Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అంబేద్కర్‌ పార్లమెంట్‌!

-దేశ చట్ట సభల భవనానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టాలి..
-తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
-అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాల నాయకుడే కాదు.. అందరి వాడు
-గాంధీకి ఏ మాత్రం తగ్గని మహానేత
-ప్రజాస్వామ్య పాలకుల వైఫల్యంపై ముందే హెచ్చరించిన దార్శనికుడు
-దేవుని గుడిలో అసురులు జమైతే దానిని ధ్వంసం చేయాల్సిందేనన్నారు
-తీర్మానం ప్రవేశపెడుతూ కేటీఆర్‌ నివాళి
-రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని అంబేద్కర్‌హెచ్చరించారు.

సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఔన్నత్యం, జాతీయ సమైక్యతకు అంబేద్కర్‌ సమున్నత ప్రతీక. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే ఆయన బోధనలను టీఆర్‌ఎస్‌ ఆచరణలో చూపింది.
-మంత్రి కేటీఆర్‌

తెలంగాణ అసెంబ్లీలో చరిత్రాత్మక సన్నివేశం చోటుచేసుకొన్నది. భారతదేశ అత్యున్నత చట్టసభకు రాజ్యాంగ నిర్మాత, మహాదార్శనికుడు, సామాజిక న్యాయ పోరాట రథసారథి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరుపెట్టాలన్న తీర్మానాన్ని సభ ముక్తకంఠంతో ఆమోదించింది. మహోన్నత నేత స్మృతికి గురుతరమైన నివాళులు సమర్పించింది. దేశంలోని ఇతర శాసనసభలకు ఆదర్శంగా నిలిచింది. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్‌ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని, అదే ఆయనకు మనం ఇచ్చే గౌరవమని రాష్ట్ర మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలంటూ మంగళవారం అసెంబ్లీలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారతదేశ ఆధునిక రాజకీయాల్లో అంబేద్కర్‌ను మించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఎవరూ లేరని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అత్యున్నత రూపమైన పార్లమెంట్‌ నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు, మహామేధావి అంబేద్కర్‌ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా మూల కారణం అంబేద్కర్‌ అని, రాజ్యాంగంలో ఆర్టికల్‌-3 లేకపోతే, కొత్త రాష్ర్టాలకు అవకాశం ఇవ్వకపోతే.. ఈ రోజు మనకు సొంత రాష్ట్రమే లేదని, ఈ శాసననసభే లేదని అన్నారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడం తన అదృష్టమని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత, దార్శనికుడు, సామాజిక విప్లవకారుడు, ఆర్థిక నిపుణుడు, రాజకీయ తత్వవేత్త, పీడిత ప్రజల ప్రియ బాంధవుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామిక ఔన్నత్యం, జాతీయ సమైక్యతకు అంబేద్కర్‌ సమున్నత ప్రతీక అని పేర్కొన్నారు. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేద్కర్‌ బోధనలను ఆచరణలో చూపిన పార్టీ టీఆర్‌ఎస్‌ అని, తమ నాయకుడు కేసీఆర్‌ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ, తెలంగాణ ప్రయోజనాలకు, హక్కులకు విఘాతం కలిగిన ప్రతిచోటా పోరాడుతూ.. 14 ఏండ్లపాటు అంబేద్కర్‌ చూపిన బాటలో నడిచి, ఆయన రాసిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రం సాధించుకున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని వివరించారు.

ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనం
అంబేద్కర్‌ రాసిన ప్రజాస్వామ్యం-విద్య అనే పుస్తకంలో ప్రజాస్వామ్యానికి నిజమైన నిర్వచనం చెప్పారని కేటీఆర్‌ కొనియాడారు. ప్రజాస్వామ్యం కేవలం పరిపాలనకు సంబంధించిన వ్యవహారం కాదని, అది పరస్పర సహకారంతో కూడిన జీవన విధానమని గొప్పగా చెప్పిన వ్యక్తి అంబేద్కర్‌ అని కీర్తించారు. ఒక్క చుక్క రక్తం చిందించకుండా సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఉపయోగపడే అద్భుతమైన ప్రజాస్వామిక ప్రక్రియ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అన్నారని గుర్తుచేశారు.

వైరుధ్యాలను తొలగించాలి.. లేదంటే ధ్వంసం కాక తప్పదు
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా భారతదేశం వర్ధిల్లాలని, దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకున్న గొప్ప నాయకుడు అంబేద్కర్‌ అని కేటీఆర్‌ కొనియాడారు. సామాజిక సమానత్వం వస్తేనే సంపూర్ణ స్వరాజ్యం వచ్చినట్టని అంబేద్కర్‌ చెప్పారని వివరించారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగానికి సంబంధించిన చర్చలో అంబేద్కర్‌ మాట్లాడుతూ.. ‘మన దేశంలో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజకీయంగా ‘ఒక మనిషికి ఒక ఓటు’ అనే సూత్రాన్ని పాటిస్తాం. సామాజిక, ఆర్థిక జీవనంలో ఒక మనిషికి ఒకే రకమైన విలువ ఉండాలనే సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉన్నాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించాలి. లేనిపక్షంలో ఎంతో శ్రమతో నిర్మించుకున్న రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం చేస్తారు. కాబట్టి ప్రజాస్వామిక వాదులు జాగ్రత్తపడాలి’ అని 73 ఏండ్ల కిందటే ప్రమాద ఘంటికలను మోగించి హెచ్చరించారని గుర్తు చేశారు.

