Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలి

-సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాలి -రాజకీయమో, ప్రజాసంక్షేమమో ప్రధాని తేల్చుకోవాలి -కేంద్రానికి ఎంపీ కవిత డిమాండ్ -నీటి కష్టాలకు చంద్రబాబు వైఫల్యమే కారణమని విమర్శ -కేంద్రంతో కొట్లాటకు ఏపీ కలిసి రావాలని విజ్ఞప్తి

సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూడాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఎంపీ కే కవిత డిమాండ్ చేశారు. రాష్ర్టాలు ఏర్పడి 14 నెలలైనా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని చాలా అంశాలు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ. 1.25 లక్షల కోట్లను ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించిన ప్రధాని మోదీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను మాత్రం ఇప్పటివరకూ పట్టించుకోలేదని అన్నారు. రాజకీయ పొత్తు ధర్మం పాటిస్తారో లేక ప్రజా ధర్మాన్ని పాటిస్తారో ప్రధాని మోదీ తేల్చుకోవాలని, దీనిపై ఆయన పునరాలోచన చేయాలని సూచించారు. ఢిల్లీలో ఆదివారం కవిత మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు విభజన, ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా, తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సాయం, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి నిధుల విడుదల.. ఇలా అనేక అంశాల్లో కేంద్రంనుంచి కదలిక లేదని అన్నారు. సమాఖ్య స్ఫూర్తి గురించి నిత్యం మాట్లాడే ప్రధాని మోదీలో అన్ని రాష్ట్రాలనూ సమదృష్టితో చూసే పారదర్శకత కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అన్యాయమే జరుగుతున్నదన్నారు. దీన్ని రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా నిలదీయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. ఇందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని చెప్తూ, ఆంధ్రప్రదేశ్ కలిసి రావాలని కోరారు.

Nizamabad-MP-Kalvakuntla-Kavitha-1

ఏపీకి ఇచ్చినహామీలు అమలవడం లేదు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కూడా కేంద్రం అమలు చేయడంలేదని కవిత అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు మనోధైర్యం వీడవద్దని, హక్కులను సాధించే దిశగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎంతోమంది యువ త ప్రాణాలర్పించారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయని గుర్తు చేశారు. కొట్లాడటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఆత్మహత్యలు వద్దని ఆమె హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాల్లోని బాధ తనకు తెలుసునని, తెలంగాణ తల్లులు పడిన దుఃఖాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంతోమంది తల్లుల్లో చూస్తున్నామని, ఒక మహిళగా తాను ఆ బాధలను అర్థం చేసుకోగలనని కవిత అన్నారు. రెండు రాష్ర్టాల పట్ల ప్రధాని అనుసరిస్తున్న వైఖరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నందున చంద్రబాబు మౌనంగా ఉంటూ, రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రాన్ని నిలదీయకపోవడం ఆ రాష్ట్రానికి శాపంగా మారుతున్నదని అన్నారు. రాజకీయ ధర్మమా లేక ప్రజా ధర్మమా అన్నది ఇప్పుడు చంద్రబాబు కూడా తేల్చుకోవాలని అన్నారు.

సమస్యల పరిష్కారానికి బాబు విముఖత పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక అంశాలు అమలుకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో కొన్ని రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోగలిగినవి ఉన్నాయని చెప్పారు. రెండు రాష్ట్రాలు చర్చలు జరిపితే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, కానీ చంద్రబాబు మాత్రం నోటితో పొగుడుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందంగా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. గత సంవత్సరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై కొన్ని అంశాలను చర్చించారని, రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేశారని, మరోమారు ఇలాంటి సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని, కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో సమస్యల పరిష్కారానికి సిద్ధం కావడంలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి అవసరాల కోసం గతంలోనే అనుమతి పొందిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తుంటే అడ్డుపుల్ల వేసే తీరులో కేంద్రానికి ఫిర్యాదు చేశారని, తన స్వంత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. సమస్యలకు పరిష్కారం దిశలో ఆలోచించడానికి బదులుగా మరింత జటిలం చేసే తీరులో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా తొండిగా వ్యవహరిస్తూ పరిష్కారం కోసం ముందుకు రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులే చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కటిగా బైటకు తీస్తున్నారని తెలిపారు.

