-ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం విధాన ప్రకటన చేయాలి
-టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు డిమాండ్
-బీజేపీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలి: నామా
-సభకు సంజయ్ క్షమాపణ చెప్పాలి: వెంకటేశ్ నేత
-ఉభయసభల నుంచి టీఆర్‌ఎస్ సభ్యుల వాకౌట్
-పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా
-4వ రోజూ పార్లమెంటులో టీఆర్‌ఎస్ సభ్యులఆందోళనలు

రైతుల సమస్యలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటులో కేంద్రం విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరి రైతుల సమస్య పరిష్కారం కోసం తాము పాటు పడుతుంటే, బీజేపీ నేతలు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని, ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై వరుసగా 4వ రోజు పార్లమెంటులో ఆందోళనలు కొనసాగించిన టీఆర్‌ఎస్ ఎంపీలు గురువారం వాకౌట్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎంపీలంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. తగినన్ని నిల్వలు ఉన్నందున ధాన్యం కొనుగోలు
చేయలేమని కేంద్రం చెప్పడం సరికాదన్నారు. కేంద్రం స్పష్టమైన విధాన ప్రకటన చేస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను సన్నద్ధం చేస్తుందని తెలిపారు. విత్తన కొనుగోలు, ఎరువులు, చేతికొచ్చిన పంటను నిల్వ ఉంచే గోదాములు తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, ఆ మేరకు సన్నద్ధం కావడంలో, రైతులను సమాయత్త పరచడంలో సీఎం కేసీఆర్ నిష్ణాతులని చెప్పారు. పంట మార్పిడికి కనీసం మూడేండ్ల సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఎన్నికలు వేరు, రాజకీయాలు వేరని, 105 ఎమ్మెల్యే స్థానాలున్న టీఆర్‌ఎస్, 85 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీకి మధ్య పోలికే లేదని అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న టీఆర్‌ఎస్ ఎంపీలపై కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కత్తులు తీయడం, కొట్లాటలకు వెళ్లడం టీఆర్‌ఎస్ అభిమతం కాదని, రైతుల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పారు.
కల్లాల దగ్గర కాదు పార్లమెంటులో మాట్లాడాలి: నామా
బీజేపీ ఎంపీలకు రైతుల పట్ల ప్రేమ ఉంటే పార్లమెంటులో మాట్లాడాలని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. కల్లాల దగ్గరకు వెళ్ల్లి, రైతులను గందరగోళ పర్చడం వల్ల ఉపయోగం లేదని హితవు చెప్పారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు తలోరకంగా మాట్లాడి రైతులను ఆగం చేయకుండా పార్లమెంటులో స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని నాలుగు రోజులుగా పార్లమెంటులో పోరాటంచేస్తున్నా కేంద్రం తేల్చడంలేదని విమర్శించారు. లోక్‌సభ స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి, మైక్ కట్ చేశారని చెప్పారు. పార్లమెంటులో తాము రైతుల కోసం మాట్లాడుతుంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమను అనరాని మాటలు అన్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచింది రాష్ర్టానికి అన్యాయం చేయడానికా? అని నిలదీశారు. రాష్ట్ర రైతుల సమస్య పరిష్కారానికి కిషన్‌రెడ్డి చొరవ చూపాలని గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. గతంలో కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు చేయకుండా, ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉన్న బియ్యాన్ని సరైన సమయంలో తరలించకుండా, అవసరమైన రైల్వే రేక్స్ పంపకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: ఎంపీ వెంకటేశ్ నేత
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్లమెంటులో చేసిన అసభ్య వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎంపీ వెంకటేశ్ నేత డిమాండ్ చేశారు. రైతుల కోసం తాము పార్లమెంటులో ధర్నా చేస్తుంటే, బండి సంజయ్ లేచి తమను గజదొంగలు, దొంగలు అని కామెంట్ చేస్తూ, సభా గౌరవాన్ని కించపరిచారని పేర్కొన్నారు. తామూ ఉప్పు కారం తింటున్నామని, తమకూ మాటలు వస్తాయని, పార్లమెంటు గౌరవానికి భంగం కలుగొద్దని తాము మాట్లాడలేదని చెప్పారు. బండి సంజయ్, అరవింద్ వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.బీజేడీ, టీఎంసీతో కలిసి పోరాటంసభలో బీజేడీ, టీఎంసీ ఎంపీలతో కలిసి రైతు సమస్యలపై పోరాడేందుకు టీఆర్‌ఎస్ ఎంపీలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మూడు పార్టీలు కలిసి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.
