Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అపర భగీరథుడికి హరిత కానుక

ఆకుపచ్చ తెలంగాణను ఆకాంక్షించిన జననేత కలను తెలంగాణ సమాజం సాకారంచేసింది. సోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 66వ పుట్టినరోజున లక్షలకొద్దీ మొక్కలునాటి ప్రకృతినే పరవశింపజేసింది. పట్నం పల్లెలన్న తేడా లేకుండా.. కర్మాగారాలు.. కళాకేంద్రాలు, కార్యాలయాలు.. కారాగృహాలు.. గుడిలో.. బడిలో.. మడిలో.. తెలంగాణ భూభాగంలోని ప్రతి అణువునా మొక్కలు నాటుకున్నాయి. సామాన్యుడి నుంచి అమాత్యుల వరకు.. కార్మికుల నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరు ఈ మహా హరితయాగంలో భాగస్వాములయ్యారు. అపరభగీరథుడి జన్మదినాన్ని పచ్చని పర్వదినంగా తెలంగాణ జరుపుకొన్నది. తెలంగాణ జాతిపితకు యావత్‌దేశం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. పలు రాష్ర్టాల మంత్రులు.. అనేక మంది రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు నలభై దేశాల్లో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడికక్కడ కేక్‌లు కట్‌చేసి, రక్తదానాల వంటి అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారు. తమ నేత నిండునూరేళ్లు జీవించాలని ఆలయాల్లో పూజలు చేశారు. ప్రగతిభవన్‌లో పలువురు ప్రముఖులు సీఎంను స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

-వాడవాడలా పండుగలా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
-ఊరూరా మొక్కలునాటి శుభాకాంక్షల వెల్లువ
-నిండు నూరేండ్లు జీవించాలని ఆలయాల్లో పూజలు
-జలవిహార్‌లో 66 కిలోల కేక్‌ కట్‌చేసిన ప్రజాప్రతినిధులు
-పలుచోట్ల అన్నదానాలు, రక్తదాన శిబిరాలు

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, జననేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను సోమవారం వాడవాడలా పండుగలా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, టీజీవోలు, టీఎన్జీవోలు, గులాబీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు, సంస్థలు, కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాల్లో, దవాఖానల్లో సిబ్బంది సీఎం కేసీఆర్‌కు కానుకగా తలా ఒక మొక్కనాటారు. కేక్‌ కట్‌చేసి, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. జలవిహార్‌లో 66 కిలోల కేక్‌ కట్‌చేశారు.

సీఎం కేసీఆర్‌ జీవిత చిత్రాల ఫొటో ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గులాబీ శ్రేణులు పలుచోట్ల ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించాయి. కేసీఆర్‌ నిండు నూరేండ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రధాన దేవాలయాలతోపాటు మొత్తం 12,265 ఆలయాల్లో సీఎం గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు చీరలు పంపిణీచేశారు. తెలంగాణభవన్‌లో దివ్యాంగులకు 66 వీల్‌చైర్లు, అంధులకు 55 జతల బట్టలను పంపిణీచేశారు. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు.

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ కుటుంబసభ్యులు మొక్కలునాటారు. శాసన, శాసనమండలి సభ్యుల సౌకర్యార్ధం అసెంబ్లీలో ఏర్పాటుచేసిన ఫిట్‌నెస్‌ సెంటర్‌ను స్పీకర్‌, మండలి చైర్మన్‌ ప్రారంభించారు. తెలంగాణ ఉభయ సభల సభ్యుల సమగ్ర వివరాలతో కూడిన డైరీని ఆవిష్కరించారు. ఏపీ టీఆర్‌ఎస్‌ నేత ఆదినారాయణ ఆధ్వర్యంలో విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక పూజలుచేసి, పేదలకు చీరలు పంపిణీచేశారు. ఢిల్లీలో కేసీఆర్‌ అభిమాని ఆంజనేయులు అంధుల పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్‌కట్‌చేసి, పండ్లు పంపిణీచేసి, భోజనం ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవాడల్లో 1.32 లక్షల మొక్కలనునాటారు.

అమెరికా, ఇంగ్లాండ్‌, యూరప్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, మలేషియా, ఆస్ట్రియా, లాట్వియా, పెరూ, కెనడా, బెహ్రయిన్‌, సౌత్‌ఆఫ్రీకా, ఖతార్‌, కువైట్‌, టాంజానియా వంటి 40 దేశాల్లో మొక్కలునాటి వేడుకలు జరుపుకొన్నారు. వ్యవసాయ వర్సిటీలో వీసీ ప్రవీణ్‌రావు, బషీర్‌బాగ్‌లోని లోకాయుక్త కార్యాలయ ప్రాంగణంలో లోకాయుక్త జస్టిస్‌ సీవీ రాములు, ఉపలోకాయుక్త నిరంజన్‌రావు మొక్కలు నాటారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సోషల్‌ రెస్సాన్సిబిలిటీలో భాగంగా ‘మియావాకి’ పద్ధతిలో అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సమావేశమందిరంలో బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు గండ్ర మోహన్‌రావు కేక్‌ కట్‌చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.