-రైతులను సంఘటితం చేస్తున్నాం.. -వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతాంగాన్ని ఒక్కతాటిపైకి తేవడమే లక్ష్యంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో రైతులే మద్దతు ధర నిర్ణయించే రోజు వస్తుందన్నారు.
సూర్యాపేట, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిర్వహించిన సదస్సులో విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు సమన్వయ సమితుల ఏర్పాటు నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రపంచ రైతాంగానికి దిక్సూచిలాంటిదని చెప్పారు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ రైతులను రారాజుగా చేసేందుకే సీఎం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు. రైతు సమన్వయ సమితుల కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ.500 కోట్లకు అదనంగా రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మంథనిలో జరిగిన సదస్సులో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగంతో శభాష్ అనిపించుకునే కమిటీలు పనిచేయాలన్నారు. రాబోయేది రైతు రాజ్యమేనని అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రతి క్లస్టర్‌కు ఓ రైతు భవనం నిర్మించనున్నట్టు చెప్పా రు. రైతులకు సాగునీరు, పంటకు పెట్టుబడి, గిట్టుబాటు ధర కల్పనకే రైతు సమితులను ఏర్పాటు చేస్తున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా రూరల్ మం డల సదస్సులో తుమ్మల మాట్లాడారు. రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అధికారుల సలహాలు, సూచనలను రైతులకు చేరవేయడానికి సమన్వయ సమితి సభ్యులు వారధులుగా ఉంటారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దీనిపై అవగాహన లేని ప్రతిపక్షాలు అనవసర రాద్ధ్దాంతాలు చేస్తూ కోర్టును ఆశ్రయించగా కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట, రేవల్లి మండలాల రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం తలపెట్టిన సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి అడ్డుపడుతూ చిల్లర రాజకీయా లు చేయడం మానుకోవాలని హితువు పలికారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్ మండలాల రైతు అవగాహన సదస్సులో ఎంపీ జితేందర్‌రెడ్డితో కలిసి ఆయ న పాల్గొన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సమన్వయ సమితుల్లో రైతులందరినీ భాగస్వాములు చేసి పటిష్టం చేయాలన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన రైతుసదస్సులో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ పంటలకు ధరను నిర్ణయించే శక్తి రైతులకు వచ్చేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. రైతు సేవా సమితుల ఏర్పాటులో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బంగారు తెలంగాణ సాధనలో రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కీలకమైన ఘట్టమన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో నిర్వహించిన సమా వేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
వాళ్లవి రైతు భక్షక కమిటీలు: మంత్రి హరీశ్
కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైనవి రైతు పరిరక్షణ కమిటీలు కాదని, రైతు భక్షక కమిటీలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 49 వేల మందికి ఆదర్శరైతుల పేరిట రూ. 500 కోట్లు దోచిపెట్టిన ఘనత కాంగ్రెస్ నేతల దన్నారు. వాళ్ల హయాంలో రైతాంగానికి దొంగరాత్రి కరెంట్ ఇస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాణ్యమైన కరెంట్‌ను 24 గంటల పాటు ఇస్తున్నదని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో బుధవారం రైతు సమితుల సమావేశాలు జరిగాయి. సిద్దిపేటలో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా కాంగ్రెస్ నేతలు కోర్టులో కేసులు వేయడం తప్పా మరోటి చేయరని విమర్శించారు.
అన్నం పెట్టే రైతు ఆత్మగౌరవంగా బతుకాలన్నదే సీఎం సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట సదస్సులో పోచారం మాట్లాడారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌లాగా గత ప్రభుత్వాలు పని చేసి ఉంటే అసలు వ్యవసాయ సంక్షోభమే ఉండేది కాదని, రైతు ఆత్మహత్యలే జరిగేవి కావన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రైతును రాజు చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతు న్నార న్నారు. గజ్వేల్‌లో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకపోగా జానెడు కాల్వకూడా తవ్విన పాపాన పోలేదన్నారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాసిన సందర్భాలను ప్రజలు మర్చిపోరని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, రాజయ్యయాదవ్, ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.