పార్లమెంటులో 4వ రోజూ కొనసాగిన ఆందోళన
ధాన్యం కొనుగోళ్ల అంశంపై టీఆర్‌ఎస్ సభ్యులు పార్లమెంటు ఉభయసభల్లో వరుసగా 4వ రోజు కూడా ఆందోళనలు కొనసాగించారు. గురువారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే రాజ్యసభ, లోక్‌సభల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి ధర్నా చేశారు. రాజ్యసభలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నేతృత్వంలో ఎంపీలు సంతోష్‌కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్ నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో చైర్మన్ వెల్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్ అనుమతి ఇవ్వకపోవటంతో సభ నుంచి వాకౌట్ చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోతు కవిత, బీబీపాటిల్ సభా సమావేశాలు ప్రారంభం కాగానే ఒక్కసారిగా స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో వెల్‌లో బైఠాయించారు. దీంతో స్పీకర్ సభను రెండుసార్లు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత నామా మాట్లాడేందుకు అవకాశమిచ్చిన స్పీకర్ మధ్యలోనే మైక్ కట్ చేశారు. దీంతో టీఆర్‌ఎస్ సభ్యులు తమ చేతుల్లో ఉన్న కాగితాలను చించి, వాకౌట్ చేశారు. అప్పటికే రాజ్యసభలో వాకౌట్ చేసిన ఎంపీలు కేకే, సంతోష్, లింగయ్యయాదవ్, సురేష్‌రెడ్డి, బండా ప్రకాశ్ లోక్‌సభ సభ్యులతో కలిసి గాంధీ వద్ద ధర్నాకు దిగారు. అక్కడ మరికొన్ని పార్టీల ఎంపీలు వారితో జతకలిశారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేశవరావుకు, నామా నాగేశ్వరరావుకు దిశానిర్దేశం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్‌తో కలిసి గళమెత్తాలి
వానకాలం, యాసంగిలో పండిన ధాన్యాన్ని సేకరించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో చేస్తున్న ఆందోళనకు రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కూడా మద్దతు తెలుపాలి. కేంద్రం పార్లమెంట్‌లో స్పష్టమైన హామీ ఇచ్చేదాకా రాజకీయాలకు అతీతంగా టీఆర్‌ఎస్ ఎంపీలకు మద్దతు ఇవ్వాలి. యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ చేయకపోతే నూక ఎక్కువ వస్తది. పంజాబ్‌లో ధాన్యాన్ని సేకరిస్తున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు తీసుకోదు?
–సాదుల శ్రీనివాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి, మహబూబాబాద్
అక్కడోటి.. ఇక్కడోటి మాట్లాడేటోళ్లను నమ్మద్దు
ధాన్యం సేకరణపై బీజేపీ లీడర్లు ఢిల్లీల ఒక మాట, గల్లీల ఇంకోమాట మాట్లాడుతున్నరు. ఇట్ల రెండు మాటలు మాట్లాడేటోళ్లను రైతులు ఎట్ల నమ్ముతరు? పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు కొట్లాడుతుంటే బీజేపీ ఎంపీలు ఎక్కడా కనిపిస్తలేరు. ధాన్యం కొనాలని పార్లమెంటులో ఒక్క మాట మాట్లాడుతలేరు. రైతుల పక్షాన కొట్లాడేటోళ్లకే మా మద్దతు.
–పుల్కం గంగన్న, చెర్లపల్లి(ఆర్), గంగాధర
బీజేపోళ్లు బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఎట్ల?
ఒకవైపేమో కేంద్రంలోని బీజేపీ సర్కారోళ్లు వడ్ల సేకరణపై నోరు మెదుపుతలేరు. ఇక్కడేమో ఆ పార్టీ నేతలు రైతులను తప్పుదోవ పట్టించేందుకు కల్లాల చుట్టూ తిరుగుతూ యాసంగిలో వరి వేసుకొమ్మని చెప్తున్నరు. ఇక్కడ తిరిగేకంటే వాళ్ల సర్కారోళ్లను అడిగి వడ్లను తీసుకొనేలా చూడాలే. రైతుల కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు ఢిల్లీలో పోరాడుతుంటే బీజేపోళ్లకు కనిపిస్తలేదా? రాష్ట్ర రైతుల తరఫున వీళ్లు పోరాడరా? బెల్లం కొట్టిన రాయిలెక్క ఉంటే ఎట్ల?
–బీట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రైతు, వీరారెడ్డిపల్లి, తుర్కపల్లి