Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అందరికీ ఆరోగ్యం

-రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రోగనిర్ధారణ పరీక్షలు -ప్రభుత్వపరంగానే చికిత్స.. మందుల సరఫరా -పేదల ఆరోగ్యం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం -ఆశ వర్కర్లు, రెండో ఏఎన్‌ఎంల జీతాలు పెంచుతాం -కేసీఆర్ కిట్ల పథకం ప్రైవేటుకు అనుమతించం -రాష్ట్రంలో 46,476 మంది బోదకాలు బాధితులు..వెయ్యి చొప్పున పింఛన్ -ప్రజారోగ్యంపై సమీక్షలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా గ్రామీణులకు ఆరోగ్యభాగ్యం సమకూర్చేందుకు సరికొత్త చొరవతో ఆయన ముందడుగు వేశారు. చికిత్స కన్నా నిరోధమే ఉత్తమమన్న నానుడికి తగ్గట్టుగా సర్కారీ వైద్యవ్యవస్థను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తుందని, ఏదైనా వ్యాధి ఉన్నట్టు ఆ పరీక్షల్లో తేలితే ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వైద్య, ఆరోగ్యశాఖపై శుక్రవారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించారు. చాలావ్యాధులను ఎంతత్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులభమవుతుందని చెప్పారు. బోదకాలు వంటి వ్యాధులను ముందుగా గుర్తిస్తే నయం చేయడం వీలవుతుందని అంటూ, బోదకాలు వ్యాధితో బాధపడేవారికి నెలనెలా రూ.1000 పింఛనుగా ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేలమందికిపైగా బోదకాలు బాధితులకు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సర్కారు వైద్యం తీరు ఎంతో మెరుగుపడిందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో కీలకపాత్ర వహిస్తున్న ఆశవర్కర్లను గ్రామ ఆరోగ సహాయకులుగా గుర్తిస్తామని, అవసరమైతే మరోసారి జీతాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సెకండ్ ఏఎన్‌ఎంల జీతాలు కూడా పెంచి వారి సేవలను మరింత సమర్థంగా వినియోగించుకుంటామని చెప్పారు. సర్కారు వైద్యశాలలకు వచ్చే గర్భిణులకు ఇస్తున్న కేసీఆర్ కిట్లను ప్రైవేటు దవాఖానల్లో ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

చికిత్స కన్నా నిరోధమే మేలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్‌దెన్ క్యూర్ అనే మాటను తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టదలుకున్నదని, దీనికోసం గ్రామం యూనిట్‌గా ప్రజలందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సీఎం ఆదేశించారు. గ్రామస్థాయిలో పనిచేసే వైద్య అధికారులు, సిబ్బంది సేవలను మరింత ప్రభావవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఆశ వర్కర్లకు మరోసారి జీతాలు పెంచాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్, సెకండ్ ఏఎన్‌ఎంలకు కూడా జీతాలు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం సూచించారు.

అమెరికా తరహాలో ఆరోగ్య పరీక్షలు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారని, రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికీ అటువంటి ఆరోగ్య అవగాహన అలవాటు చేయించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవగాహన ఉన్నవారు, ఆర్థికస్థోమత కలిగినవారు పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు, ముఖ్యంగా పేదలు రోగమొచ్చినపుడు తప్ప దవాఖానలకు వెళ్లరు. వైద్యపరీక్షలు చేయించుకోరు. దీనివల్ల చాలా వ్యాధులను ప్రాథమికస్థాయిలో గుర్తించలేకపోతున్నారు. వ్యాధిని మొదటిదశలోనే గుర్తిస్తే నయం చేయడం తేలిక అవుతుంది. బోదకాలు కూడా అలాంటిదే. ప్రారంభదశలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కానీ ముదిరేదాకా గుర్తించరు. చాలారోగాల విషయాల్లో ఇలాగే జరుగుతుంది. ఇకపై ఆవిధంగా జరుగడానికి వీల్లేదు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే క్రమంతప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తుంది. రక్తనమూనాలు సేకరించి, అన్నిరకాల రోగనిర్ధారణ పరీక్షలు చేయించాలి. రోగం గుర్తించిన వెంటనే ప్రభుత్వపరంగానే చికిత్స చేయాలి. మందులు అందించాలి. దీనికోసం ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదు. పేద ప్రజల ఆరోగ్యం కాపాడటం కన్నా మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి ఏదీలేదు అని సీఎం చెప్పారు. ఆశ వర్కర్లకు ఒకసారి జీతాలు పెంచామని, మరోసారి కూడా జీతాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. ఆశ వర్కర్లను విలేజ్ హెల్త్ అసిస్టెంటుగా గుర్తిస్తాం. సెకండ్ ఏఎన్‌ఎం జీతాలు కూడా పెంచుతాం. వారి సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అని చెప్పారు.

ప్రైవేటుకు కిట్లు ఇవ్వం కేసీఆర్ కిట్ల పథకం ప్రైవేటుకు అనుమతించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిద్వారా అనవసర ఆపరేషన్లు బాగా తగ్గాయని, అదనపుభారం పడినా సరే వైద్యులు, సిబ్బంది ఓపికగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వారికి ఇన్సెంటివ్ ఇస్తాం. ప్రైవేటు దవాఖానలకు కూడా కేసీఆర్ కిట్ల పథకం వర్తింపజేయాలని వినతులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వ దవాఖానల్లోనే అవసరమైన సౌకర్యాలు పెంచుతాం. ప్రభుత్వ వైద్యశాలలను బాగు చేసుకుంటాం తప్ప.. ప్రైవేటు హాస్పిటల్స్‌కు కేసీఆర్ కిట్ల పథకం వర్తింపజేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, ఎంఅండ్‌హెచ్ డైరెక్టర్ వాకాటి కరుణ, పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్ లలితాకుమారి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వవిప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు శేరి సుభాష్‌రెడ్డి, బాలమల్లు పాల్గొన్నారు.

బోదకాలు బాధితులకు ఊరట రాష్ట్రంలోని బోదకాలు బాధితులకు ప్రతినెలా రూ. వెయ్యి పింఛను ఇవ్వాలని సీఎం కేసీఆర్‌నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 46,476 మంది బోదకాలు బాధితులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెన్షన్ అందించేందుకు వీలుగా వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. బోధకాలు వ్యాధి గ్రస్తులకు మందులు, ఇతర వైద్య సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. బోదకాలు బాధితుల సమగ్ర సర్వే నిర్వహించాలని, గ్రామాల్లో వారి వివరాలు సేకరించాలని సీఎం కోరారు.

తుమ్మల, కవిత చొరవతో కదలిక తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతా ల్లో బోధకాలు బాధితులు పెద్దసంఖ్యలో ఉన్నారని, వారు కాలుతీసి కాలు వేయలేని పరిస్థితిలో ఉన్నారని, వారిని ఆదుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ కల్వకుంట్ల కవిత సీఎంకు విన్నవించారు. వారి చొరవతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. బోదకాలు వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా పింఛను ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఔదార్యంతో నిర్ణయించడంపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప హర్షం వ్యక్తం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.