Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏపీఐఐసీ భూములపై విష ప్రచారం

-బ్లాక్‌మెయిలర్ల ఆటలు సాగవ్.. అబద్ధాలు చెబితే గెంటేయాలి -ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదు -విక్రయం, బదిలీ, మినహాయింపులన్నీ కాంగ్రెస్ హయాంలోనే.. -అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన- -అన్ని ఫైళ్లూ స్పీకర్ ముందు పెడతాం.. -ఓర్వలేని వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరు -ఎంగిలి మెతుకుల కోసం ఆరోపణలు చేస్తున్నరు -ప్రత్యేక రాష్ట్రం కోసం నా ప్రాణం కూడా పెట్టిన -ఎవరో నామినేట్ చేస్తే రాలే..ప్రజలు దీవెనతో సీఎం అయ్యా -సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

KCR addressing in Assembly

తెలంగాణ ప్రభుత్వం మీద టీడీపీ విషం గక్కుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఏపీఐఐసీ భూముల విక్రయాలు, కేటాయింపుల విషయంలో తమకేమీ సంబంధం లేదని, అవి గత సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో జరిగినవేనని తేల్చి చెప్పారు. కానీ.. కొన్ని పక్షాలు పనిగట్టుకుని ఇష్టారాజ్యంగా బురదజల్లడమే కార్యక్రమంగా పెట్టుకున్నాయని అన్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి సభలో సంస్కారహీనంగా ఆరోపణలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. నిరాధారమైన, తాడూబొంగరంలేని నిందలు వేస్తున్నారని, బట్టకాల్చి మీద పడేస్తున్నారని దుయ్యబట్టారు. నోటికి ఎంతవస్తే అంత, ఏది తోస్తే అది ఆరోపణలు చేసే సభ్యులను నియంత్రించాల్సిన అవసరముందని స్పీకర్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సభలో ఏ సభ్యుడైనా చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించకపోతే వారిని సభనుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. సభలోని అన్ని పక్షాల నాయకులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొత్త రాష్ట్రంగా దేశానికి ఒక ఆదర్శప్రాయమైన సంప్రదాయాన్ని అందిద్దామని అన్నారు. తన ప్రభుత్వం మీద, తనమీద అదేపనిగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న తీరుమీద కేసీఆర్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.

గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్ అనంతరం 2006లో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా విక్రయించిన ప్రభుత్వ భూములపై సీఎం సుదీర్ఘ ప్రకటన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ సవివరంగా సమాధానమిచ్చారు. సిమెంటు ధరల పెంపునుంచి.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌దాకా ఎన్ని నిరాధార ఆరోపణలు చేశారో వివరిస్తూ టీడీపీ సభ్యులను కడిగిపారేశారు. సభనుంచి ప్రభుత్వం పారిపోయే ప్రసక్తే లేదని, అవసరమైతే ఇంకో 30 రోజులు సమావేశాలు నిర్వహించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. ఒక్క డీఎల్‌ఎఫ్ మాత్రమే కాదు.. ఎమ్మార్ సహా ఐఎంజీ భూములవంటి అనేక విషయాల్లో గత ప్రభుత్వాల బండారాన్ని బయటపెట్టబోతున్నామని హెచ్చరించారు.

కాల్ అటెన్షన్‌పై చర్చ.. సీఎం విధాన ప్రకటన అనంతరం కాల్ అటెన్షన్ నోటీస్‌పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఏపీఐఐసీ భూములను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పనంగా రాసిచ్చిందని కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. అసలు ఎన్ని సంస్థలకు విక్రయించారో, అందులో ఎవరు ప్రత్యామ్నాయ భూములు అడిగారో వివరాలివ్వాలని కోరారు.

ఫైళ్లు స్పీకర్ ముందుంచుతాం బాలరాజు ప్రశ్నలకు స్పందించిన సీఎం.. విపక్షాల ఆరోపణలను ఘాటుగా, దీటుగా తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఈ భూముల విక్రయంతో తమ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాల హయాంలోనే విక్రయాలు, కేటాయింపులు, బదిలీలు జరిగిపోయాయని చెప్పారు. భూముల విక్రయాలకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ శాసనసభ స్పీకర్ ముందు పెడతామని, సభ్యులందరూ వాటిని పరిశీలించవచ్చని సీఎం తెలిపారు.

