– హైకోర్టు విభజనకు చొరవ తీసుకోండి – గవర్నర్‌కు టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి – రాజ్యాంగం అమలులో ఏపీ ప్రభుత్వం విఫలం: కేకే – తెలంగాణ కేసులు ఏపీ జడ్జీలు విచారించొద్దు: జితేందర్‌రెడ్డి – హైకోర్టు విభజన తేలేవరకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం: వినోద్

ఉమ్మడి హైకోర్టును తక్షణం విభజించేందుకు చొరవ తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తులు తమకు ఎంతమాత్రమూ అక్కరలేదని స్పష్టంచేశారు. రాష్ట్రం విడిపోయి ఏడాది పూర్తయినా హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీలు గవర్నర్ దృష్టికి తెచ్చారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనాయకుడు జితేందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీ వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీపాటిల్, నగేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఓ నివేదికను అందజేశారు. అనంతరం రాజ్‌భవన్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు.

ఏపీది రాజ్యాంగ ఉల్లంఘన: కేకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైందని కే కేశవరావు విమర్శించారు. ఆరునెలల్లోపు ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలంటూ గవర్నర్‌కు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ ఇటీవలే లేఖలు రాసిన విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు కేకే తెలిపారు.
పార్లమెంటులో లేవనెత్తుతాం: జితేందర్‌రెడ్డి తెలంగాణ కేసులు ఆంధ్రా జడ్జీల ముందు విచారించవద్దన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేనున్నట్టు ఎంపీ జితేందర్‌రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 30 ప్రకారం హైకోర్టు విభజించాలని స్పష్టంగా ఉన్నా, ఏడాదికాలంగా ఎంతమందికి ఎన్నిసార్లు విన్నవించినా, పార్లమెంట్లో ఆందోళనలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 21నుంచి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు. మరో ఎంపీ వినోద్ మాట్లాడుతూ హైకోర్టు విభజన అంశాన్ని తేల్చేవరకు అవసరమైతే పార్లమెంటులో అన్ని బిల్లులు అడ్డుకుంటామన్నారు. హైకోర్టు విభజనకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా హామీ ఇచ్చి, దానిని అమలు చేసేవరకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకోసం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి పంపితే ఆయన దాన్ని నోటిఫై చేస్తారని, కానీ ఏడాదికాలంగా దీనిపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని వినోద్ విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక దాదాపు 56 దేశాలు తిరిగారు.
కానీ దేశంలో 29 రాష్ర్టాలుంటే 16 రాష్ర్టాలు కూడా తిరగలేదు. ఆయన 63 రోజులు విదేశీ పర్యటలు చేస్తే, రాష్ట్ర పర్యటనలు చేసింది కేవలం 23 రోజులే. విదేశీ పర్యటనల్లో బిజీ అయిన ప్రధాని రాష్ర్టాల పరిస్థితులపై దృష్టిపెట్టడం లేదనడానికి హైకోర్టు విభజనలో జాప్యమే నిదర్శనం అని వినోద్ అన్నారు. ఏపీ ప్రజలకు, న్యాయవాదులకు ఒక హైకోర్టు చూపాల్సి బాధ్యత ఏపీ సీఎంపై ఉందని, దాన్ని వదిలేసి తెలంగాణ ప్రభుత్వాన్ని గిచ్చి కయ్యాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారన్న అంశంపై ఏపీ సీఎంతో మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చినట్టు వినోద్ తెలిపారు.