప్పినదానిబట్టి ఈ నెల 25వరకు రాష్ట్రంలో మంచి వర్షాలు పడుతాయన్నారు. ప్రకృతిని ఎక్కడైతే పూజిస్తారో అక్కడే ప్రకృతి హర్షిస్తుంది.. వర్షిస్తుంది అని సీఎం అన్నారు. కరీంనగర్ పట్టణ వేదికపై నుంచి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు పాదాభివందనం చేసి చెప్తున్నా.. ఇంట్లో పిల్లలను ఎలా పోషిస్తామో మొక్కలను అలా పెంచాల్సిన అవసరం ఉంది అని సీఎం చెప్పారు. వర్షాలు బాగా పడి, చెరువులు, కుంటలు నిండి, పచ్చని తెలంగాణగా ఉండాలంటే హరితవనాలు బాగా పెంచాలి. కరువును శాశ్వతంగా నివారించవచ్చుననే హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం అని కేసీఆర్ అన్నారు. మొక్కలు నాటి, సంరక్షించేందుకు గ్రీన్ బ్రిగేడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కో బ్రిగేడ్‌లో 51మంది ఉంటారని తెలిపారు. హరితహారంలో ఉత్సాహంగా పాల్గొనే 523 సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు అందించనున్నట్లు చెప్పారు. ఉత్తమ పంచాయతీకి రూ.5 లక్షలు, ఉత్తమ మండలానికి రూ.8 లక్షలు, ఉత్తమ వార్డు/డివిజన్‌కు రూ.5 లక్షలు, ఒక్కో ఉత్తమ విద్యాసంస్థకు రూ.2 లక్షలు, ఉత్తమ ప్రజాప్రతినిధులు, అటవీశాఖాధికారులకు లక్ష చొప్పున నగదు పారితోషికం ఇవ్వనున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

హరితహారం అనేది వేరే వాళ్ల పని కాదు. ఇది మన సొంత పని. మనిషి జీవితంతో అడుగడుగునా మొక్క పెనవేసుకొని ఉంది. మనిషి పుట్టినప్పుడు ఊగే ఊయల నుంచి.. చనిపోయినప్పుడు కాల్చే చితివరకు అంతా చెట్టుద్వారా వచ్చే కట్టెతో ముడిపడి ఉంది. ప్రకృతిని ఎక్కడైతే పూజిస్తారో అక్కడే ప్రకృతి హర్షిస్తుంది.. వర్షిస్తుంది. కరీంనగర్ పట్టణ వేదికపైనుంచి రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లకు పాదాభివందనంచేసి చెప్తున్నా.. ఇంట్లో పిల్లలను ఎలా పెంచి పోషిస్తామో.. మొక్కలను అలా పెంచాల్సిన అవసరం ఉంది. వర్షాలు బాగా పడి, చెరువులు, కుంటలు నిండి, పచ్చని తెలంగాణగా ఉండాలంటే హరితవనాలు బాగా పెంచాలి. కరువును శాశ్వతంగా నివారించవచ్చుననే హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం.

సంక్షేమంలో నంబర్ వన్ -కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని సీఎం చెప్పారు. కొత్తగా ప్రభుత్వం వచ్చిన రోజు మనకు చాలా బాధలు ఉండేవి. విద్యార్థులకు భోజనం పెట్టలేదు. వృద్ధులకు ఆదరణలేదు. బీడీ కార్మికులను పట్టించుకోలేదు. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి, అకలిని తరిమికొట్టడానికి రేషన్ బియ్యాన్ని నాలుగు నుంచి ఆరు కిలోలకు పెంచాం. దీనివల్ల రెండు వేల కోట్ల భారం పడినా ప్రజల సంక్షేమం దృష్ట్యా లెక్కలోకి తీసుకోలేదు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 93 లక్షల బియ్యం కార్డులు ఇచ్చాం. 40లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళలకు ఈ మధ్యనే నెలకు రూ.వేయి చొప్పున భృతి మంజూరు చేశాం అని సీఎం వివరించారు. దేశంలోనే ఈ రకమైన సంక్షేమం ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పారు.