అనవసరమైన, సత్యదూరమైన ఆరోపణలు చేసిన వాళ్లు కూడా ఫైళ్లను పరిశీలించవచ్చన్నారు. ఆరోపణలు చేసిన వారు వాటిని శాసనసభలో రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. అసత్య ఆరోపణలు చేసే సభ్యులను సభ అభిశంసించాలని, వారు చేసిన ఆరోపణలు రుజువుచేసే వరకు శాసనసభలో వారికి అవకాశం కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. సంస్కారహీనంగా ఆరోపణలు చేసేవారికి శిక్ష ఉండి తీరాలని, లేదంటే సభ విలువ లేకుండా పోతుందని అన్నారు. దిక్కుమాలిన ఆరోపణలు.. తాడుబొంగరం ఉండదు. ఆధారాలు లేని ఆరోపణలు చేసిన వారికి ఏం శిక్ష విధించాల్నో దయచేసి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. అందుకు సభ్యులంతా కట్టుబడి ఉంటం అని సీం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

పదవులు విసిరికొట్టినం ఏపీఐఐసీ విక్రయించిన భూములకు, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం వివరించారు. వాస్తవానికి ఆ భూములను అమ్మవద్దని ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ తదితరులు ఆందోళన కూడా చేశారని గుర్తు చేశారు. అయితే ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చాలా మొండిగా వ్యవహరించి, భూములు విక్రయించారని చెప్పారు.

రూ.10వేల కోట్ల విలువైన భూములు అమ్మినట్లు ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇటీవలే అసెంబ్లీలో కూడా చెప్పారని గుర్తు చేశారు. దీన్ని పట్టుకుని కొంతమంది నందగిరి దొరకి ఇంకో దొర భూమలు రాసిచ్చిండని, గడీల పాలన అని, మరోసారి దొరకోసం సిమెంట్ ధరలు పెంచినమని, ఇంకోసారి దొర కోసమే మెడికల్ ఫీజలు పెంచినమని సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు అని సీఎం నిప్పులు చెరిగారు. రాష్ట్రంకోసం నా ప్రాణం కూడా ఫణంగా పెట్టిన. ఎవరి పంచన బతుకలేదు. తెలంగాణకు అన్యాయం జరిగిందని పదవులు విసిరికొట్టినం.

ఇది చరిత్ర. తుడిచేస్తారా? ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఎవరో నామినేట్ చేస్తే రాలే. ప్రజలు మెజార్టీ ఇచ్చారు. పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్నం. ఒంటరిగా పోరాడి గెలిచినం. ఓర్వలేని వాళ్లు, డైజెస్టు కాని వాళ్లు, ఇంతకు ముందు పెత్తనం చేసి పదవులు పోగొట్టుకున్న వాళ్లు, ఎంగిలి మెతుకులకు ఆశపడే వాళ్లు, రాష్ట్రం వచ్చిందని జీర్ణించుకోలేక వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి విమర్శించారు. సిమెంట్ ధరలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని కేసీఆర్ అన్నారు. అయినా ఈ రోజు తెలంగాణలో బస్తా సిమెంట్ ధర రూ.230 ఉంది. అదే పక్క రాష్ట్రం ఏపీలో రూ.300 ఉంది. మరి.. ఆంధ్రాలో ఎవరి కోసం ధరలు పెంచారు? అని కేసీఆర్ నిలదీశారు. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని హితవు పలికారు. నీటిపారుదల మీద సభ్యులు సూచనలు చేశారు. దయాకర్‌రావు సూచనలిచ్చారు. లక్ష్మణ్, జీవన్‌రెడ్డి కూడా ఇచ్చారు. పాటిస్తం.. నెత్తిన పెట్టుకుంటం అని సీఎం చెప్పారు.

సింగిల్ విండో పదవి నుంచి.. పదవులు తమకు కొత్త కాదని, సింగిల్ విండో సభ్యుడి స్థాయి నుంచి కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ వరకు పదవులు నిర్వహించానని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రధాని మంత్రిది కూడా క్యాబినెట్ ర్యాంకేనని అన్నారు. ప్రజల దీవెనతో సీఎం అయ్యానని తెలిపారు. ఏనుగు పోతుంటే చిన్న చిన్న జంతువులు అరుస్తుంటయ్.. పట్టించుకోవద్దని తమ సహచరులకు చెప్పానని సీఎం తెలిపారు.

