-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు.. ముగ్గురు అమరుల కుటుంబాలకు రూ.30 లక్షలు -కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో 312 మందికి రూ.1.59 కోట్లు పంపిణీ

తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 312 మంది జంటలకు రూ.1.59 కోట్లు, ముగ్గురు అమరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెక్కులను మంత్రిహరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు.
తెలంగాణ కోసం అమరులైన జహీరాబాద్ మండలం అల్గోల్‌కు చెందిన చల్ల బక్కారెడ్డి, జిన్నారం మండలం గుమ్మడిదలకు చెందిన ఆకుల సాయికుమార్, న్యాల్‌కల్ మండలం భసంత్‌పూర్‌కు చెందిన ఈశాన్‌రెడ్డి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల భూ పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా రూ.30 కోట్లతో 659 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. భూ పంపిణీలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. భూ పంపిణీ పథకానికి ఇంకా రూ.20 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.