Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అండగా మేముంటాం..

-మాసాయిపేట మృతుల కుటుంబాలకు మంత్రి హరీశ్‌రావు భరోసా -బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేత – ఇంగ్లిష్ విద్యకోసమే ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు – కేజీనుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలుచేస్తాం – రాష్ట్రంలోని 116 రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్ల ఏర్పాటు – రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

Harish Rao01

గుండెలు పిండేసే మాసాయిపేట రైల్వే ప్రమాద ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి గాయపడ్డ పిల్లలను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించడంతో అనేకమంది విద్యార్థుల ప్రాణాలు నిలిచాయి. సహాయ చర్యల్లో పాల్గొనడంతో పాటు మంత్రులు దవాఖానాల వద్ద ఉండి అనుక్షణం వైద్యసేవలను పర్యవేక్షించడం, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దవాఖానకు వెళ్లి తగు సూచనలివ్వడంతో పిల్లలకు అత్యంత అధునాతన వైద్యాన్ని, అవసరమైన శస్త్రచికిత్సలను నిర్వహించారు. ఘటన సందర్భంగా ప్రదర్శించిన మానవతావాదాన్ని ప్రభుత్వం సహాయం అందించడంలో సైతం ప్రదర్శించింది. విషాదం జరిగిన మూడు రోజుల్లో ఆర్థిక సహాయం అందించింది.

మాసాయిపేట రైల్వే ప్రమాద ఘటనలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారంనాడు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ ప్రమాద ఘటన తెలియగానే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మొత్తంతోపాటు రైల్వే శాఖ ఇచ్చిన మరో రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 7 లక్షల చొప్పున 14 మంది విద్యార్థుల కుటుంబసభ్యులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అందజేశారు.

డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాపూర్ గ్రామాలకు వెళ్లిన హరీశ్‌రావు బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. చెక్కులు అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కాగా ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాసాయిపేట ఘటన అత్యంత విషాదకరమని, అభం శుభం తెలియని 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ప్రమాదఘటన తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కలత చెందారని తక్షణమే ప్రమాద స్థలికి తమను పంపించారని చెప్పారు. ఆయన ఆదేశంతో తనతో పాటు ఇతర మంత్రులు ఘటన స్థలానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేయగలిగామని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించడం వల్లనే మిగిలిన 20 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడుకున్నామన్నారు. చనిపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురాలేమని, అయితే మృతుల కుటుంబ సభ్యులకు మాత్రం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం అందించిన రూ. 7 లక్షలతో పాటు ఇన్య్సూరెన్స్ కంపెనీ నుంచి మరో రూ. లక్ష కూడా అందిస్తామని, గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వం నుంచి రూ. లక్ష, రైల్వే శాఖ నుంచి రూ. లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. గాయపడ్డ 20 మంది విద్యార్థులకు యశోద ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారన్నారు. వైద్య శాఖ మంత్రి రాజయ్య, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలు అక్కడే ఉండి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారని చెప్పారు. అందరూ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు.

106 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు.. మాసాయిపేట ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని హరీశ్‌రావు చెప్పారు. ముఖ్యమంత్రి రైల్వే అధికారులతో మాట్లాడారని, ఫలితంగా రాష్ట్రంలోని సుమారు 106 రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. హైదరాబాద్ డివిజన్ పరిధిలో 16 చోట్ల యుద్ధప్రాతిపదిక గేట్లు ఏర్పాటు చేస్తున్నారని, ఈ నెల 31లోగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లీష్ విద్య లభించకపోవడం వల్లే ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారని అభిప్రాయపడ్డా రు.

ఈ అంశాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించిందని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్య అమలు చేస్తామని హరీష్‌రావు చెప్పారు. చనిపోయిన విద్యార్థులను ఎవరూ తీసుకురాలేరని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ప్రభుత్వంతో పాటు అన్ని శాఖల అధికారులు, మీడియా తక్షణమే స్పందించాయని అన్నారు.

మా బిడ్డలెక్కడ సారూ… మా బిడ్డలెక్కడ సారూ.. ఇంగ్లీష్ చదువు కోసం వెళ్ళి కనిపించకుండా పోయిండ్రు సారూ.. అంటూ గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి, పుష్ప దంపతులు మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్వీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దంపతుల కుమారుడు చరణ్, కూతురు విద్య ఇద్దరూ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉన్న ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

మా పిల్లలు మమ్మల్ని వదిలిపోయారు సారూ.. అంటూ వారు భోరున విలపించారు. పోయిన మీ పిల్లలను తిరిగి తెచ్చిఇవ్వలేము కానీ మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని హరీష్‌రావు వారిని ఓదార్చారు. ఇంగ్లీషు చదువుకుని పెద్దవాైళ్లె మమ్మల్ని సాదుతారనుకున్నం..కానీ ఇలా వాళ్లు పై లోకాలకు పోయి ఇట్ల మమ్మల్ని(చెక్కులను చూపుతూ) సాదుతారనుకోలేదు సార్.. అంటూ దంపతులిద్దరు గుండెలు బాదుకోవడంతో అక్కడ జనం ఒక్కసారిగా గొల్లుమన్నారు. చెక్కుల పంపిణీకి మంత్రి హరీష్‌రావు వస్తున్నారని తెలిసి భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చారు. జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శరత్, రైల్వే అధికారులు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, గజ్వేల్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మంత్రి వెంట ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.