Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అంబేద్కర్ వల్లే తెలంగాణ

-ఆయన సిఫారసు వల్లే రాష్ట్రం సాధించాం -భరతమాత ముద్దుబిడ్డ బాబా సాహెబ్ -తెలంగాణ సమాజం ఆయనకు రుణపడి ఉంది -దళితులు, గిరిజనులు మరింత అభివృద్ధి చెందాలి -అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో సీఎం కేసీఆర్ -125 అడుగుల కాంస్య విగ్రహానికి శంకుస్థాపన -అంబేద్కర్ టవర్స్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌కు భూమిపూజ -దళిత, గిరిజన విద్యార్థులపై సీఎం వరాలజల్లు -దళిత విద్యార్థులకు 100 సోషల్ రెసిడెన్సియల్ స్కూళ్లు -మరో 25 బాలికల, 5 బాలుర డిగ్రీ రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాలలు -విదేశాల్లో విద్యాభ్యాసానికి స్కాలర్‌షిప్ రూ.20 లక్షలకు పెంపు -కేజీ టు పీజీ విద్యావిధానం ప్రారంభమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటన

CM KCR in 125th Ambedkar jayanthi  (4)

యావత్ ప్రపంచానికి తన జీవితమే ఆదర్శంగా గొప్ప సందేశం ఇచ్చిన జాతిరత్నం అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్లాఘించారు. ఆయన చలువ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడిందని, రాష్ర్టాల ఏర్పాటుపై రాజ్యాంగంలోఆయన పొందుపరిచిన చట్టం కారణంగానే నేడు తెలంగాణ స్వరాష్ట్రంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నదని అన్నారు. ఆ మహనీయుడికి తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉందని, ఆయన జయంతి ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించుకున్నా తక్కువేనని అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా దళిత, గిరిజన విద్యార్థులపై వరాలజల్లు కురిపించారు. వారి అభ్యున్నతికి వంద గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యావిధానాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ గురుకుల విద్యాలయాల ఏర్పాటుతో ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంత్యుత్సవాల సందర్భంగా తొలుత యూసుఫ్‌గూడ ప్రాంతంలో నిర్మించనున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం, ఆ తర్వాత ట్యాంక్‌బండ్ వద్ద 15 అంతస్తుల్లో నిర్మించే అంబేద్కర్ టవర్స్‌కు భూమిపూజ చేసి శంకుస్థాపన జరిపారు. ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన 125 ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహానికి మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే సమాజంలోని పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు పునరంకితమవుతున్నదని సీఎం పేర్కొన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

అంబేద్కర్ గారికి తెలంగాణ సమాజం రుణపడి ఉంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆయన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు.

దేశంలో ఏదైనా రాష్ట్రం విడిపోవాలంటే ఖానూన్ ఎక్కడ ఉండాలని, అధికారం ఎక్కడ ఉండాలి రాజ్యాంగం రాసిన నాడు చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాణ సభలో అంబేద్కర్ మినహా మిగిలిన వందశాతం సభ్యులు ఆ అధికారం రాష్ర్టాలకే ఉండాలని వాదించారు. ఒక్క అంబేద్కర్ మాత్రమే ఆ అధికారం కేంద్రం దగ్గర ఉండాలన్నారు. అప్పటికి సాయంత్రం కావటంతో తానెందుకు కేంద్రం వద్ద అధికారం ఉండాలంటున్నదీ మరునాడు నోట్ ఇస్తానని చెప్పారు. ఆ రాత్రంతా నిద్రమానుకుని కష్టపడి, ఒక నోట్ తయారు చేసి, తెల్లవారి సభ్యులకు ఆ నోట్ ఇచ్చారు. అది చదివిన తర్వాత వందశాతం మీరు చెప్పిందే కరెక్ట్ .. ఈ అధికారం కేంద్ర వద్దనే ఉండాలని మేం కూడా ఒప్పుకుంటున్నం అని అందరూ చెప్పారు. ఆ నోట్‌లో ఆయన రాసిందేందంటే…రాష్ర్టాల్లో కూడా కొన్ని బలహీన ప్రాంతాలు ఉండొచ్చు, బలమైన ప్రాంతంవాడు ఈ బలహీన ప్రాంతాన్ని పట్టిపీడిస్తుండొచ్చు. కాబట్టి బలహీనుడు మొర పెట్టుకోవాలంటే కేంద్రం దగ్గకు వచ్చే వెసులుబాటు ఉండాలి..అని చెబితే అందరూ ఒప్పుకున్నరు. ఆనాడు అంబేద్కర్‌గారు రాజ్యాంగసభలో వాదించి, బలహీనంగా ఉన్న వాళ్లకు కచ్చితంగా కేంద్రం అండగా ఉండాలని ఆ చట్టాన్ని తయారు చేసిన పుణ్యం వల్ల ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ సమాజం రుణపడి ఉంది. ఆయన జయంతి సందర్భంగా మనం ఎంత గొప్పగా నివాళులర్పించినా తక్కువే.

