Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అమ్మ భాషకు జయహో

-అన్ని పాఠశాలల్లో తప్పనిసరి తెలుగు బోధన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం -2018-19 విద్యాసంవత్సరం నుంచి అమలు -తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకొస్తున్న సీఎం కేసీఆర్ -అమ్మ ఒడి పలుకులు.. బడిపలుకులు కావాలనేదే లక్ష్యం: కడియం -సాహిత్య అకాడమీ, తెలుగు వర్సిటీలకు తెలుగు వాచకాల రూపకల్పన బాధ్యత -స్టేట్ సిలబస్‌తోపాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ పాఠశాలల్లో ఇక తెలుగు వెలుగులు -అసెంబ్లీలో బిల్లుకు ఆమోదంతో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు -మెడికోలకు ఏడాది రూరల్ సర్వీస్ మినహాయింపు -డీజీపీ నియామక అధికారం ఇక రాష్ట్రానికే -అసైన్డ్ భూములను కొన్న పేద రైతులకు ఊరట -కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

కమ్మనైన అమ్మభాషకు పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న అపూర్వ నిర్ణయం అమలు దిశగా తొలి అడుగు పడింది. తెలుగుభాషను సర్కారు, ప్రైవేటు బడుల తేడాలు లేకుండా పిల్లలందరికీ అందుబాటులోకి తేవాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి శాసనబద్ధత లభించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన పాఠశాలల్లో తప్పనిసరి తెలుగు బోధన బిల్లును శాసనసభ శనివారం ఆమోదించింది. 2018-19 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిలబస్‌తో నడుస్తున్న అన్ని రకాల పాఠశాలల్లో దీనిని అమలుచేయనున్నారు. దీంతోపాటుగా మొత్తం ఆరు బిల్లులు శాసనసభ ఆమోదం పొందాయి. అసైన్డ్ భూములు కొన్న పేదలకు వాటిపై హక్కును దఖలుపర్చేందుకు తీసుకువచ్చిన తెలంగాణ అసైన్డ్ భూముల సవరణ బిల్లును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డీజీపీ నియామక అధికారాన్ని రాష్ర్టానికే కల్పించే బిల్లును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తరఫున శాసనసభ వ్యవహారాలు, సాగునీటిశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, మెడికోలకు ఏడాదిపాటు రూరల్ సర్వీస్ నుంచి మినహాయింపునిచ్చేందుకు ఉద్దేశించిన తెలంగాణ వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ చట్టం సవరణబిల్లును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి, తెలంగాణ న్యాయవాదుల గుమాస్తాల సంక్షేమ నిధి చట్టం సవరణ బిల్లు, తెలంగాణ న్యాయవాదుల సంక్షేమనిధి చట్టం సవరణ బిల్లులను రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. స్వల్పచర్చ అనంతరం సభ ఈ బిల్లులకు ఆమోదం తెలియజేసింది.

తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకురావడానికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పదో తరగతి వరకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బిల్లు ప్రవేశపెడుతూ కడియం శ్రీహరి చెప్పారు. బిల్లు ఉద్దేశాన్ని ఆయన సభకు వివరిస్తూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుభాష నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణలో జన్మించిన, ఇక్కడ చదువుతున్న విద్యార్థులు తెలుగు చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగుకు పూర్వవైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను అంగరంగ వైభవంగా నిర్వహించారని, అమ్మ భాష కమ్మదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. పదోతరగతి వరకు తెలుగు తప్పనిసరి చేయాలని మహాసభల సందర్భంగా సీఎం కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో మాతృభాషను ఏ విధంగా అమలు చేస్తున్నారనేది రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆధ్వర్యంలో అధ్యయనం జరిపించినట్టు తెలిపారు. తెలుగుభాష బోధనను 1 నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రెండు విభాగాలుగా అమలు చేస్తామని వివరించారు.

