Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అన్నివర్గాలకు టీఆర్‌ఎస్ అండ

-కార్మికులు, కష్టజీవులు, రైతులకు సంపూర్ణ సహకారం – రైతన్నా.. చిన్న బుచ్చుకోవద్దు – నివేదికలు రాగానే ప్రతి ఎకరాకు సాయం – కరెంట్‌లో విజయం సాధించాం… – ఇరిగేషన్‌లో మరో 20 రోజుల్లో స్పష్టత – ప్రతి ఒక్కరూ కథానాయకులు కావాలి – ప్రపంచ దేశాల్లోకి టీఆర్‌ఎస్ శాఖలు – టీఆర్‌ఎస్ ప్లీనరీలో అధినేత సంక్షిప్త ప్రసంగం

KCR

రాష్ట్ర ప్రజలందరికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఈ వర్గం, ఆ వర్గం అంటూ టీఆర్‌ఎస్‌కు భేదాలు లేవు. ప్రజలందరికీ అండదండగా ఉంటుంది అని సీఎం వ్యాఖ్యానించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశంలో తీర్మానాల ఆమోదం తర్వాత ముగింపు సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 11 నెలలు మాత్రమే అయ్యింది. ఈ వ్యవధిలో కొన్ని కార్యక్రమాలను మీ ముందుకు తెచ్చాం, ఇంకా చాలా కార్యక్రమాలు మీ ముందుకు రాబోతున్నాయి అని ఆయన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయని.. ఆ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారని చెప్పారు.

కార్మిక హక్కులకు భంగం కలుగనివ్వం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల కార్మిక లోకం ఇబ్బందులకు గురవుతున్నదని కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కచ్చితంగా కార్మిక వర్గానికి అందదండగా ఉంటుందని స్పష్టం చేశారు. సిర్పూర్‌లో పేపర్ మిల్లు పరిస్థితిని చూస్తున్నారు.. మా నాయిని నర్సింహారెడ్డి రోజూ నాతో ఆ మిల్లు, కార్మికుల విషయంలో పంచాయితీ పడుతున్నారు. అన్నా దాన్ని ఎట్లాగైనా కాపాడాలి. ఎలాగైనా బతికించాలని పట్టుబడుతున్నారు. నిన్ననే కడియం శ్రీహరి వరంగల్‌లో ఏపీ రేయాన్స్ పరిశ్రమ మూతపడితే ఆ యాజమాన్యాన్ని పట్టుకొచ్చి నా ముందు కూర్చొబెట్టారు. ఆ పరిశ్రమ మూతపడకుండా కొన్ని రాయితీలు అడిగితే మంజూరు చేశాం. ఇలా ఎక్కడ ఏ పరిశ్రమ మూతపడకుండా చర్యలు తీసుకుంటున్నాం అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే కొత్త పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని.. అదేసమయంలో కార్మికుల హక్కులకు భంగం కలుగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఎంపీలు, శాసనసభ్యులు, జెడ్పీ చైర్మన్లు వివిధ తీర్మానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న కార్యక్రమాల వివరాలన్నింటినీ తెలియజేశారని పేర్కొన్నారు. మిగతా విషయాలన్నీ ఈ నెల 27న జరిగే బహిరంగ సభలో మాట్లాడుకుందామని సీఎం అన్నారు.

రైతు సోదరులకు నా మనవి తెలంగాణ రైతు సోదరులందరికీ నా మనవి.. పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తాం అని సీఎం భరోసా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మనం చాలా కష్టపడి కరెంట్‌ను బాగానే సరఫరా చేసుకున్నామని, రాష్ట్రంలో కరెంట్ సమస్యను అధిగమించ గలిగామన్నారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రాళ్ల వానలు పడ్డాయని, మరి కొన్నిచోట్ల అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మా రైతన్నలకు నా భరోసా. మీరెవరూ బాధపడొద్దు. మనసు చిన్న బుచ్చుకోవద్దు. ప్రతి ఎకరానికి కచ్చితంగా సహాయాన్ని అందిస్తాం. జరిగిన పంట నష్టానికి సంబంధించి కలెక్టర్లకు నివేదికలు పంపించాలని ఆదేశించాం. కలెక్టర్ల నుంచి నివేదికలు రావడమే ఆలస్యం. పంటనష్టానికి సంబంధించి ప్రతి రైతుకు సహాయం అందుతుంది అని సీఎం భరోసా ఇచ్చారు.

