Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్నివర్గాలకు భరోసా

-ఉద్యోగులతో కొనసాగిన ఉద్యమ బంధం
-వయోపరిమితి పెంపుతో నిరుద్యోగులకూ ధైర్యం
-పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుకు హామీ
-24 అంశాలతో టీఆర్‌ఎస్ తుది మ్యానిఫెస్టో

తెలంగాణ ప్రజల అవసరాలు, అభీష్టాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను రూపొందించారు. అన్నివర్గాల ప్రజల సమస్యలపై దృష్టిసారించి, వాటన్నంటికీ రాబోయే రోజుల్లో పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, పెన్షనర్లు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర అన్ని సామాజికవర్గాల సమస్యలపై ఈ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను వచ్చే ఐదేండ్లలో అమలుచేస్తామని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన బహిరంగసభలో ఈ మ్యానిఫెస్టోను విడుదలచేశారు. దీనిలోని కొన్ని వివరాలను సీఎం కేసీఆర్ గతంలోనే మీడియా సమావేశంలో వివరించిన విషయం విదితమే. వాటికి మరికొన్ని అంశాలను కలిపి 24 అంశాలతో తుది మ్యానిఫెస్టోను ప్రకటించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చారు. పదవీవిరమణ వయసును 61 ఏండ్లకు పెంచుతామని, పెన్షనర్ల కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేస్తామని ఈ మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

అంతేకాకుండా అందరికీ ఆమోదయోగ్యనీయమైన రీతిలో ఉద్యోగులకు మధ్యంతరభృతిని ప్రకటిస్తామని, సముచిత రీతిలో వేతనసవరణ చేస్తామని హామీ ఇచ్చారు. పేదలు ఎవరైనా పేదలేనని, పేదరికానికి కులమతాలతో నిమిత్తంలేదని పదేపదే చెప్తున్న సీఎం కేసీఆర్.. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలను, కార్పొరేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు ఈ మ్యానిఫెస్టోలో వెల్లడించడంతో ఆ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. సింగరేణి సంస్థ భూముల్లో ఇండ్లు నిర్మించుకొన్నవారందరికీ పట్టాలు ఇస్తామని, మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి, వాటి నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశిబిరాలను ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీలేకుండా పోరాడుతామని, ఆసరా పింఛన్ లబ్ధిదారుల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించడంతోపాటు పింఛన్‌ను రూ.1,000 నుంచి రూ.2,016కు, దివ్యాంగుల పింఛన్లను రూ.1,500 నుంచి రూ.3,016కు, రైతుబంధు సాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని, డబుల్‌బెడ్రూం ఇండ్లు ఏర్పాటుచేసుకొనేందుకు ఆసక్తిచూపేవారికి సొంత స్థలం ఉంటే నిధులు ఇస్తామని టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలతో కోట్లమందికి లబ్ధిచేకూరనున్నది. దీంతో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నాయి.

అన్ని వర్గాలకు సముచిత న్యాయం
టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేశారు. మాటకు కట్టుబడి ఉండే సీఎం కేసీఆర్.. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తారు. ప్రభుత్వ రంగాల్లో ఔట్‌సోర్సింగ్ ఎజెన్సీలను ఎత్తివేసిన సీఎం కేసీఆర్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను పెంచారు. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించడం సంతోషదాయకం.
– జగన్నాధుని ప్రవీణ్, తెలంగాణ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు

ఐకేపీ ఉద్యోగులకు కొండంత అండ
నియోజకవర్గాల్లో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. దీంతో ఐకేపీ సిబ్బందికి ఉద్యోగభద్రత లభిస్తుంది. మహిళలతోపాటు చిరుద్యోగులకు సీఎం కేసీఆర్ మొదట్నుంచీ అండగా ఉంటున్నారు.
– తావుర్య నాయక్, ఐకేపీ ఉద్యోగుల సంఘం

ఉద్యోగులను సీఎం కేసీఆర్ ఆదుకుంటారు
ఉమ్మడి పాలనలో శ్రమదోపిడీకి గురైన చిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారు. ఐకేపీ ఉద్యోగుల తరహాలో ఆర్వీఎం ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించుకుంటున్నాం.
– మర్దం శ్రీనివాస్, ఆర్వీఎం ఉద్యోగుల సంఘం

టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోపై ఎవరేమన్నారంటే..నిజంగా ఫ్రెండ్లీ ప్రభుత్వం
ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని టీఆర్‌ఎస్ మరోసారి రుజువు చేసింది. మ్యానిఫెస్టోలో ఉద్యోగుల అంశాన్ని చేర్చి చరిత్రకెక్కింది. పదవీ విరమణ వయస్సు పెంచడం, దానికి అనుగుణంగా కొత్త ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయో పరిమితిని కూడా పెంచడం శుభసూచకం. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు స్వాగతనీయం. సముచితరీతిలో పీఆర్సీ, ఐఆర్ ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీపీఎస్‌పై కమిటీ వేయాలన్న డిమాండ్‌ను పరిష్కరిస్తారన్న విశ్వాసముంది.
– దేవీ ప్రసాద్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్

పెన్షనర్లకు మంచిరోజులు
ఎన్నో ఏండ్ల కిందటే రిటైర్ అయిన అనేకమంది పింఛన్ల కోసం ఇప్పటికీ ఫైళ్లు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు పింఛన్లు రాకముందే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుచేస్తామని టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం హర్షణీయం. -బైరం పద్మయ్య, తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇబ్బందుల నుంచి విముక్తి
పెన్షనర్ల సమస్యలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ మంచి ఆలోచన చేశారు. చాలా రోజుల నుంచి మా సమస్యలు పట్టించుకున్నవారే లేరు. ఇప్పటికే తెలంగాణ ఇంక్రిమెంట్, ఐఆర్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– నర్సయ్య, పెన్షనర్ల అసోసియేషన్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.