Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అందుబాటులోకి టీఎస్‌ బీపాస్‌..

జాప్యానికి చోటు ఉండదు.. అవినీతి, ఆలస్యం అనే మాటే వినపడదు. భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్‌ బీ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నూతన విధానం ద్వారా నిర్దేశించిన గడువులోగా ఆన్‌లైన్‌లో ఇండ్ల అనుమతులు పొందవచ్చు. సులభంగా, సత్వరంగా సేవలు అందించే టీఎస్‌ బీపాస్‌ దేశానికే ఒక మోడల్‌గా నిలువనున్నదని బిల్డర్లు, నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. రియల్‌ రంగానికి మరింత ఊపు రానున్నదని చెబుతున్నారు. సింగిల్‌ విండో పద్ధతి నిర్మాణదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, నిర్మాణ రంగ అనుమతుల్లో ఇది నవ శకంగా అభివర్ణిస్తున్నారు.

భవన నిర్మాణ రంగంలో అతి పెద్ద సంస్కరణ
పరిశ్రమల అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ ఐపాస్‌ తరహాలోనే టీఎస్‌ బీపాస్‌ దేశమంతా ప్రాచుర్యం పొందే అవకాశమున్నది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఇదో మైలురాయి వంటిది. ఇక నుంచి భవన నిర్మాణంలో జాప్యానికి చోటు ఉండదు. ప్రాజెక్టుల నిర్మాణం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడం వల్ల అటు బిల్డర్లకు, ఇటు భూ యజమానులకు లాభం చేకూరుతుంది. మొత్తానికి భవన నిర్మాణ రంగంలో ఇది అతిపెద్ద సంస్కరణగా చెప్పవచ్చు.
– జీవీ.రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

ఇక నుంచి ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నెలల తరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. అధికారులకు మాముళ్లు ముట్టజెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అవినీతికి, ఆలస్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా అన్ని రకాల ఇండ్లకు నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌లో సత్వరమే పొందేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ బీపాస్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. దేశానికే ఆదర్శంగా నిలువనున్న టీఎస్‌ బీపాస్‌ ఇక రియల్‌ రంగాన్ని పరుగులు పెట్టించనున్నది.

టీఎస్‌ బీపాస్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే ల్యాండ్‌ మార్క్‌ సంస్కరణగా బిల్డర్లు అభివర్ణిస్తున్నారు. ఇది కేవలం తెలంగాణ రాష్ర్టానికే పరిమితం కాదని, యావత్‌ దేశంలోనూ ఇది మోడల్‌గా నిలవనున్నదని పేర్కొంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం మరింత ఊపందుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. ఔటర్‌ రింగు రోడ్డు సరిహద్దుగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ మహానగరంలో ఇప్పటి వరకు భవన నిర్మాణ అనుమతుల కోసం నెలల తరబడి మున్సిపల్‌ కార్యాలయాలు, ఇతర కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితికి పుల్‌స్టాప్‌ పెడుతూ ఆన్‌లైన్‌లో సత్వరమే అనుమతులు పొందేలా అమల్లోకి వచ్చిన బీపాస్‌ను బిల్డర్లందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్‌ ఐపాస్‌ ఏవిధంగా ఆదర్శంగా నిలిచిందో, అదే స్థాయిలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ కొత్త అధ్యాయానికి ఇది శ్రీకారం చుట్టనుందనే అభిప్రాయాన్ని బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి, ఆలస్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా ఎంతో పారదర్శకంగా ఉన్న టీఎస్‌ బీపాస్‌ సదుపాయం గ్రేటర్‌ హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఉరుకులు పెట్టిస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ అభివృద్ధి శరవేగంగా జరిగేలా టీఎస్‌ బీపాస్‌ దోహదం చేస్తుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

టీఎస్‌ బీ పాస్‌ సేవలు
బిల్డింగ్‌ అనుమతులు, భూమి వినియోగ ధ్రువ పత్రాలు, టీడీఆర్‌ బ్యాంక్‌, లే అవుట్‌, భూ వినియోగ మార్పు, ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఎన్‌ఓసీలు, ఎల్‌ఆర్‌ఎస్‌, 21 రోజుల్లో అనుమతి. జలమండలి, ఎలక్ట్రిసిటీ, టీడీఆర్‌, ఎస్‌ఆర్‌ఓ, నీటి పారుదల, జేఎన్‌టీయూ, విమానాశ్రయం, ఎన్‌ఎంఏ విభాగాలకు సంబంధించి ఒకే చోట ఎన్‌ఓసీలు అందనున్నాయి

దరఖాస్తు ఇలా ..
టీఎస్‌ బీ పాస్‌ వెబ్‌సైట్‌ www.tsbpass.telangana. gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులు, డెవలపర్లు, ప్రతినిధులు మీ సేవ కేంద్రం, టీఎస్‌బీపాస్‌ మొబైల్‌ యాప్‌ (ఆండ్రాయిడ్‌, ఐఎస్‌ఓ) ఆయా నిర్మాణానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ 040-22666666 అందుబాటులోకి తీసుకువచ్చారు.