రెండు రాష్ట్రాలకు జరిగిన అన్యాయాన్ని ఉమ్మడిగా కొట్లాడి సాధించుకోడానికి బదులుగా తెలంగాణపై బురదజల్లేందుకు, తెలంగాణకు అన్యాయం చేసేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే నష్టపోయేది ఆయనేనని కవిత కవిత హితవు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కూడా తెలంగాణ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, చట్టంలో పేర్కొన్న అన్ని అంశాల్లో వారికి అండగా నిలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌లో కీలకమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని, ఎంతకైనా కొట్లాడతామని, భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగుల విభజనలో సైతం కమిటీలు వేయాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని, సంవత్సరకాలంగా పేచీలు ఎక్కువయ్యాయని అన్నారు. విద్యుత్ విషయంలో అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది పెట్టినా ఉత్తరాది రాష్ర్టాల నుంచి కేసీఆర్ సమకూర్చుకుంటున్నారని, ఆర్థికంగా భారమైనా తప్పడంలేదని చెప్పారు. రెండు రాష్ర్టాల మధ్య సమస్యల కారణంగా అభివృద్ధి కూడా కుంటుపడుతున్నదని, దీన్ని గమనించి పారదర్శకంగా, మనస్ఫూర్తిగా కేంద్రంతో ఉమ్మడి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధం కావాలని, తెలంగాణతో కలిసి రావాలని కోరారు.

నీతి ఆయోగ్ వ్యవహార శైలిపై మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోనే తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకొచ్చారని, నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత కూడా స్పష్టంగా అంశాలన్నింటినీ కేసీఆర్ వివరించారని కవిత ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తుల అభిప్రాయాలకంటే చట్టంలోని అంశాలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉందని అన్నారు. కవిత వెంట రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళినప్పుడూ, మీడియాతో మాట్లాడినప్పుడూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సునీతా మహేందర్‌రెడ్డి, కోవ లక్ష్మి, శ్రీనివాసగౌడ్, పుట్ట మధు, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, షకీల్, గణేశ్ గుప్తా, రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్ తదితరులు ఉన్నారు.

కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులతో అన్యాయం కృష్ణా, గోదావరి నదులపై కర్ణాటక, మహారాష్ట్రలు అనేక ప్రాజెక్టులను నిర్మించాయని, ఈ కారణంగా ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్‌కు నీటి వాటాలో అన్యాయం జరిగిందని, దీనిపై కేంద్రాన్ని నిలదీయడంతో పాటు జల సంఘాన్ని కూడా ప్రశ్నించాలని కవిత చెప్పారు. రాజకీయ, ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి రాష్ర్టాల సమస్యగా భావించి సమిష్టి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వర్షాకాలంలోనే కృష్ణా నదిలో సాగు, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, భవిష్యత్తులో ఇది గోదావరి నదికి కూడా దాపురిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ రెండు నదుల్లో సాగు, తాగునీటి కష్టాలకు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు, ఇతరులే కారణమని కవిత వ్యాఖ్యానించారు. గోదావరి నదిలో నీరు ఎందుకు లేదో చంద్రబాబు విశ్లేషించాలని కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కర్ణాటక, మహారాష్ట్రలు సుమారు 300 ప్రాజెక్టులు కడితే కేవలం బాబ్లీ ప్రాజెక్టుపై రాద్ధాంతం చేయడం తప్ప ఆయన ఏనాడూ ఆ రాష్ర్టాలతో కొట్లాడింది లేదని ఆమె గుర్తు చేశారు. ఈ రెండు రాష్ర్టాల వల్ల తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతున్నదని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.