Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అణువణువునా తెలంగానం

మార్పు అనేది జీవనది లాంటిది. అది ఆగిపోదు. మొలకెత్తే గుణమున్న విత్తనం తనమీద మట్టిపెళ్ల ఉందని ఆగుతుందా? ఎంత బలంగా కప్పిపెట్టినా సరే… మట్టిని చీల్చుకుని మొలకెత్తుతుంది. విత్తనం నుంచి మొలక మట్టిని చీల్చుకుని వచ్చినట్లు తెలంగాణ ఆర్తి కలిగిన కేసీఆర్‌- ఉద్యమకారుడి నుంచి ఒక సమర్థుడైన పాలకుడిగా అనతి కాలంలోనే నిలదొక్కుకున్నారు. నాడు ఉద్యమంలో కాని, నేటి పాలనలోకాని అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపే ప్రయత్నం చేసినట్టే- తెలంగాణ వ్యతిరేక శక్తులు కేసీఆర్‌ పాలన ప్రస్థానాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

ఒక ఆలోచన జీవితాన్ని మారుస్తుందనేది నానుడి. ఒక సంకల్పం చరిత్రను సృష్టిస్తుందనడానికి తెలంగాణ ఉద్యమమే సజీవ సాక్ష్యం. తెలంగాణ విషయంలో అదే జరిగింది. మలి దశ ఉద్యమంలో ఎన్నో మలుపులు. మరెన్నో విజయాలు, అవమానాలు, అపోహలు, అవహేళనలు! వాటన్నింటినీ దాటుకుని గమ్యాన్ని ముద్దాడాం. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలన్న కలను సాకారం చేసుకున్నాం. ఈ మొత్తం మలిదశ ఉద్యమానికి కర్త, కర్మ- గులాబీ దళపతి కేసీఆర్‌ నాయకత్వం. వ్యూహాలకు ప్రతివ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు, అస్త్రాలపై బ్రహ్మాస్త్రాలు… ఇలా చెప్పుకొంటూ పోతే కేసీఆర్‌ రాజకీయ చతురత జగద్విదితమే. ఆయన వ్యూహరచన అంచనాలకు అందనిది. ఆయన వేసే ప్రతి అడుగూ భవిష్యత్తుకు మార్గదర్శనం చేసేదే. ‘స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష’ అన్న ఆచార్య జయ శంకర్‌ మాటల్ని నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారు. ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఆకాంక్షలను తన గొంతుకగా మార్చి వినిపించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర అవతరణ తరవాతా అదే స్ఫూర్తితో ముందుకుపోతున్నారు. దశాబ్దాల పరాయిపాలనలో తెలంగాణ పడ్డ గోస కళ్లారా చూసిన వ్యక్తి కేసీఆర్‌. తెలంగాణ ప్రజల కోసం అహోరాత్రాలు ఆలోచించే ఆయన నాయకత్వంలో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇది తెలంగాణ ఇంటి పార్టీ. రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలిసిన రాజకీయ శక్తి. ఇతర పార్టీలకు వంద అజెండాల్లో తెలంగాణ ఒకటి. కానీ తెరాసకు ఉన్న ఏకైక అజెండా- తెలంగాణ, తెలంగాణ అభివృద్ధి మాత్రమే.