పాలకులు సరిగ్గా లేకుంటే..
రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని అంబేద్కర్‌ చేసిన హెచ్చరికలను మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. పాలకులు సరిగ్గా లేకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి, హెచ్చరించిన దార్శనికుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. ‘నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే’ అంటూ అంబేద్కర్‌ చెప్పిన మాటలను కేటీఆర్‌ గుర్తు చేశారు. ‘దేవుడి కోసం కట్టిన గుడిలో దేవుడికన్నా ముందే దెయ్యం వచ్చి కూర్చుంటే.. ఆ గుడిని ధ్వంసం చేయక తప్పదు కదా. దేవుళ్లు ఉండాల్సిన గుడిలో అసురులను ఉండనిస్తమా?’ అంటూ 1955 మార్చి 18న రాజ్యసభలో అంబేద్కర్‌ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేశారు. పాలకులు సరిగ్గా పనిచేయకపోతే.. ఇంత గొప్పగా కట్టిన గుడిలో కూడా అసురులు జమైతే.. దాన్ని ధ్వంసం చేయక తప్పదని, ఇది ప్రజాస్వామ్య పునాదులకు విఘాతం కలిగిస్తుందని ముందే చెప్పిన మహానుభావుడు అంబేద్కర్‌ అని కీర్తించారు.

అంబేద్కర్‌ అందరివాడు
అంబేద్కర్‌ బడుగు బలహీన వర్గాల నాయకుడు మాత్రమే కాదని, అందరివాడని, మహాత్మాగాంధీకి ఏమాత్రం తగ్గని మహానుభావుడని కేటీఆర్‌ కొనియాడారు. ఆ రోజుల్లోనే మహిళల హక్కుల కోసం పోరాడి.. తన పదవిని వదులుకున్నారని కీర్తించారు. ఆయన ఎంతో శ్రమకోర్చి, ఎంతో సమయాన్ని వెచ్చించి హిందూకోడ్‌ బిల్లును రూపొందించారని చెప్పారు. అందులో మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు, వారసత్వ హక్కు, బహుభార్యత్వం రద్దు వంటి ప్రగతిశీల అంశాలను పొందుపరిచారని గుర్తుచేశారు. ఆ బిల్లు ఆమోదం పొందలేదనే బాధతో రాజీనామా చేసిన గొప్ప నాయకుడు అంబేద్కర్‌ అని అన్నారు.

తెలంగాణ జాతి సర్వదా రుణపడి ఉంటుంది
రాష్ట్ర శాసనసభ ఆమోదంతో గానీ, అంగీకారంతో గానీ నిమిత్తం లేకుండానే పార్లమెంట్‌లో సింపుల్‌ మెజారిటీతో కొత్త రాష్ర్టాన్ని ఏర్పాటు చేయొచ్చని ఆర్టికల్‌-3లో పొందుపర్చిన మహానుభావునికి తెలంగాణ జాతి యావత్తు రుణపడి ఉంటుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలన్న శాసనసభ తీర్మానానికి మద్దతు తెలిపిన భట్టి విక్రమార్క, అహ్మద్‌ బలాలకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ నేతలకు ఇష్టం లేదేమో..
ఈ తీర్మానానికి బీజేపీ మిత్రులు కూడా మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వడం అంటే ఈ దేశం, ఈ సభ తనను తాను గౌరవించుకోవడం వంటిదని చెప్పారు. బీజేపీ సభ్యుడు చర్చ సందర్భంగా బయటికి వెళ్లారని, బహుశా వారికిది ఇష్టం లేదేమోనని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అనంతరం సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

సీఎం కేసీఆర్‌కు భట్టి కృతజ్ఞతలు
ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టే విధంగా తీర్మానం చేయాలని కోరిన వెంటనే అంగీకరించిన సీఎం కేసీఆర్‌కు, తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన మంత్రి కేటీఆర్‌కు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు.

అంబేద్కర్‌కు సాటి వచ్చే నాయకుల్లేరు
భారతీయ సమాజాన్ని, భారతీయతను అంబేద్కర్‌ అర్థం చేసుకున్నంత లోతుగా సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరూ అర్థం చేసుకోలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. పరిపాలన సంస్కరణలపై బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌంట్‌ఫోర్డ్‌ కమిటీ ఎదుట అంబేద్కర్‌ చెప్పిన మాటలను ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తుచేశారు. ‘మీరు చట్టాలు చేస్తానంటున్నారు సంతోషం.. సంస్కరణలు తెస్తామంటున్నారు సంతోషం. కానీ చట్టాలు, సంస్కరణలు తెచ్చే ముందు భారత సమాజాన్ని అర్థం చేసుకోండి’ అని అంబేద్కర్‌ చెప్పిన మాటలు ఆయన తత్వం, ఆయన లోతైన, సునిశిత పరిశీలన, సమాజం పట్ల అవగాహనకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.

జనవరి కల్లా అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం పూర్తి
పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పారు. ‘అంబేద్కర్‌ 125 వ జయంతి సందర్భంగా కొంతమంది మా పార్టీ మిత్రులు సీఎం వద్దకు వెళ్లి.. వేడుకలను ఘనంగా చేద్దామని కోరారు. అప్పుడు భవిష్యత్తు తరాలు కూడా గుర్తుంచుకునేలా 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఐమ్యాక్స్‌ పక్కన దీని నిర్మాణం జరుగుతున్నది. జనవరి వరకు నిర్మాణం పూర్తి చేసుకుని ఆవిష్కరణకు సిద్ధమవుతుంది. పంజాగుట్టలో అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేసినందుకు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారే తప్ప అంబేద్కర్‌పై గౌరవం లేక కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.