మూడు క్యాటగిరీల్లో బిల్డింగ్‌ అనుమతులు ఇలా..
నమోదు (రిజిస్ట్రేషన్‌) :- 75 చదరపు గజాలు (63 చ.మీ) వరకు ఏరియా ఉంటే ప్లాట్లు, 7 మీటర్ల కన్నా తక్కువ ప్రతిపాదించబడిన ఎత్తు భవనానికి తక్షణ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు, స్వీయ ధ్రువీకరణతో జారీ చేయబడుతాయి. కేవలం రూపాయి ఫీజుతో యాజమాన్య పత్రం మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. స్వీయ ధ్రువీకరణ :- 63 చ.మీకి పైన, 500 చ.మీ ఏరియా వరకు ఉండే నివాస ప్లాట్లకు , 10 మీటర్ల వరకు ప్రతిపాదించిన భవన ఎత్తు స్వీయ ధ్రువీకరణ విధానం కింద తక్షణ ఆన్‌లైన్‌ ఆమోదం
సింగల్‌విండో :- 500 చ.మీకి పైన ఉండే నివాస ప్లాట్లు, 10 మీ కన్నా ఎక్కువ ప్రతిపాదించబడిన బిల్డింగ్‌ ఎత్తు కలిగి ఉండేవి. అన్ని రకాల నివాసేతర భవనాలకు సింగల్‌విండో ఆమోద విధానంలో జారీ చేయబడుతాయి.

అందుబాటులోకి తెచ్చిన మంత్రి కేటీఆర్‌
-భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్‌ బీపాస్‌ను సోమవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు.
-టీఎస్‌- బీపాస్‌ విధానం కింద 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనానికి ఎలాంటి అనుమతి అవసరం ఉండదు. కేవలం రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే సరిపోతుంది.
-600 గజాలలోపు , పది మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే నివాస గృహాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి లభించనున్నది.
-6-00 గజాల స్థల విస్తీర్ణం కంటే ఎక్కువ, పది మీటర్ల కంటే ఎత్తయిన, ఇతర నివాసేతర భవనాలకు 21 రోజుల్లో నిర్మాణ అనుమతులు ఇవ్వనున్నారు. అన్ని రకాల ఇండ్ల అనుమతులు ఆన్‌లైన్‌లోనే మంజూరు కానున్నాయి.
-నిర్మాణాల అనుమతి వేగవంతం చేయడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా చేసేందుకు బీ పాస్‌ అమల్లోకి తీసుకువచ్చారు.

నూతన శకం మొదలైనది
నిర్మాణ రంగ అనుమతులలో నూతన శకం మొదలైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇలాంటి అనుమతుల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభం కావడం సంతోషించదగినది. ఇక నుంచి సులభంగా, వేగంగా నిర్మాణ రంగ అనుమతులు రానున్నాయి. ఇది రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల కల నేరవేరినట్లుగా అనిపిస్తున్నది.
-కేవీ రామారావు, సుమధుర గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో నగరానికి ఉజ్వల భవిష్యత్తు
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ బీ పాస్‌ విధానం దేశంలోనే అత్యుత్తమ భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియగా నిలువబోతున్నది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ నగరానికి ఉన్నంత ఉజ్వల భవిష్యత్తు ఏ ఇతర మెట్రో నగరానికి లేదు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో అందుబాటు ధరలో ఇండ్లు ఉన్నాయన్న సానుకూలత ఉంది. టీఎస్‌ బీ పాస్‌ ఒక మంచి సంస్కరణ.
– ప్రేమ్‌ సాగర్‌, జయభారతి కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, క్రెడాయ్‌ మెంబర్‌

టీఎస్‌ బీపాస్‌ దేశానికే ఆదర్శం
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టీఎస్‌-బీపాస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. భవన నిర్మాణ అనుమతుల్లో ఇప్పటి వరకు ఉన్న జాప్యానికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తూ, ఎంతో పారదర్శకంగా ఉండనున్నది. దీనివల్ల భవన నిర్మాణ అనుమతులు వేగంగా రావడం వల్ల పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇది బిల్డర్లకు ఎంతో మేలు చేస్తుంది. తాము ప్రతిపాదించిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి, తక్కువ ధరలోనే ప్లాట్లను, ఇండ్లను విక్రయించేందుకు అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా భవన నిర్మాణం విషయంలో ఉన్న అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అనుమతుల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరమే ఉండదు. ఇలాంటి దాని కోసం వేలాది మంది బిల్డర్లు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు.
– కురిపల్లి గోపాలకృష్ణ, హాల్‌ మార్క్‌ బిల్డర్స్‌, యజమాని.

సమయం చాలా కలిసి వస్తుంది
ఇల్లు, అపార్టుమెంటు నిర్మాణం కోసం అనుమతి కావాలంటే నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దీంతో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేక ఇబ్బందులు పడేవారు. టీఎస్‌-బీపాస్‌తో రోజుల వ్యవధిలోనే అనుమతులు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఒక భవన నిర్మాణ అనుమతి విషయంలో పలు ప్రభుత్వ శాఖలను వేర్వేరుగా సంప్రదించాల్సి ఉండేంది. ప్రస్తుతం సింగిల్‌ విండో విధానం అమల్లోకి రావడం భవన నిర్మాణ దారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్వీయ ధ్రువీకరణ ద్వారానే 600 గజాల లోపు ఉన్న భవన నిర్మాణాలకు అనుమతి సత్వరమే రావడం వల్ల లక్షలాది మందికి మేలు చేస్తుంది. దీంతో వారు వెంటనే తమ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకునే అవకాశం కలుగుతుంది.
– ఉపేందర్‌, బిల్డర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.