Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్నదాతలతో విందు భోజనం చేస్తూ…పెద్ద రైతు కేసీఆర్ ముచ్చట

నల్లగొండ, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మట్టి వాసన తెలిసిన ముఖ్యమంత్రి ఆ మట్టిని దున్నే రైతులతో మమేకమయ్యారు. స్వయంగా తాను పంటలు పండించే తీరును వివరిస్తూ.. అన్నదాతలకు సాగులో ఎదురవుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నరు. జలధారలకోసం పదుల సంఖ్యలో బోర్లు వేసిన రైతు కొడుకు పెండ్లికి స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి.. ప్రత్యేకంగా రైతులతో కలిసి అన్నం తింటూ అన్ని వివరాలూ ఆరా తీశారు. అన్నదాతలు చేసిన సూచనలపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. 50 మంది రైతులతో కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా పర్యటించి వ్యవసాయ రంగంపై ప్రణాళిక రూపొందిద్దామని తెలిపారు.

KCR-0001

-నల్లగొండలో రైతు కొడుకు పెండ్లికి హాజరైన ముఖ్యమంత్రి -అన్నదాతలతో కలిసి భోజనం.. వ్యవసాయం తీరుపై చర్చ -రైతాంగం కష్టనష్టాలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన రైతులు -నల్లగొండలో బత్తాయి కష్టాలు తీర్చేందుకు సీఎం హామీ -తన వ్యవసాయ అనుభవాలనూ రైతులకు పంచిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యవసాయంపై తనకున్న మక్కువను, అభిమానాన్ని మరోసారి చాటుకున్నరు. రాజకీయ నేపథ్యం లేకున్నా.. బంధువు కాకున్నా.. నల్లగొండ జిల్లాకు చెందిన సామాన్య రైతు కుమారుడి వివాహానికి ఆదివారం హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన ముషంపల్లి గ్రామ రైతు బోర్ల రాంరెడ్డి కొడుకు కృష్ణారెడ్డి పెండ్లికి విచ్చేసి.. భోజన తాంబూలాదులూ స్వీకరించారు. సాగునీటి కోసం తన వ్యవసాయ భూమిలో సుమారు 100 బోర్లు వేసిన రాంరెడ్డి పేరు బోర్ల రాంరెడ్డిగా స్థిరపడింది. ఇదే అంశాన్ని, రాంరెడ్డి పేరునూ ఉద్యమ సమయంలో పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రస్తావించే వారు. రాంరెడ్డి ఆహ్వానించిన వెంటనే ఆయన కుమారుడి పెండ్లికి హాజరయ్యారు.

భోజనం చేస్తూ.. గంటపాటు రైతులతో ముచ్చట పెండ్లికి హాజరవడమే కాక.. ప్రత్యేకంగా రైతులతోనూ సమావేశం కావాలన్న తన ఉద్దేశాన్ని ముందుగానే ముఖ్యమంత్రి జిల్లా నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది. దీంతో వ్యవసాయంలో అనుభవం కలిగిన 15 మంది రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత భోజనం చేస్తూ.. రైతులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. రైతులను కేసీఆర్ అనేక విషయాలు అడిగి తెలుసుకున్నారు. తాను వ్యవసాయం చేసే తీరును రైతులకు వివరిస్తూనే.. రైతాంగం సమస్యలు ఏమిటనే అంశాలనూ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో పెద్దలు చెప్పినట్లు.. కార్తెల ఆధారంగా వ్యవసాయం జేసిన తీరునూ సీఎం కేసీఆరే స్వయంగా రెతులతో చెప్పి ఆశ్చర్యపరిచారు.

KCR-lunch-with-farmers0001

నల్లగొండలో బత్తాయి మార్కెట్‌కు హామీ సీఎంతో సమావేశమైన రైతులు.. జిల్లాలో పంటల సాగు తీరు, విస్తీర్ణం, సాదకబాధకాలను సవివరంగా తెలిపారు. గతంలో 2.5 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండగా.. ప్రస్తుతం 1.8 లక్షలకు చేరాయని చెప్పారు. ఇందుకుగల సాగునీరు, విద్యుత్ కారణాలు అడిగి తెలుసుకున్న సీఎం.. ఇకపై అలా జరగకుండా ఏం చేయాలో చెప్పాలని కోరారు. నల్లగొండ శివార్లలో ఉన్న వందెకరాల ఎస్‌ఎల్‌బీసీ ప్రభుత్వ భూమిలో బత్తాయి రైతుల కోసం పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. బత్తాయి మార్కెట్‌తోపాటు కోల్డ్ స్టోరేజీ, అనుబంధంగా జ్యూస్ ఫ్యాక్టరీ సైతం నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.

వ్యవసాయంపై రైతులతో కమిటీ ప్రతి జిల్లానుంచి ఐదుగురు రైతులకు అవకాశం కల్పిస్తూ.. మొత్తం 50 మంది ప్రతినిధులతో వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచననూ సీఎం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అందరితో ఒకరోజంతా తన ఇంట్లోనే స్వయంగా సమావేశం నిర్వహించి.. అన్ని విషయాలూ మరింత కూలంకషంగా చర్చిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం.

ప్రభుత్వ పని తీరు వివరించిన రైతులు.. కరెంటు సమస్యపై తాము భయపడ్డా.. ప్రభుత్వం సమస్యలు లేకుండా విద్యుత్ అందిస్తుండడం ఆనందంగా ఉందని చెప్పారు. దీనికి ప్రతిస్పందించిన సీఎం వచ్చే మార్చి తర్వాత ఏకధాటిగా 9 గంటల కరెంటు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని విద్యుత్‌కోసం ఆటోమేటిక్ స్టార్టర్లు వాడడంవల్ల.. కరెంటు వృథా అవుతుందని సీఎం వివరించడం రైతులనే ఆశ్చర్యపరిచింది. రైతులను మిషన్ కాకతీయలో భాగస్వాములను చేయడంపట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తంచేశారు. రైతులతో సీఎం భోజన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, యాదవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి ఉన్నారు.

నల్లగొండలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం ఎన్జీ కాలేజీకి11.51 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్, పలువురు టీఆర్‌ఎస్ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

సీఎంకు అన్ని తెలుసు : చిలక విద్యాసాగర్‌రెడ్డి, రైతు ముఖ్యమంత్రితో సమావేశం, భోజనం అనగానే మొదట ఆషామాషీ అనుకున్నం. గతంలో చాలా మంది సీఎంలను కలిసినా.. తూతూ మంత్రంగానే మాట్లాడేది. కానీ కేసీఆర్‌కు మాత్రం రైతుల పట్ల పూర్తి అవగాహన ఉంది. ప్రచారపు ఆర్భాటం లేకుండా.. రాష్ట్రం రైతాంగానికి చాలా చేయాలన్న కసి ఆయనలో ఉంది. అది కూడా అల్లాటప్పాగా కాదు.. పక్కా ప్రణాళికతో, సమగ్ర నివేదికలతో ప్లానింగ్ రెడీ చేసేవిధంగా అనిపించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.