-అమెరికా నుంచి హైదరాబాద్‌కు తేవడంలో ఎనలేని కృషి -మరిన్ని విదేశీ పెట్టుబడులకు దారితీసిన భారీ డీల్

ప్రఖ్యాతిగాంచిన ఐటీ సంస్థ అమెజాన్ అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విశేషంగా కృషి చేశారు. మంత్రి కేటీఆర్ ఫలితంగానే అమెజాన్ సంస్థ దేశంలోనే అతి పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్‌ను గచ్చిబౌలిలో నెలకొల్పింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడిని తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ కంపెనీ విస్తరిస్తున్న తీరును పసిగట్టడం, వారిలో భరోసా నింపి వారి తదుపరి పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్‌ను మార్చడంలో మంత్రి కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. అమెజాన్ చేసిన తాజా పెట్టుబడి ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూడటం ఖాయంగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేటీఆర్ అమెజాన్‌తో భేటీకి ఆ సంస్థ ప్రతినిధులను సమయం కోరారు. 2014 ఆగస్టులో తొలిసారిగా అధికారికంగా భేటీ అయ్యారు. నాటి నుంచి పలుమార్లు ఆ సంస్థ ప్రతినిధులను కలుసుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలు, తమ ప్రభుత్వ విధానాలు, శాంతి భద్రతల పరిస్థితి, సానుకూల వాతావరణం, అందుబాటులో ఉన్న మానవ వనరుల గురించి వివరించి, ఒప్పించారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించేలా శ్రమించారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీఅయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కంపెనీల సీఈవోలు, నిర్వాహకులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభావితం చేయగలిగారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. టీఎస్ఐపాస్ గురించి చెప్పడంతో అమెరికాలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యపోయారు.