ఇతర మాతృభాషలైన తమిళం, ఉర్దూ, కన్నడం, మరాఠీ, బెంగాలీ భాషల్లో చదువుతున్నవారు వారి మాతృభాషలు చదువుతూనే తెలుగు చదువాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర సిలబస్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్ బోధించే అన్ని పాఠశాలల్లో కూడా తెలుగు తప్పనిసరి అని కడియం శ్రీహరి స్పష్టంచేశారు. దీన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తామని ప్రకటించారు. తెలుగు కాకుండా ఇతర మాతృభాషలుగా ఉన్న విద్యార్థులకు ఒకటి, ఆరో తరగతుల నుంచి తెలుగును ప్రవేశపెడుతామన్నారు. వీరికి అవసరమైన స్థాయిలో తెలుగువాచకాలను రూ పొందించే బాధ్యతను సాహిత్య అకాడమీ, తెలుగు యూనివర్సిటీలకు అప్పగించామని చెప్పారు. సీబీఎస్‌సీ, ఐసీఎస్‌ఈ పాఠశాలల్లో మొదటిభాషగా తెలుగు, రెండోభాషగా ఇంగ్లిష్, మూడోభాషగా ఆయా బోర్డులు ఇతర భాషలను ఎంపిక చేసుకోనే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ఇతర భాషలు మాతృభాషగా ఉన్నవారికి తెలుగులో పాస్ మార్కులు 20 మా త్రమే ఉంటాయని కడియం శ్రీహరి తెలిపారు.

ప్రతిపక్షాల ప్రశంసలు తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని ప్రతిపక్ష నేతలు అభినందించారు. ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఎంఐఎం సభ్యులు జాఫర్ హుసేన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఉర్దూ మీడియం పాఠశాలల విద్యార్థులకు తెలుగు పాస్ కావడానికి 20 మార్కుల నిబంధనను అమలు చేయాలని కోరారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని అన్నారు. వాడుకభాషలో ప్రభుత్వ ఆదేశాలు విడుదల చేయాలని సూచించారు. శాసనసభ నుంచే తెలుగు అమలు మొదలుకావాలని ఆకాంక్షించారు. ఇది విప్లవాత్మకమైన బిల్లుగా టీడీపీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అభివర్ణించారు. తెలుగు భాషను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మాతృభాషలో విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనాత్మకత ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలన్నారు. కోర్టుతీర్పులు కూడా తెలుగులో రావాలన్నారు. సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య కూడా బిల్లుకు మద్దతు తెలియజేశారు.

తెలుగు భాషకు వెలుగు పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి బోధనాంశం చేసే బిల్లుకు అసెంబ్లీ అమోదం లభించడంతో తెలుగు భాష ప్రేమికులలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాకం వల్ల తెలంగాణ విద్యార్థులు తెలుగును పూర్తిగా విస్మరించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. తెలుగుభాషను అమలు చేయని ప్రైవేటు పాఠశాలలపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదా ఆయా స్కూళ్ల గుర్తింపును రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా ఉంటాయని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారులు హెచ్చరికలు చేశారు. తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కూడా తెలుగు అమలు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. తెలుగు భాష అమలుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

పేదలకు న్యాయం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అసైన్డ్ సవరణ చట్టం వల్ల పేదలకు న్యాయం జరుగుతుంది. అసైన్డ్ భూములను చాలా వరకు భూమి లేని పేద రైతులే కొనుగోలు చేశారు. ఇలా పైసపైస కూడబెట్టుకొని భూమిని కొనుక్కొని సేద్యం చేస్తున్న పేద రైతులకు ఇబ్బందులు తొలుగుతాయి. అయితే అసైన్డ్ భూములను తిరిగి రీఅసైన్ చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటే పేదలకు న్యాయం జరుగుతుంది. – ఎం సునీల్‌కుమార్, నల్సార్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్

అసైన్డ్ రైతులకు తొలిగిన ఇబ్బందులు అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన పేదరైతుల ఇబ్బందులు తొలిగిపోయాయి. శనివారంనాడు అసైన్డ్ భూముల సవరణ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. చేతులు మారిన అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన పేదరైతులకు ఆ భూమిని అసైన్ చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళనలో 2,41,127 ఎకరాల అసైన్డ్ భూమిని పేద రైతులు కొనుగోలు చేసినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూములను కొనుగోలు చేసినవారికే అసైన్ చేయాలని ప్రభుత్వం భావించింది. 2017 డిసెంబర్ 31లోగా అసైన్డ్ భూమి కొనుగోలు చేసిన పేదరైతులకు ఈ చట్టం ప్రకారం రీఅసైన్ చేస్తారు. వాస్తవంగా 1977కు ముందు అసైన్డ్ అయిన భూముల క్రయవిక్రయాలు జరిగాయి. అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అమ్ముకున్న వారికే అప్పగించేలా 1997లో ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంపై అవగాహన లేని అసైన్డ్ రైతులు భూములను విక్రయించారు. మరోసారి 2007 జవనరి 29న అసైన్డ్ భూమిని కొనుగోలు చేసిన పేదరైతులకు తిరిగి రీఅసైన్ చేయాలని సవరణచట్టం తెచ్చారు.