అందుకే ఇక్కడ విగ్రహం పెట్టాలని నిర్ణయించాం ఈ సందర్భంగా మనం కొన్ని శుభవార్తలు చెప్పుకోవాల్సి ఉంది. అంబేద్కర్ విగ్రహం ఎక్కడ పెట్టాలో స్థలం నిర్ణయం చేసేందుకు మేం ఆలోచిస్తుంటే.. అంబేద్కర్ నమ్మినటువంటి బుద్ధుడు ట్యాంక్‌బండ్ మధ్యలో ఉన్నారు. కాబట్టి బుద్ధుడు ముందు ఉండాలి. బుద్ధుడి బాటలో అంబేద్కర్‌గారి విగ్రహం ఉండాలి. ఆయన వెనక మన సెక్రటేరియట్ ఉండాలని భావించి ఈ స్థలాన్ని ఎంపిక చేసినం. విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తులో, సగర్వంగా హైదరాబాద్ నగరంలో ల్యాండ్‌మార్క్‌గా ఉండాలని భావించి 125 అడుగుల కాంస్య విగ్రహానికి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నం. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ట్యాంక్‌బండ్ కింద అంబేద్కర్ భవనం ఉంది. అది సరైన పద్ధతిలో లేదు. అందుకే అంబేద్కర్ విగ్రహం చూపించే దిక్కులో ట్యాంక్‌బండ్‌కి ఈశాన్యంగా 15 అంతస్తుల్లో అంబేద్కర్ టవర్స్‌కి కూడా ఈరోజు మనం పూజ చేసుకున్నాం. దానిలో దళిత, గిరిజన సమాజం అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా మిత్రుడు మల్లేపల్లి లక్ష్మయ్యతోపాటు అనేక మంది మిత్రులు సెంటర్‌ఫర్ దళిత్ స్టడీస్ అని దళితుల మంచి చెడ్డ తెలుసుకుని సమాజాన్ని, ప్రభుత్వాన్ని మేల్కొలిపే విధంగా ఓ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఏ ప్రభుత్వం దానికి జాగా ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు జాగా ఇవ్వడమే కాకుండా 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఇచ్చి, అద్భుతమైన సెంటర్‌ఫర్ దళిత్ స్టడీ సెంటర్ భవనానికికూడా ఈ రోజు నేను భూమి పూజ చేశానని చెబుతున్నాను. ఈ మూడు మంచి ల్యాండ్‌మార్క్ కార్యక్రమాలు మనం తీసుకున్నాం.