ఏపీఐఐసీ కూడా ఆషామాషీగా భూములు విక్రయించలేదని, గ్లోబల్ బిడ్ పిలిచి, వేలంద్వారా భూములు విక్రయించిందన్నారు. 2006లో 105.54 ఎకరాలకు వేలం వేస్తే బెంగళూరుకి చెందిన దేవభూమి రియల్టర్స్ రూ.483 కోట్లతో 30 ఎకరాలు, డీఎల్‌ఎఫ్ గుర్గావ్ సంస్థ ఒకసారి 18.11 ఎకరాలు, మరోరోజు 6.35 ఎకరాలు రూ.580.51 కోట్లకు కొనుగోలు చేసింది. దానికి అదనంగా రూ.34.83 కోట్లు చెల్లించి, రిజిస్టర్ చేయించుకుంది. ఐటీసీ ఢిల్లీ సంస్థ రూ.127.50 కోట్లతో 5 ఎకరాలు, మైహోం రియల్టర్స్ రూ.100 కోట్లకు 5 ఎకరాలు, పయనీర్ ఇన్‌ఫ్రా రూ.100 కోట్లకు 5 ఎకరాలు, పూర్వాంకర ప్రాజెక్ట్స్ రూ.403 కోట్లకు 19.19 ఎకరాలు, టీబీపీపీ ఢిల్లీ సంస్థ రూ.224.80 కోట్లకు 10 ఎకరాలను ఓపెన్ ఆక్షన్‌లో కొన్నరు అని సీఎం వివరించారు.

రాజకీయ అర్భకులు.. ఆరోపణలు రుజువు చేయకపోతే శిక్ష ఉండి తీరాలి. లేదంటే విలువ లేకుండాపోతుంది. ఒకప్పుడు శాసనసభ అంటే దేవాలయం. ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మొన్ననే మహారాష్ట్రలో కొందరు సభ్యులు గవర్నర్‌ను ఘెరావ్ చేస్తే, కొత్తగా ఎన్నికైన సీఎం ఐదుగురు సభ్యులను రెండేండ్ల పాటు ఎత్తి అవతల పడేశారు. శాసనసభ విలువలు కాపాడడం కోసమే ఆయన అలా చేశారు. కానీ మన దగ్గర దిక్కుమాలిన ఆరోపణలు.

మొన్న నేను కరెంట్ కొనుగోలు చేసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ వెళ్తే రాజకీయ అర్భకులు.. కొందరు సొల్లు పురాణం మాట్లాడే వ్యక్తులు మీ కమీషన్ ఎంత? అని వెకిలి ప్రశ్నలు వేస్తారా? ధర ఎంత అనేది ఈఆర్సీ నిర్ణయిస్తుంది. ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సీఎంలు సంతకాలు చేయరు. అధికారులు చేస్తరు. ఇంత కక్ష, ఇంత ఓర్వలేని తనం ఎందుకు? అని సీఎం ప్రశ్నించారు.

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. మైహోం సంస్థకు సౌత్ ఇండియాలో సిక్స్ స్టార్ క్రెసిల్ ఉందని, ఆ సంస్థ ప్రైవేటు భూములు కొనుక్కున్నదే తప్ప ఒక్క గజం కూడా ప్రభుత్వ భూమి ఎలాట్ చేయలేదని సీఎం తెలిపారు. ఏపీఐఐసీ విషయంలో ఆ సంస్థ బాజాప్తాగా వేలంలో కొనుగోలు చేసిందన్నారు. అయితే ఆ సంస్థ ఛైర్మన్ రామేశ్వరరావును కొంత మంది బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగారని, ఆయన నిరాకరించడంతో లొల్లి చేశారని సీఎం తెలిపారు.

అసెంబ్లీ వేదికగా చెబుతున్నా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే ఇన్వెస్టర్స్ అందరికి ఒకటే విన్నపం. మిమ్ములను ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రగతి రథ చక్రాలను ఎవ్వరూ ఆపలేరు అని చెప్పారు. వాస్తవానికి హెరిటేజ్ భూములు ఎవ్వరికీ కేటాయించకూడదని నాటి సీఎం చంద్రబాబు జీవో జారీ చేశారని సీఎం తెలిపారు. అయితే హెరిటేజ్ భూముల కింద ఉన్న 115 ఎకరాలను మైండ్ స్పేస్‌కు, హైటెక్ సిటీ, కన్వర్జీస్, పయనీర్ ఆంధ్రా, ఆర్యభట్ట సొల్యూషన్స్.. ఇలా అందరికీ ఆయనే ఇచ్చేశారని సీఎం కేసీఆర్ వివరించారు.

ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని, ఇంకా ఎమ్మార్ ప్రాపర్టీస్, ఐఎంజీపైనా మొత్తం చర్చ జరగాలని, ఇంకో 20 రోజులు కాకపోతే 30 రోజులు సభ నడుపుకుందామని అన్నారు. నిండు సభలో అబద్ధాలు చెప్పిన వ్యక్తులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే ప్రొసీడింగ్స్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని సీఎం స్పీకర్‌ను కోరారు.

మంత్రుల సాక్షిగా జరిగింది.. ఏపీఐఐసీ విక్రయించిన భూముల్లో హెరిటేజ్ భూములు ఉన్నాయని ఓ వ్యక్తి పిటిషన్ పెట్టాడని, డీఎల్‌ఎఫ్, పూర్వాంకర కొనుగోలు చేసిన భూముల్లో హెరిటేజ్ భూములు ఉన్నాయని తేలిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఏపీఐఐసీ తప్పిదంవల్ల ఈ భూములు కట్టబెట్టినమని ఆనాటి సీఎం కిరణ్ అంగీకరించి, ప్రత్యామ్నాయ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. ఈరోజు సభలో ఉన్న ఆనాటి మంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉపసభాపతి భట్టి విక్రమార్క సాక్షిగా ఇది జరిగింది. గీతారెడ్డి ఆనాడు పరిశ్రమల మంత్రిగా ఉన్నారు.

ఆమె పంపిన ఫైల్‌కు 12.2.14న అప్పటి సీఎం కిరణ్ ఆమోదం తెలిపారు అని కేసీఆర్ వివరించారు. మొత్తం అన్ని నోట్ ఫైల్స్ తమ వద్ద ఉన్నాయని, అన్నీ సభాపతి టేబుల్‌పై పెడతామని సీఎం తెలిపారు. ఈ సమయంలో మల్లు భట్టివిక్రమార్క జోక్యం చేసుకోబోతుంటే వాస్తవాలు చెబుతుంటే వినరా? వాస్తవాలు నచ్చడం లేదా? జీర్ణం చేసుకోలేకపోతున్నారా అని సీఎం ప్రశ్నించారు. డీఎల్‌ఎఫ్‌కు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూముల్లో అప్పటి ఐటీ శాఖ మంత్రి పొన్నాలకు గేమింగ్ సిటీ పెట్టాలని కలపడ్డది. సీఎం కిరణ్ అదే భూమిలో శంకుస్థాపన చేశారు.

ఆనాడు టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, మహేందర్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్, రాములు, కేఎస్ రత్నం, జైపాల్‌యాదవ్, హరీశ్‌రావు, స్వామిగౌడ్, మెహమూద్‌అలీ, ఎమ్మెల్సీలు భాను, జగదీశ్‌రెడ్డి దానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగిందని పోరాడారు. అప్పుడు ఏపీఐఐసీ ఎండీగా ఉన్న జయేశ్ రంజన్‌ను కలిసి సీఎం అంగీకారం తెలిపినా, ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు అని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చి ఆ ఫైల్ గవర్నర్ దగ్గరకు వెళ్లిందన్నారు. గవర్నర్ దానిపై ఎల్ ఓ (లైవ్ ఓవర్)అని రాసి పక్కనపెట్టారని సీఎం చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫైల్ చూసి గత ప్రభుత్వంలోనే అన్ని నిర్ణయాలు జరిగిపోయాయి కాబట్టి అనుమతించామని సీఎం జవాబిచ్చారు. ఇందులో తాను చేసింది ఏమీ లేదని స్పష్టంచేశారు.

విధాన ప్రకటన సీఎం మాటల్లో… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్. 161 తేదీ 2006 ఫిబ్రవరి 13న 424.13 ఎకరాలు మరియు జీవోఎంఎస్ 1077 తేదీ 2008 సెప్టెంబర్ 2న 46.20 ఎకరాలు.. మొత్తంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలోని సర్వే నంబరు 83/1లోని 470.33 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీకి నిధుల సమీకరణ కోసం అప్పగించింది.

