Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అందరికీ మెరుగైన వైద్యం

-స్వరాష్ట్రంలో వైద్యరంగానికి పెద్దపీట: మంత్రి లక్ష్మారెడ్డి -ఎర్రగడ్డ దవాఖానలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనానికి శంకుస్థాపన.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతిభద్రతలు, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రజలు సర్కారు దవాఖానలవైపు తొంగిచూసేందుకు భయపడేవారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజల కు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని చెప్పారు. ఎర్రగడ్డలోని మానసిక రోగుల దవాఖానలో రూ.18 కోట్లతో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనానికి సోమవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాములునాయక్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ పర్యాడ కృష్ణమూర్తితో కలిసి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత వైద్య విద్యార్థుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన మెడికల్ కళాశాల బస్సులను ప్రారంభించారు. మెడికల్, నర్సింగ్ విద్యార్థులు సర్కార్ దవాఖానల సందర్శన, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరీక్షలు చేసేందుకుగానూ ప్రభుత్వం వీటిని సమకూర్చింది.

హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హైదరాబాద్‌లోని డెంటల్ కాలేజీ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు అందజేసే తొమ్మిది బస్సులను మంత్రి ప్రారంభించారు. తర్వాత ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, దీనిని గమనించిన సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇందుకోసం అన్ని స్థాయిల్లోని హాస్పిటళ్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను నెలకొల్పుతున్నామని, ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఇటీవలే నిమ్స్‌లో రెండు క్యాథలాబ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా సర్కార్ దవాఖానలను బలోపేతం చేశామన్నారు.

30 ఏండ్ల తర్వాత విద్యార్థులకు కొత్త బస్సులు నిన్నమొన్నటి వరకు వైద్య విద్యార్థులు కళాశాల-దవాఖాన మధ్య రాకపోకలు సాగించాలంటే నానా తంటాలు పడేవారని, వారి ఇబ్బంది తీర్చేందుకు కొత్త బస్సులు అందించామమన్నారు. 30 ఏండ్ల సుధీర్ఘ విరామం తర్వాత వైద్య విద్యార్థులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు రెండు బస్సులు కేటాయించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడంతోపాటు వారికి వైద్యసేవలను అందించేందుకు ప్రతి మెడికల్ కళాశాలకు ఒక ఎస్‌పీఎం (సోషియల్ ప్రివెంటివ్ మెడిసిన్)వ్యాన్‌ను కేటాయించామన్నారు. బస్సు లు, మొబైల్ వ్యాన్లు, డెంటల్ మొబైల్ వ్యాన్లు మొత్తంగా 20 వాహనాలను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైద్య విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డీఎంఈ రమణిని మంత్రి ఆదేశించారు. డెంటల్ విభాగాన్ని పటిష్ఠపరుస్తామన్నారు. ప్రభుత్వం వైద్యులకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. అయినా చాలామంది సమయానికి రావడంలేదని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అపోహలు, ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ప్రజల్లో ఉన్న ఈ అనుమానాలు తొలిగిపోయేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. తమ వృత్తికి, ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేయాలని కోరారు.

గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే అక్రమాలు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అవినీతి వల్లనే నగరంలో అక్రమంగా సరోగసి, కిడ్నీ రాకెట్లు విస్తరించాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతే వీటికి అడ్డుకట్ట పడుతున్నదని చెప్పారు. ఈ క్రమంలో కిడ్నీ దానం చేయడంపై ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించామని, అదే విధంగా సరోగసిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బంజారాహిల్స్‌లోని సాయికిరణ్ దవాఖానపై విచారణ జరుగుతున్నదని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.