కేజీ టు పీజీ విధానాన్ని ప్రకటిస్తున్నా… దళితుల్లో వెనకబాటుతనాన్ని నిర్మూలించేందుకు ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అంబేద్కర్ పుణ్యమా అని కొన్ని రిజర్వేషన్లు వచ్చి కొందరికి ఉద్యోగాలు, మరికొందరికి రాజకీయ అవకాశాలు దొరకవచ్చు. కానీ దళిత సమాజంలో రావాల్సినంత గుణాత్మక మార్పు రాలేదు. మనకు ఎవరికీ సంతృప్తి లేదు. కాబట్టి కొన్ని ప్రబలమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకుముందు ప్రసంగించిన కడియం శ్రీహరిగారు.. దళిత విద్యార్థులకు మామూలు పాఠశాలలు కాదు, గురుకుల పాఠశాలలు కావాలని కోరారు. మరో దళితబిడ్డ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ గారు సోషల్‌వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలను అద్భుతంగా నడుపుతున్నారు. నేను రాష్ట్రంలో ఏ జిల్లాకి పోయినా ప్రజాప్రతినిధులంతా మాకు కూడా ఎస్సీ గురుకుల పాఠశాలలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రసమయి బాలకిషన్, బాల్క సుమన్, బాలరాజుగారు చెప్పారు. ఎస్సీ అమ్మాయిలు గురుకుల పాఠశాలల్లో 12వ తరగతి వరకు చదివిన తర్వాత డిగ్రీ చదివే అవకాశం లేదు. దీనిపై ఈ మధ్య విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూర్చుని ఎంత ఖర్చయినా వారిని ఆదుకోవాలని నిర్ణయించాం.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా చాలా సంతోషంగా, సగర్వంగా నేను ప్రకటిస్తున్నా, వచ్చే జూన్ నుంచే వంద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం. సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. అదేవిధంగా దళిత విద్యార్థినులు ఇంటర్మీడియట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చదువుకునే అవకాశం రావడం లేదు. వారికి హాస్టళ్లు, సరైన వసతి లేవు. ఆ అమ్మాయిల కోసం రెండు, మూడు నియోజకవర్గాలకు మధ్య ఒక డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల ఉండేలా 25 రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నాం. అవి కూడా విద్యాశాఖ కింద కాకుండా సొసైటీ కిందనే పనిచేస్తాయి. అబ్బాయిల కోసం కూడా ఐదు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తున్నాం. గిరిజన గురుకుల పాఠశాలలు ఉండాల్సిన తీరులో లేవు. రెండో దశలో గిరిజన విద్యార్థుల కోసం 50 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నా. దేశంలోనే మొదటి సారిగా మైనార్టీ సోదరుల కోసం 70 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. అవి ఈ విద్యాసంవత్సరంలోనే ప్రారంభిస్తాం. ఇలా దళిత, గిరిజన, మైనార్టీ విద్యార్థుల కోసం మొత్తం 250 రెసిడెన్షియల్ పాఠశాలలు ఈ ఏడాది నుంచే ప్రారంభించబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నా. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంపై కొందరు తెలిసితెలియక బాధ్యత లేకుండా విమర్శలు చేశారు. వారికి నేను ఈ రోజు సమాధానం చెబుతున్నా. ఈ 250 విద్యాసంస్థలు కూడా కేజీ టు పీజీలో భాగమే. అంబేద్కర్ 125 జయంతి సదర్భంగా కేజీ టు పీజీ విద్యావిధానాన్ని ప్రకటిస్తున్నానని మనవి చేస్తున్నా.

ఇప్పటికైనా మారండి.. చదువు కోసం వచ్చి పట్టణాల్లో రూమూలు అద్దెకు తీసుకుందామనుకునే దళిత విద్యార్థులకు ఇప్పటికీ కొంతమంది దరిద్రులు, మార్పు రాని వారు మీకు రూంలు ఇవ్వం అని చెప్పే పరిస్థితులు ఉన్నయి. నేను సిగ్గుపడుతున్నా. అటువంటి సన్నాసులు..తమ మనసు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి అని ముఖ్యమంత్రిగా ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నా.

దళిత బిడ్డలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి..