తద్వారా 2007 మార్చి నుంచి నవంబర్ వరకు 105.54 ఎకరాల భూమిని ఏడు సంస్థలకు విక్రయించి, రూ.2018.82 కోట్ల నిధులను సమీకరించి, ఆ నిధులను ఏపీఐఐసీ ప్రభుత్వానికి అప్పచెప్పింది. అయితే ఈ భూమి పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం నిబంధనలకు లోబడి ఉందా? లేదా? అనే విషయంలో కోర్టు వివాదాలు కూడా ఉన్నందున, తీర్పుకు లోబడే కొనుగోలుదారులకు హక్కులుంటాయనే విషయాన్ని కూడా ప్రభుత్వం ముందే కొనుగోలుదారులకు తెలియపర్చింది. 2010 అక్టోబర్ 8న సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత ఏపీఐఐసీనుంచి కొనుగోలు చేసిన భూమిని రిజిస్టర్ చేసుకోవాలని ఏడు సంస్థలను ప్రభుత్వం కోరింది.

ఆ ఏడు సంస్థల్లో ఒకటైన డీఎల్‌ఎఫ్ 2007 ఆగస్టు 27న ఎకరానికి రూ.18.11 కోట్ల రేటుతో మొత్తంగా 452.57 కోట్లు చెల్లించి వేలంలో 25 ఎకరాలు కొనుగోలు చేసింది. అదే సంస్థ 2007 నవంబర్ 20న ఎకరానికి రూ.20.10 కోట్ల రేటుతో 6.35 ఎకరాలను రూ.127.75 కోట్లు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. డీఎల్‌ఎఫ్ సంస్థ మొత్తం రూ.580.51 కోట్లు చెల్లించి, 31.35 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇలా కొనుగోలు చేసిన భూమిని రూ.34.83 కోట్లు స్టాంపు డ్యూటీ కింద చెల్లించి డీఎల్‌ఎఫ్ సంస్థ 2013 సెప్టెంబర్ 6న రిజిస్టర్ చేసుకుంది. ఇలా కొనుగోలు చేసిన సంస్థలు నిర్మాణాల కోసం జీహెచ్‌ఎంసీని అనుమతి కోరాయి. అయితే ఈ భూమిలో కొంత భాగం జీఓఎంఎస్-4 ప్రకారం వారసత్వ సంపద కింద నమోదై ఉన్నందున అనుమతులు నిరాకరించబడ్డాయి. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ప్రభుత్వం అధికారులు, నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీ 2014 జనవరి 10న నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం డీఎల్‌ఎఫ్ సంస్థకు అమ్మిన భూములు వారసత్వ సంపదలో భాగమని, కాబట్టి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని సూచించింది. డీఎల్‌ఎఫ్ రాయదుర్గ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారికంగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీ నిబంధనలకు లోబడి 2014 జనవరి 8న తన పేరును ఆక్వాస్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చుకుంది.

ఈ సంస్థ జనవరి 20న తమకు ఫ్లాట్ నెం. 22, 23, 24, 30ఏ, 31, 32, 33లో ఉన్న 31.3 ఎకరాల భూమిని తాము కొన్న భూమికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని లేదా డబ్బును వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం చూపించిన భూమినే తాము కొన్నాము కాబట్టి, ప్రత్యామ్నాయ భూములు పొందాల్సిన అవసరం రావడానికి బాధ్యులం తాము కాదు కాబట్టి, ఈ వెసులుబాటు కల్పించాలని అభ్యర్థించింది.

డీఎల్‌ఎఫ్ మొదట కొనుగోలు చేసిన ప్లాటు నంబర్ 6,7,11,12 మరియు 14 పరిధిలోని భూములన్నీ పక్కపక్కనే ఒకే యూనిట్‌గా ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఒకే యూనిట్‌గా భూమి ఇవ్వాలంటే ప్లాట్ నెంబర్. 22, 23, 24, 30ఏ, 31, 32, 34లలో మాత్రమే ఉంది. రెండు కూడా 31.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నవే. దీని ప్రకారమే గత ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 13న సదరు భూమిని ఏపీఐఐసీ ద్వారా ఆక్వాస్పేస్‌కు అప్పగించాలని నిర్ణయించింది. దీనికి జారీ అయిన మెమో నంబర్ 158/ఐఎన్‌ఎఫ్/ఏ1/2014పై అప్పటి సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి సంతకాలు కూడా చేశారు. ఇదే ఫైల్లో రూ.34.83 కోట్ల స్టాంప్ డ్యూటీని కూడా ప్రత్యామ్నాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అడ్జస్ట్ చేయాలని అప్పటి సీఎం అంగీకరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.