ప్రజల అజెండా అసలు ఆరు దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ అరిగోసకు కారణమే కాంగ్రెస్‌ పార్టీ. ఆనాడు వద్దు వద్దని మొత్తుకున్నా, వినకుండా ఆంధ్రతో బలవంతపు పెళ్లి చేసింది అప్పటి జవహర్‌ లాల్‌ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ. 1969లో ఉద్ధృతంగా ఉద్యమం సాగుతుంటే దాన్ని కర్కశంగా అణచివేసి 369 మంది తెలంగాణ బిడ్డలను బలిగొన్న రక్తపిపాసి అప్పటి ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ. సమైక్యాంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ వారు కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోయినా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుపెట్టుకుని కూడా పదేళ్ల్లు కాలయాపన చేసి వందలాది బిడ్డల ఉసురు పోసుకున్నది ఆనాటి సోనియా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీనే. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదమే ప్రభుత్వ ప్రాధాన్యతాంశంగా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రతి అంశానికీ అది అడ్డుపుల్ల వేస్తోంది. నీళ్లను రానివ్వమని, నియామకాలను అడ్డుకుంటామని కోర్టుల్లో దొంగదారిలో వందలాది కేసులేస్తోందీ నేటి రాహుల్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీనే. ఆనాటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ నైజం, లక్షణం నయవంచన, పరవంచన, ఆత్మవంచన చేస్తూ దగాకోరు రాజకీయం చేయడమే. ముల్కీ రూల్స్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి తెలంగాణ యువతకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు వారికి ఇస్తానంటూ యువత ఆకాంక్షలను అవహేళన చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అయినా తెలంగాణ యువతకు న్యాయం జరుగుతుందన్న ఆనాటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావును పదవి నుంచి దించివేసింది. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ ముల్కీ రూల్సును రద్దు చేసి తెలంగాణ యువతకు అన్యాయం చేస్తే- ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే ఎన్నికలకు కాదు, వచ్చే తరాలకోసం కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేస్తున్నారు.

తెలంగాణ యాసను భాషను అవహేళన చేస్తూ ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ విమానాశ్రయం దాటకముందే ముఖ్యమంత్రి అంజయ్యను పదవి నుంచి దించిన పాపపు చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది. ఈ మధ్యనే మాజీ ప్రధాని వాజ్‌పేయీకి ప్రస్తుత ప్రభుత్వం అందించిన అంతిమ గౌరవాలను చూశాం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆనాడు తీరని అన్యాయం జరిగిందని ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ లాంటివారు పుష్కర కాలం తరవాతా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది చూస్తుంటే- తెలంగాణ నాయకులకు దిల్లీ కాంగ్రెస్‌ చేసిన అవమానాలు ఇప్పటికీ తెలంగాణ ప్రజల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. తెలంగాణలోని ఏ కాంగ్రెస్‌ నాయకుడైనా దిల్లీకి గులాములే… కొట్టాల్సింది వంగి వంగి సలాములే! కాంగ్రెస్‌ చరిత్ర మాత్రమే కాదు, ప్రస్తుత కార్యకలాపాలూ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును అది అడ్డుకున్న తీరును చూసి లోకం ముక్కుమీద వేలేసుకుంటున్నది. చనిపోయినవారి పేరుతో, లేని రైతుల పేరుతో కోర్టులను సైతం తప్పుదోవ పట్టించింది. తెలంగాణ ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరిన్‌ భూతాన్ని తరిమికొట్టి ఉపరితల నదీజలాలను అందించేందుకు ప్రారంభించిన మిషన్‌ భగీరథ నుంచి మొదలుపెడితే ప్రజలకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ వ్యతిరేకత తన రక్తంలో జీర్ణించుకుపోయిన వెయ్యి పడగల కాలనాగు- కాంగ్రెస్‌. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌. కాంగ్రెస్‌తో పాటు దాని అనుబంధ పార్టీలు, సంఘాలు కలిసి కల్పిస్తున్న నిరంతర ఆటంకాలకు, సహజంగా వేరే ఏ కొత్త రాష్ట్రమైనా అక్కడితో ఆగిపోయేదే. తెలంగాణను ఒక విఫల ప్రయోగంగా మిగల్చాలని కాంగ్రెస్‌ అండ్‌ కో పన్నిన కుట్రలను ఛేదించలేక పోయేదే. కావేరి నదీ జలాల వివాదం ఏర్పడినప్పుడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలోని అన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంటే- తెలంగాణ ప్రజల దురదృష్టం కొద్దీ ఇక్కడి కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతోంది. అందుకే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వచ్చిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు మన పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి కర్రుకాల్చి వాత పెడుతూనే ఉన్నారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు కాంగ్రెస్‌ పార్టీకి జ్ఞానోదయం కావడం లేదు.

