Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్ని మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగురాలి

-రైతు సమస్యల పరిష్కారానికే రెవెన్యూ ప్రక్షాళన
-పింఛన్లకు కేంద్రం ఇచ్చేది సున్నా.. మొత్తం రాష్ట్రమే భరిస్తున్నది
-పెన్షన్లపై దుష్ప్రచారాలను తిప్పికొట్టండి
-రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలు లక్ష్యం
-రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో
-టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

TRS Working President KTR Inaugurates Library in Siddipet

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగిరేలా కార్యకర్తలు కృషిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. తెలంగాణకు టీఆర్‌ఎస్ శ్రీరామరక్షని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నందున పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన గురుతర బాధ్యతను పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు తనపై ఉంచారని పేర్కొన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రూ.3.60 కోట్లతో సినారె స్మారక మందిరం పేరిట నిర్మించిన అధునాతన గ్రంథాలయ భవనంతోపాటు సాయినగర్‌లో పునరుద్ధ రించిన సినారె కళామందిరాన్ని, సుభాష్‌నగర్‌లో కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. అనంతరం సాయిమణికంఠ కల్యాణమంటపంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Grandalayam-KTR1

దేశం గర్వించేలా సుపరిపాలన చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అన్నివర్గాల అండదండలున్నాయని, తమిళనాడులోని డీఎంకేని, ఆ పార్టీ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకొని కలిసికట్టుగా ముందుకెళ్తే విజయం మనల్నే వరిస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చినమాట ప్రకారం డబుల్ ఆసరా పింఛన్లు ఇస్తామని ఉద్ఘాటించారు. పింఛన్ల సొమ్మును కేంద్రమే భరిస్తున్నదన్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. పింఛన్లకు ఢిల్లీ ఇచ్చేది సున్నానేనని, మొత్తం వ్యయమంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని స్పష్టం చేశారు. రైతు సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా టీఆర్‌ఎస్ ముందుకెళ్తున్నదని, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకున్నట్టుగానే త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ విజయభేరి మోగించాలని, అన్ని మున్సిపాల్టీలపై గులాబీ జెండా ఎగరాలని అన్నారు. పార్టీ ద్వారానే తాను ఎమ్మెల్యే అయ్యానని, ప్రజాప్రతినిధులందరూ పార్టీతోనే పదవులు సాధించారని గుర్తుచేస్తూ.. ఏకకాలంలో అందరికీ అవకాశాలు రాకపోవచ్చని, భవిష్యత్‌లో వస్తాయన్న విశ్వాసంతో పనిచేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఎంతో గౌరవిస్తున్నారని, అందరూ తమ ఇంటిపార్టీగా భావిస్తున్నారని తెలిపారు. సమాజానికి, ప్రభుత్వానికి వారధిలా కార్యకర్తలు పనిచేస్తేనే మనకు మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. జెడ్పీల్లో చైర్‌పర్సన్లుగా మహిళలకు సింహభాగం అవకాశాలను కల్పించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.

కాళేశ్వరం అప్పుకాదు.. భవిష్యత్ తరాలకు పెట్టుబడి
కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం అప్పు కాదని, భవిష్యత్ తరాలకు మంచి పెట్టుబడిలాంటిదని అభివర్ణించారు. కేవలం మూడేండ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రపంచమే అబ్బురపడేలా చేసిన ఇంజినీర్లను అభినందించారు. పింఛన్లు ఇస్తామంటే అందులో ఢిల్లీ సొమ్ము ఉందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పింఛన్లకు ఇచ్చే సొమ్మంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్రం ఇస్తున్నదేమీలేదని స్పష్టం చేశారు. సమైక్య ప్రభుత్వంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కడుతామంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకున్నారని, అదే స్థలంలో నేడు పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకోవడం గర్వంగా ఉన్నదని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ఓ రైతు గోస స్వయంగా విన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకే రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

Grandalayam-KTR3

పటిష్ఠమైన పార్టీ నిర్మాణమే లక్ష్యం
ప్రజలు గులాబీ జెండాను నమ్ముకుంటున్నందున ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త బాధ్యత మరింత పెరిగిందని కేటీఆర్ అన్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీని పటిష్ఠపరిచి, సుశిక్షితులైన కార్యకర్తలతో పార్టీని తీర్చిదిద్దాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్రమంతటా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి బూత్, గ్రామ, పట్టణ, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి కనీసం 50 వేల సభ్యత్వాలు చేయాలని, బోగస్ మాటలు చెప్పకుండా సరైన కార్యకర్తలకే సభ్యత్వం ఇవ్వాలని సూచించారు. దసరాలోపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణాన్ని పూర్తిచేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, తద్వారా సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేస్తామని అన్నారు.

కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టులు నిర్మించిన నిపుణులతో కార్యకర్తలకు శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. సిరిసిల్ల పట్టణాన్ని కేవలం ఐదేండ్లలోనే అభివృద్ధి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ.. ఈ అభివృద్ధి పనులను సమర్థంగా ముందుకు నడిపిన పాలకవర్గాన్ని అభినందించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషిచేసి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సభ్యత్వ నమోదుకు గడువు జూలై 20 వరకు ఉన్నప్పటికీ అన్ని జిల్లాల్లో జూలై 10 లోపే పూర్తిచేయాలని కేటీఆర్ సూచించారు. క్రియాశీల కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని, పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకూ రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందుకోసం బీమా సంస్థకు ఇప్పటికే రూ.15 కోట్లు చెల్లించామని తెలిపారు.

పార్టీ కార్యాలయానికి కేటీఆర్ రూ.2.50 లక్షల విరాళం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి తనవంతుగా నెల వేతనాన్ని (రూ.2.50 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యాలయ నిర్మాణంలో సిమెంటు, ఇసుక ఉండకూడదని, ప్రతి కార్యకర్త చెమట, రక్తంతో నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల ఇండ్లలో జరిగే శుభకార్యాలను పార్టీ కార్యాలయంలో జరుపుకొనేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి విరాళాలిచ్చే కార్యకర్తలు ముందుకు రావాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించింది. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు రూ.2 లక్షలు, సెస్ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ రూ.2 లక్షలు, చక్రధర్‌రెడ్డి రూ.2 లక్షలు, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి రూ.1.50 లక్షలు, చిక్కాల రామారావు రూ.లక్ష, చీటి నర్సింగరావు రూ.లక్ష, బాపురావు రూ.లక్షతోపాటు 30 మందికి పైగా రూ.లక్ష చొప్పున విరాళాలు ప్రకటించారు. మొత్తం రూ.40 లక్షల వరకు విరాళాలు వచ్చాయి.

Grandalayam-KTR2

రాష్ట్రంలోనే ప్రథమ అధునాతన గ్రంథాలయం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.3.60 కోట్లతో నిర్మించిన అధునాతన గ్రంథాలయ భవనం రాష్ట్రంలోనే ప్రథమమని కేటీఆర్ స్పష్టంచేశారు. అంబేద్కర్ చౌరస్తాలో మూడంతస్తుల సెంట్రల్ ఏసీ గదులతో నిర్మించిన గ్రంథాలయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముంబై పర్యటనకు వెళ్లినపుడు అద్భుతమైన అక్కడి గ్రంథాలయాన్ని చూసి ముచ్చటపడి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించినట్లు చెప్పారు. ఈ గ్రంథాలయానికి రచయితలు, కవులు మంచి పుస్తకాలు అందించాలని కోరారు. గ్రంథాలయ ప్రారంభోత్సవంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే పాల్గొనగా.. పార్టీ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి తోట ఆగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.