డిసెంబర్ నుంచి దశలవారీగా ఇంటింటికీ నీళ్లు ఈ ఏడాది డిసెంబర్ నుంచి మిషన్ భగీరథ కింద దశలవారీగా నల్లాల ద్వారా ఇండ్లకు మంచినీరు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో మనం మొదట ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య కరెంటు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుడికే తెలుసు అనే పరిస్థితి ఉండేది. మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడంవంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. కాలిన మోటర్లను బాగు చేసుకునేందుకు రైతులు అధిక ఖర్చులు పెట్టి ఇబ్బందులు పడిన విషయం మనకు తెలుసు. అయినా ఆరు నెలల్లోనే కరెంటు బాధలు తప్పించాం. పేదరికంతో ఉన్నవారిని సంక్షేమ కార్యక్రమాలతో అదుకుంటున్నాం అని చెప్పారు. సాగునీటికోసం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం, దక్షిణ తెలంగాణకు పాలమూరు నీళ్లను తెచ్చుకుంటున్నామన్నారు. మంచినీటి సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు రూ.43వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టాం. డిసెంబర్‌నాటికి ప్రతి ఇంటికీ కృష్ణా, గోదావరి జలాలు అందుతాయి అని సీఎం చెప్పారు.

కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతాం తెలంగాణ కోసం నేను ఒంటరిగా బయలుదేరినప్పుడు నాపై నమ్మకం ఉంచి, నా వెంట నిలిచి, 15 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకోవడంలో భాగస్వాములయ్యారు. ఈ రోజు నేను హామీ ఇస్తున్నా. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చే వరకు ప్రభుత్వం నిద్రపోదు అని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరాకు పెట్టుబడి కింద రూ.8వేలు ఇవ్వాలని ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై ప్రధాని కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అనేక మంది ముఖ్యమంత్రులు ఫోన్ చేశారు అని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం నలిగిపోయింది. నాశనం అయింది. సమైక్య ప్రభుత్వాలు అన్నదాతలపట్ల చూపిన నిర్లక్ష్యంవల్ల వారు దుబాయి పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతాంగాన్ని బాగుచేయాలన్న లక్ష్యంతో అనేకచర్యలు తీసుకున్నాం. ఒకవైపు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతుల వ్యవసాయ రుణాలు రూ.17వేల కోట్లు మాఫీచేశాం. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు కరెంటు ఇస్తున్నాం అని సీఎం వివరించారు. గత సమైక్య పాలనలో తగిలిన దెబ్బలనుంచి రైతాంగం కోలుకోలేదని కేసీఆర్ అన్నారు. రూ.17వేల కోట్ల రుణాలు మాఫీచేసినా.. ఇంకా రైతాంగం అప్పుల్లో ఉందని గుర్తించి, వారికి పెట్టుబడి కింద ఎకరాకు రూ. 8వేలు ఇవ్వాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం అని సీఎం చెప్పారు. దీని ద్వారా రైతుల అర్థిక శక్తి పెరుగుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో 40లక్షల ఎకరాలకు సాగునీరు తెలంగాణ మొత్తంలో వచ్చే ఏడాది జూన్ నాటికి అత్యధికంగా లాభపడే జిల్లా కరీంనగర్ అని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే జూన్‌నాటికి కాళేశ్వరం నీళ్లు మధ్యమానేరు ప్రాజెక్టుకు పంపించేందుకు అనుసంధానం అయిపోతుందని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాశేశ్వరంతో అనుసంధానం చేయడానికి ఇటీవలే రూ.వేయి కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఎస్సారెస్పీ కింద ఉన్న 16 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించడానికి వీలు కలుగుతుందన్నారు. వారబందీ పెట్టి ఒక పంట పండించే బాధ వచ్చే జూన్ నుంచి ఉండదు. తద్వారా దేశంలోనే ఒక గొప్ప జిల్లాగా కరీంనగర్ అవతరిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోనూ రెండుపంటలు పండించుకునే అవకాశం కలుగుతుంది అని సీఎం స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్, నిజామాబాద్, నిర్మల్ లాంటి జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కసారి అనుసంధానమైతే 30 నుంచి40 లక్షల ఎకరాలకు నీరు పారడమే కాకుండా ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పారు.