ప్రపంచ దేశాల్లోకి విస్తరిస్తున్న టీఆర్‌ఎస్ ప్రపంచంలోని అనేక దేశాలు, మహానగరాల్లోకి టీఆర్‌ఎస్ విస్తరిస్తున్నదని, లండన్‌లో కూడా టీఆర్‌ఎస్ శాఖ ఏర్పడిందని చెప్పారు. లండన్‌లో శాఖను ఏర్పరచి తెలంగాణ విశిష్టతను చాటిచెబుతున్న అనిల్ కూర్మాచలాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. థేమ్స్ నది ఒడ్డున అనిల్ కూర్మాచలం ఒక రోజు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక డిమాండ్‌ను ఇంగ్లండ్ దేశంలో చాటి చెప్పారని కొనియాడారు. అదేవిధంగా అమెరికాలో కూడా టీఆర్‌ఎస్ ఎంపీ కవిత, అనిల్ కూర్మాచలం టీఆర్‌ఎస్ శాఖలు ఏర్పాటుచేసేందుకు కృషి చేశారని చెప్పారు.

కేసీఆర్ ప్రసంగం.. మూడున్నర నిమిషాలు పదకొండు మాసాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉదయం నుంచి విస్తృత స్థాయిలో చర్చ జరిగిందని, అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, భవిష్యత్తులో నిర్వహించదలచుకున్న కార్యక్రమాలను 27న జరిగే బహిరంగసభలో చర్చించుకుందామని సీఎం చెప్పారు. ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే టీఆర్‌ఎస్ మహాసభకు 10 లక్షలపై చిలుకు జనం తరలి వస్తున్నట్లు సమాచారం ఉందని కేసీఆర్ అన్నారు. మీరందరూ ప్రజలను క్షేమంగా తీసుకొచ్చి, జాగ్రత్తగా తీసుకెళ్లే కార్యకర్తలు కాబట్టి.. వెళ్లేముందు పోటీలు పడి, ఓవర్ స్పీడ్, ఓవర్‌టేక్‌లు చేయవద్దని, క్షేమంగా ఇండ్లకు చేరుకోవాలని ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులకు సూచించారు.

అలాగే సభకు వచ్చే వారందరినీ జాగ్రత్త చూడాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు మహాసభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు, ప్రజలు ప్లీనరీకి వచ్చారని, వారందరూ క్షేమంగా తిరిగి వారి వారి ఇండ్లకు చేరుకోవాలన్నదే తమ అభిమతమని అన్నారు. అందుకే తాను సంక్షిప్తంగా మాట్లాడుతున్నానని చెప్పి కేవలం మూడున్నర నిమిషాల్లోనే కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

కార్యకర్తలు కథానాయకులు కావాలి.. ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం ఎదురుచూడొద్దు భవిష్యత్తులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను రాష్ట్ర మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మీ ముందు తీర్మానాల రూపంలో వివరించారని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు చెప్పారు. ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా ఎమ్మెల్యేలు, మంత్రులే చేస్తారని, తమకు సంబంధం లేదని అనుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు అందరూ ఎక్కడికక్కడ కథనాయకులై రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలో టీఆర్‌ఎస్ నేతలు జితేందర్‌రెడ్డి, కేశవరావు తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంనుంచి రావాల్సిన అనుమతులు, అర్హతలు, హమీలను తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తున్నారని, కేంద్రంతో పోరాటం చేస్తామని మన ఎంపీలు కూడా చెప్పారని కేసీఆర్ అన్నారు. శాసనసభ్యులు, ఎంపీలు చేసే శ్రమ సరిపోదని, టీఆర్‌ఎస్ ప్రతి కార్యకర్త కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు.

బంగారు తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణను సాధించుకునే కార్యక్రమంలో భగవంతుడు మనకు స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మంచి బుద్ధిని ఇవ్వాలని కేసీఆర్ ప్రార్థించారు. కరెంట్ రంగంలో మనం ఇప్పటికే విజయం సాధించామని, సాగునీటి రంగంలో కూడా రాబోయే 15, 20 రోజుల్లో మనకు స్పష్టత రాబోతున్నదని, అప్పుడు ఆ ప్రాజెక్టులు కూడా కూడా బ్రహ్మాండంగా చేపడుతామని సీఎం చెప్పారు. ఎంతో ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన వాటర్‌గ్రిడ్ పథకంతో ముందుకు పోతున్నామని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.