Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అంధ విద్యార్థులకూ ప్రత్యేక తరగతులు

– కేజీ టు పీజీ విద్యలో భాగంగా ఏర్పాటు – నల్లగొండ అంధుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా – రాష్ట్ర భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు – అంధుల పాఠశాలకు నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన మంత్రి

Harish-Rao-01 కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యలోభాగంగా అంధ విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కేజీ టు పీజీ విద్య ఆంగ్లంలోనే ఉండనుందని, ఇందులోభాగంగా జిల్లాకు లేదా నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటుచేసే స్కూళ్లలో అంధ విద్యార్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. మొత్తంగా ప్రతి అంధ విద్యార్థి ఆంగ్ల మాధ్యమంలో చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

నల్లగొండ అంధుల పాఠశాల (నల్లగొండ స్కూల్ ఆఫ్‌ది ైబ్లెండ్) క్యాలెండర్-2015ను తెలంగాణ భవన్‌లో మంగళవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధులకు అందరిలాగే సమాన హక్కులున్నాయని, అయినా వారిని వికలాంగులుగా సమాజం చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో అంధ విద్యార్థుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకుండా ఇన్నేండ్లు చొక్కారావు పాఠశాలను నడపడం అంత సులువైన విషయం కాదు. అందుకే ఆ పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పించడమా? ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నిర్వహించడమా? అనే విషయాలపై సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం.

నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న అంధ విద్యార్థులకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. అయితే అసలు ఏయే జిల్లాల్లో ఎంతమంది అంధులు ఉన్నారు? జిల్లాకా, రెండు జిల్లాలకు కలిపా అన్నది అధ్యయనం చేసి అవసమున్న చోట అంధ పాఠశాలలను ఏర్పాటుచేస్తాం అని చెప్పారు. పాఠశాలల్లో ఉండే వికలాంగ విద్యార్థులకే ప్రభుత్వపరంగా వచ్చే పింఛను అందించాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని, అయితే పాఠశాలకు రాని వారికి పింఛను నిలిపివేస్తే వారి మనసు నొచ్చుకునే అవకాశముంటుందన్నారు. అందుకే పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అదనంగా పింఛను ఇవ్వడం, ఇతర మార్గాల్లో ప్రోత్సాహకాలు ఇవ్వడం చేస్తే బాగుంటుందన్నారు. రోస్టర్ విధానం, జీవో నంబరు 28పై త్వరలో సంబంధిత యంత్రాంగంతో సమావేశం నిర్వహించి.. అంధులకు న్యాయం చేస్తామని హామీఇచ్చారు.

సీఎం, మంత్రులకు ఎంతో వేగంగా పనులు నిర్వహించాలని ఉన్నా… అధికారుల విభజన జరగనందున పరిపాలన ఆ మేరకు వేగంగా సాగడంలేదన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు… సంక్షేమం, వికలాంగులు, మహిళల విషయంలో చాలా సానుకూలంగా స్పందిస్తారని, అంధుల సమస్యల పరిష్కారంలో ఆయన వెనక్కి వెళ్లబోరని స్పష్టం చేశారు. త్వరలోనే శుభవార్తతో నల్లగొండ అంధుల పాఠశాలను సందర్శించి, వారితో కలిసి భోజనం చేస్తానన్నారు. తన నెల జీతం రూ.2 లక్షలను పాఠశాలకు విరాళంగా ప్రకటించారు. నల్లగొండ అంధుల పాఠశాలను త్వరలోనే తాను సందర్శిస్తానని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. రోజంతా అక్కడే ఉండి, విద్యార్థులతో గడుపుతానన్నారు.

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వచ్చే నెల నాలుగో తేదీన నల్లగొండ అంధ పాఠశాలను సందర్శించి… ఒకరోజంతా అక్కడే ఉంటానన్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తన ఎమ్మెల్సీ కోటా నుంచి నల్లగొండ అంధుల పాఠశాల అభివృద్ధికి నిధులు వెచ్చిస్తానని తెలిపారు. కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి, నల్లగొండ అంధుల పాఠశాల నిర్వాహకులు చొక్కారావు, తదితరులు పాల్గొన్నారు. అంధ విద్యార్థినులు ఆలపించిన పరిపూర్ణ తెలంగాణ ప్రబోధ గీతం అందరినీ ఆకట్టుకుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.