రాజనీతి దురంధరుడు చిన్న బాలుడైన వామనుడు తన స్వరూపాన్ని భువనాంతరాలకు విస్తరించినట్లు తెలంగాణలో కేసీఆర్‌ దార్శనికత, స్వయంపాలన పరిమళాలు, అభివృద్ధి ఆలోచనలు దేశవ్యాప్తమవుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలనుంచి- జాతరకు పోయినట్టు వచ్చిపోతున్నారు. ఇవాళ తెలంగాణ పాలకుల వంటి పాలకులు తమకు కూడా ఉంటే బాగుండునని ఎందరో కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రగతికి అంతకన్నా పెద్ద నిదర్శనమేముంటది? ఎన్డీఏలో భాగస్వామ్యం లేనప్పటికీ- స్వయంగా దేశ ప్రధాని తెలంగాణ ప్రగతిని పార్లమెంటులో లోక్‌సభాముఖంగా ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలను అభినందించారు. దార్శనికతతో రాజనీతితో ముఖ్యమంత్రిగా కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ హక్కులను సాధించుకొస్తుంటే, ఓర్వలేని తనంతో విమర్శలు గుప్పిస్తున్నది కాంగ్రెస్‌. వెన్నెముక లేని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల వల్ల తెలంగాణకు ఇసుమంతైనా ఉపయోగం లేదనే సత్యం ఇవాళ మరోసారి నిరూపితమవుతోంది. ప్రతి చిన్న నిర్ణయానికి అటు దిల్లీ దిక్కో, ఇటు అమరావతి దిక్కో చూసే పరాయి పార్టీలు కాకుండా తెలంగాణ గల్లీలో నిర్ణయాధికారం ఉన్న తెరాస పార్టీనే తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడే పార్టీ అని ప్రజలకు స్పష్టత ఉంది. నేటి కొంగరకలాన్‌ ప్రగతి నివేదన సభకు తరలివస్తున్న అశేష జనవాహిని అందుకు నిదర్శనం. ఈ సభ ద్వారా తెలంగాణలో జరిగిన ప్రగతిని ప్రపంచానికి చాటేందుకు తెరాస అధినేత సన్నద్ధమవుతున్నారు. ప్రజలకు పాలన ప్రగతిని నివేదించడమనే వినూత్న విధానం ద్వారా ఒక చారిత్రక ఘట్టానికి ప్రగతి నివేదన సభ తెరతీయనుంది. తద్వారా దేశ రాజకీయ చిత్రపటం మీద తన సంతకాన్ని నమోదు చేయనుంది తెలంగాణ రాష్ట్రం!

ముఖ్యమంత్రి తన నాలుగేళ్ల పాలన ద్వారా పరిపాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారంటే దానికి సదా ఆయనకు లభించిన తెలంగాణ ప్రజల ఆశీస్సులే కారణం. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ గాని, భారతీయ జనతాపార్టీ గాని తనంత తానుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదనే విషయం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే అర్థమవుతుంది. వినూత్న విధానాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళుతున్న ముఖ్యమంత్రి పాత్ర తాను ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌ రూపంలో కేంద్రంలోనూ కీలకం కాబోతుంది. గల్లీలో ఉద్యమాన్ని రగిలించి దిల్లీ మెడలు వంచి ఎలాగైతే తెలంగాణ సాధించుకున్నమో, రానున్న సంకీర్ణ శకంలో కేంద్రంనుంచి రావాల్సినవి హక్కుగా పొందడానికి, దేశ రాజకీయాల్లో తెరాస నిర్ణయాత్మక పాత్ర పోషించాలి. తెలంగాణ సొంత అస్తిత్వాన్ని చాటుకుంటూ అభివృద్ధి పథంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ప్రభుత్వ ప్రస్థానం ఇంకా ఉద్ధృతంగా కావాలి. తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ క్షేత్రంలో పనిచేస్తూ, తెలంగాణ అభివృద్ధి కోసమే నడుస్తున్న తెరాస పార్టీ లక్ష్యమే అది. ఈ సందర్భంగా మరోసారి ఆచార్య జయశంకర్‌ మాటలను గుర్తు చేసుకుందాం. దేశానికి దిశా నిర్దేశం చేసేలా తెలంగాణ కీలక శక్తిగా మారాలి. అలా మారుతుందన్న ప్రగాఢమైన విశ్వాసం తెలంగాణ ప్రజానీకం వ్యక్తపరుస్తోంది!

— కల్వకుంట్ల తారకరామారావు,రాష్ట్ర మంత్రి

(ఈనాడు దినపత్రిక ఎడిట్ పేజీ నుంచి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.