దళిత, గిరిజన బిడ్డలు ఉద్యోగాలు అడిగే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అందుకోసం తెలంగాణ పారిశ్రామిక విధానంలో టీఎస్ ప్రైడ్ కార్యక్రమాన్ని పెట్టాం. గిరిజన ఇంజినీరింగ్ బిడ్డలకు న్యాక్‌లో ట్రైనింగ్ ఇస్తున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ బ్యాచ్ బయటికి రాబోతున్నది. జేసీబీలు, ప్రొక్లెయినర్స్, డంపర్స్‌తోపాటు కనీస పెట్టుబడి కూడా వందశాతం ప్రభుత్వమే అందించి దళిత కాంట్రాక్టర్లను తయారు చేయబోతున్నాం. దళిత, గిరిజన విద్యార్థులు విదేశాల్ల్లో చదువుకోవాలంటే రూ.10లక్షల స్కాలర్‌షిప్ మాత్రమే ప్రభుత్వం ఇచ్చేది. ఈరోజు నుంచి దాన్ని రూ.20 లక్షలకు పెంచుతున్నాం. కల్యాణలక్ష్మి, పేదలకు బియ్యం పంపిణీ ఇలా అనేక కార్యక్రమాలు పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చేపడుతున్నది. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అంబేద్కర్ ఏరకంగా తపన పడ్డారో.. ఆ దిశగానే రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు గతేడాది, ఈ ఏడాది కలిపి 2లక్షల 60వేల ఇండ్లు కట్టబోతున్నాం. విధివిధానాలు ఖరారైపోయాయి. పనులు శరవేగంగా పూర్తిచేస్తాం. దళితులకు మూడెకరాల భూమి కొనిస్తామని చెప్పాం. 8వేల ఎకరాలు కొని ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ప్రతి నెలా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఒకనెల దళితులకు భూమికొని ఇచ్చే పథకాన్ని కూడా తీసుకుని పెద్ద ఎత్తున అమలు చేస్తాం. అంబేద్కర్‌గారు జీవితాంతం బక్కోళ్ల పక్షాన ఉన్నారు. కేసీఆర్ కూడా బక్కగనే ఉన్నడు. బక్కగా ఉండి కొట్లాడినా రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చిన చట్టం ఉంది కాబట్టి, ఆయన దయవల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగాం. 2012 జూన్‌లో పరిశోధనలు చేసి అంబేద్కర్‌గారికి దగ్రేటెస్ట్ ఇండియన్ బిరుదు ఇచ్చారు. ఆ గౌరవం దేశంలో ఇండియాలో ఎవరికీ దక్కలేదు. ఆయన 125వ జయంతి సందర్భంగా మా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పునరంకితమవుతుంది. జై తెలంగాణ..జై భీం.. అని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

యోగా చాంపియన్‌కు రూ.5లక్షలు చెక్కు .. బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ యోగా పోటీల్లో యోగా చాంపియన్‌గా గెలుపొందిన మహబూబ్‌నగర్ జిల్లాకి చెందిన సుందర్‌రాజ్‌కు ఈ సభావేదిక మీద రూ.5 లక్షల చెక్కును సీఎం అందజేశారు. సుందర్‌రాజ్ తల్లిదండ్రులను సీఎం శాలువాతో సన్మానించారు. కాగా సభలో గురుకుల విద్యార్థులు సందడి చేశారు. సీఎం కేసీఆర్ ప్రసంగానికి అడుగడుగునా హర్షధ్వానాలు చేశారు. ముఖ్యంగా దళిత, గిరిజన గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సీఎం ప్రకటిస్తున్నపుడు విద్యార్థులంతా సీట్లలోంచి లేచి లయబద్ధంగా చప్పట్లు కొట్టి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగంలో చమక్కులు కూడా సభికులను అలరించాయి. అంబేద్కర్ బక్కోళ్ల పక్షంలో నిలిచారని అంటూ తానుకూడా బక్కోడినేనని కేసీఆర్ అన్నారు. ఈ మాటలకు కడియం నవ్వుతుండగా కేసీఆర్ బక్కోడు అంటే శ్రీహరిగారు నవ్వుతున్నారు..అనగానే సభ గొల్లుమంది. సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక సారథి కళాకారుల ఆట, పాట ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్ఫూర్తిని, పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను కళాకారులు పాటల ద్వారా తెలియజేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎస్సీ అభివృద్ధి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అజ్మీరా చందూలాల్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బాల్కసుమన్, పసునూరి దయాకర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు సాయన్న, రసమయి బాలకిషన్ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.