సాధించి చూపిస్తా మనం పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేయాల్సిన అవసరం ఉంది. వందశాతం ఇంటింటికీ నల్లా నీరు రావాలి.. 24 గంటలు కరెంటు ఉండాలి.. కోటి ఎకరాలు సస్యశ్యామలం కావాలి.. రైతులకు ఎకరానికి రూ.8వేల పెట్టుబడి అందాలి.. తద్వారా అద్భుతమైన తెలంగాణ కావాలి అని చెప్పారు. ఎవరు అడ్డుకున్నా తెలంగాణ సాధనకోసం ఎలాగైతే ముందుకు వెళ్లామో ఈ లక్ష్యాల సాధనకోసం కూడా అలానే ముందుకు సాగుతాం. వీటిని సాధించి రాబోయే రెండు మూడేండ్లలో మీకు అప్పగిస్తాం అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రికి అడుగడుగునా ఘన స్వాగతం.. హరితహారం మూడో విడుతను ప్రారంభించేందుకు కరీంనగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ముందుగా లోయర్‌మానేరు డ్యాం పరిధిలో బతుకమ్మ పాయింట్‌కు చేరుకొన్న సీఎం.. అక్కడ మహాగని మొక్క నాటారు. తనకు స్వాగతం పలికిన విద్యార్థులకు సీఎం అభివాదం చేయడంతో పిల్లలు సంతోషంతో కేరింతలు కొట్టారు. మొక్కలు నాటిన అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాకు చేరుకొని, కలెక్టరేట్‌కు భారీ ర్యాలీతో వచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో సీఎంకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాంపూర్, కమాన్, సిక్కువాడి వద్ద మహిళలు బతుకమ్మలతో స్వాగతించారు. పలు చోట్ల కేసీఆర్‌కు మంగళహారతులిచ్చారు. కొందరు ప్రగతిరథంపై పూలు చల్లి స్వాగతం పలికారు. స్థానిక సిక్‌వాడీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదికపై కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. కేసీఆర్‌కు తల్వార్‌ను బహూకరించి, ఆకుపచ్చ రంగు బెలూన్లను ఆయన చేతికి అందజేయడంతో సీఎం వాటిని ఆకాశంలోకి ఎగురవేశారు.

ప్రతిపక్ష గొర్రెల అవాకులు చెవాకులు దేశంలో ఎక్కడా లేనివిధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. వాళ్లవి అభివృద్ధి చేసిన ముఖాలా.. సంక్షేమం చూసిన ముఖాలా.. అని ఎద్దేవాచేశారు. గొర్రెల పంపిణీ పథకాన్ని చూసి దేశంలో అనేకమంది అశ్చర్యపడుతున్నారు. మన రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల గొర్రెలు మాత్రం అవాకులు చెవాకులు పేలుతున్నాయి అని సీఎం విమర్శించారు. 84 లక్షల గొర్రెలు తెచ్చేటప్పుడు వివిధ కారణాలతో కొన్ని చనిపోవా? ఎక్కడో పది గొర్రెలు చనిపోతే వాట్సప్, ఫేస్‌బుక్కుల్లో విమర్శలు చేస్తున్నారు అన్నారు. ఇటువంటి సన్నాసులను ఖాతరు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. దేశాన్ని 45 ఏండ్లు, రాష్ర్టాన్ని 47 ఏండ్లు కాంగ్రెస్ పాలించింది. వారి పాలన ఎలా ఉందో చూడలేదా? వాళ్లు ఏమైనా కొత్తగా వచ్చారా? హిమాలయాల్లో ఆకు పసరు తాగి వచ్చారా? అని సీఎం ప్రశ్నించారు. మనం వీరి విషయంలో పొరపాటుచేస్తే పంటికి అందకుండా మింగేస్తారుతప్ప ప్రజలకు సంక్షేమకార్యక్రమాలు చేయరని చెప్పారు. వాళ్లకు ఆ అలవాటు లేదని, చేసే వారైతే అప్పుడే చేసేవారని చెప్పారు. వాళ్లు చేసిన అనేక దుర్మార్గాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. పేకాట బంద్‌చేశాం. గుడుంబాను నిషేధించాం. కల్తీలకు పాల్పడితే తోలు తీయమని చెప్పాం. దీంతో కల్తీగాళ్లు గడగడలాడుతున్నారు అని సీఎం చెప్పారు. పరికి కంపల్లా అంటుకున్న ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటా వస్తున్నామని, ఈ రోజు గంజాయి, మాదక ద్రవ్యాల్లాంటి విషయాలను కూడా చీల్చి చెండాడుతున్నామని చెప్పారు.

