– సమయపాలన కచ్చితంగా పాటించండి – అవినీతి నిరోధానికి బార్కోడ్ విధానం అమలు – నీటి పారుదల ఉద్యోగుల ముఖాముఖిలో మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇతర శాఖలకు ఆదర్శంగా నిలవాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. విధుల నిర్వహణలో కచ్చితంగా సమయ పాలన పాటిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని హితవు చెప్పారు. మంగళవారం ఆయన నీటిపారుదలశాఖ ఉద్యోగులతో ప్రత్యేకంగా ముఖాముఖి సమావేశమయ్యారు. పైళ్ల కదలికలో వేగం, పారదర్శకత పెరగాలని తెలిపారు. అవసరమైతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు. ఫైళ్ల కదలికలో అవినీతికి ఆస్కారం లేకుండా కొత్తగా బార్కోడ్ విధానం విధానాన్ని ప్రవేశపెట్టాలని స్పష్టంచేశారు. అందుకు అవసరమైన నియమ నిబంధనలను రూపొందించాలని సూచించారు. మిషన్ కాకతీయ అమలులో శాఖసిబ్బంది పని తీరును మంత్రి ప్రశంసించారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆశయాలకనుగుణంగా పనిచేసి లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఇంజినీర్లు కృషి చేయాలని మంత్రి తెలిపారు. పెండింగ్ పనులపై ప్రతి సోమవారం చీఫ్ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఉద్యోగులకు హితవు చెప్పారు. ప్రతి సోమ, బుధవారాల్లో నీటిపారుదల శాఖ అంశాలపై, ప్రతి శనివారం మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తానని మంత్రి చెప్పారు.
ఈ నిర్ణయాన్ని తు.చ. తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సలహారు ఆర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, ఆర్అండ్ఆర్ కమిషనర్ మానిక్‌రాజ్, నీటిపారుదలశాఖ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.