ఈ మేరకు ఆనాటి వరకు జరిగిన క్రయవిక్రయాలను పరిశీలించి పేదలని గుర్తించినవారికి అసైన్‌చేశారు. కానీ అప్పటినుంచి కూడా క్రయవిక్రయాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసిన వారికి ఆ భూములను రీ అసైన్ చేయడానికి 2017 డిసెంబర్ 31ని కటాఫ్‌గా నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇది 2018 మార్చి 5 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ సవరణ చట్టం ప్రకారం ఎవరైనా గిరిజన హక్కుల చట్టం ఉన్న ప్రాంతాల్లో గిరిజనులకు అసైన్డ్ చేసిన భూములను కొనుగోలు చేస్తే వర్తించదని స్పష్టంచేసింది. పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మ్డడి రాష్ట్రంలో గుర్తించిన నోటిఫైడ్ ఏరియాలలో ఈ చట్టం వర్తించదని తెలిపింది. తెలంగాణలో హెచ్‌ఎండీఏతోపాటు 50 వరకు నోటిఫైడ్ ఏరియాలున్నాయి. ఈ ప్రాంతాలలో మూడవ చేతికి మారిన అసైన్డ్ భూములను రీ అసైన్ చేయరు.

డీజీపీ ఎంపిక అధికారం ఇక రాష్ర్టానిదే రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఎంపిక, నియామక అధికారం ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ మేరకు శనివారం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం.. రాష్ట్ర డీజీపీ ఎంపిక కోసం కేంద్రం అనుమతి కోసం చూడాల్సిన పని ఉండదు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2006 వరకు కూడా డీజీపీ ఎంపిక అధికారం రాష్ర్టాలదే. ప్రకాశ్‌సింగ్ అనే అధికారి సుప్రీంకోర్టులో కేసు వేయడంతో సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం రాష్ర్టాలు డీజీపీ నియామకానికి సంబంధించి నూతన చట్టాలు చేసుకునేవరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సూచించిన ముగ్గురు అత్యధిక సీనియర్ అధికారుల్లో ఒకరిని ఆయా రాష్ర్టాలు డీజీపీగా ఎంపిక చేసుకునేలా ఆదేశించింది. దీంతో డీజీపీ ఎంపిక ప్రక్రియకు సంబంధించి ప్రతిసారి అధికారుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి వస్తున్నది. డీజీపీ నియామక అధికారం తమకే ఉండేలా దేశంలోని దాదాపు అన్నిరాష్ర్టాలు చట్టాలు చేసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైతం ఈ చట్ట సవరణ చేసుకుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చట్ట సవరణ చేసుకున్నది. ఈ చట్టం ప్రకారం డీజీపీ నియామకం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరగనున్నది.

మెడికోలకు నిర్బంధ సేవల మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లుకు శనివారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ వైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్ చట్టం 1968కి చేసిన సవరణ ద్వారా.. ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఇకపై నిర్బంధంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించాల్సిన అవసరముండదు. గ్రామీణ సేవలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర వైద్యమండలి మెడికల్ గ్రాడ్యుయేట్లకు రిజిస్ట్రేషన్‌ను జారీచేస్తుంది. ఇప్పటివరకు ఏటా కంపల్సరీ సర్వీస్ కింద దాదాపు 1,400మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ల సేవల కోసం ఏటా రూ.82 కోట్లు వెచ్చించాల్సి వస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్‌ల పోస్టులను భర్తీ చేయడంతో ఆయా దవాఖానల్లో అవసరమైన వైద్యులు అందుబాటులోకొచ్చారు. దీంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ల నిర్బంధ సేవలు అవసరంలేదని వైద్య విధాన పరిషత్ ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే ప్రభుత్వం ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ల సేవలను మినహాయిస్తూ 2016లో జీవో ఇచ్చింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.