కరీంనగర్ ఆదర్శం కావాలి.. కరీంనగర్ ప్రజల దీవెన తెలంగాణ సాధన వరకు నడిపించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు హరితహారం అదే ఊపుతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌ను లండన్‌లా చేస్తామని గతంలో తాను హామీ ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అందులో భాగంగానే అనేక పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ఇటీవలే రూ.500 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. కలెక్టరేటు హెలిప్యాడ్ వద్ద అధునాతన హంగులతో కళాభారతి ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హరితహారం కార్యక్రమానికి కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమీషనర్ కమలాసన్‌రెడ్డి బాగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. 25వేల మొక్కలను నాటి, సంరక్షించే బాధ్యతను తీసుకుంటామన్న కమలాసన్‌రెడ్డిని సీఎం అభినందించారు. మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌కుమార్ నేతృత్వంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, జోగురామన్న, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్, టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్ శంకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

మనుమడి పేరుతో మొక్క నాటిన కేసీఆర్ మూడో విడుత హరితహారం ప్రారంభ సూచికగా మానేరు డ్యాం పరిధిలో మహాగని మొక్కనాటిన సీఎం.. ఇదే సమయంలో తన మనుమడి పేరిట మరో మొక్క నాటారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు పుట్టిన రోజు (బుధవారం) సందర్భంగా అతడి పేరుతో మొక్క నాటాలని మేయర్ రవీందర్‌సింగ్ సీఎంను కోరగా, హిమాన్షు పేరిట కదంబ మొక్కను కేసీఆర్ నాటారు. తన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ హిమాన్షు పేరుతో మొక్క నాటారని మేయర్ తెలిపారు.

వెల్లివిరిసిన హరితోత్సాహం -అంబేద్కర్ స్టేడియంలో విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు మొక్కలు నాటుదాం.. ప్రకృతి అందాలను పంచుదాం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. -సుల్తాన్‌బాద్ మండలం ర్యాకల్‌దేవ్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్ అభిమాని కట్కూరి నర్సింహారెడ్డి గులాబీ రంగు వస్త్ర వేషధారణలో గొడుగు పట్టుకొని వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. -వేదిక వద్ద ఓ చిన్నారి మొక్కలు, పండ్లను అలకరించుకుని సభికుల దృష్టిని ఆకర్షించింది. -సభకు వచ్చిన ప్రజలు, మహిళలు, విద్యార్థులు సభ ముగియగానే ప్రభుత్వం తరఫున అందజేసే మొక్కలను తీసుకునేందుకు ఆసక్తి చూపారు. మామిడి మొక్కల కోసం పోటీ పడ్డారు. -కార్పొరేటర్ సునీల్‌రావు ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు మొక్కల వేషధారణతో వచ్చి ఆకట్టుకున్నారు. -కేసీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు డీ సంపత్ ఆధ్వర్యంలో నగరంలో 300మంది బైక్‌ర్యాలీ నిర్వహించి సీఎంకు స్వాగతం పలికారు. -ఎన్టీఆర్ చౌరస్తా నుంచి రాంపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా విద్యార్థులు వివిధ పూల మొక్కలు చేబూని సీఎంకు స్వాగతం పలికారు. -తెలంగాణలో ఉన్నవారందరూ వీఐపీలేనని రసమయి బాలకిషన్ పేర్కొనటంతో ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. -సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కరీంనగర్ మేథోశక్తి ఉన్న నగరమని పేర్కొనడంతో ప్రజలు కేరింతలు కొట్టారు. -ప్రజాప్రతినిధులందరూ పట్టుబడితే కరీంనగర్ పచ్చని నగరంగా మారుతుందని, దీనికి మీరు ఏమంటారని సీఎం కేసీఆర్ ప్రశ్నించగా చేస్తామంటూ నాయకులు, ప్రజలు స్పందించారు. -నగరంలోని వివిధ కళాశాలలకు, స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -సీఎం ప్రసంగాన్ని విద్యార్థులు ఎల్‌ఈడీ తెరలపై చూస్తూ శ్రద్ధగా వినడం కనిపించింది. -సీఎం కేసీఆర్‌కు నగర మేయర్ రవీందర్‌సింగ్ వెండితో తయారు చేసిన మెమొంటోను అందించారు. -జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ సీఎం కేసీఆర్‌కు తులసి మొక్కను అందించారు. -స్టేడియం పూర్తిగా నిండిపోగా ప్రజలు స్టాండింగ్ బెంచీలపై కూడా కూర్చొని సీఎం ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.