-ఫిబ్రవరి రెండోవారంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం -పకడ్బందీగా పార్టీ బలోపేతం -త్వరలో గ్రేటర్ మంత్రులతో విస్తృతస్థాయి సమావేశం -మీడియాకు కేకే, మంత్రుల వెల్లడి

ఫిబ్రవరి రెండోవారంనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపడుతామని పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం వివిధ కార్యక్రమాలలో నిమగ్నమైన ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇకపై పార్టీ నిర్మాణం బలోపేతం మీద దృష్టి పెడుతారని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయినుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీని పకడ్బందీగా నిర్మించుకుంటామని తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు గుండెలకు హత్తుకుంటున్నారని ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళతామని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మంత్రులు, ఇతర ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను పార్టీ సెక్రటరీ జనరల్ కేకే మీడియాకు తెలియపరిచారు.
అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్యులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారని, ప్రధానంగా పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, కంటోన్మెంట్ ఫలితాలపై చర్చించామని చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం వంటి ప్రధాన అంశాలపై తదుపరి సమావేశంలో చర్చిస్తామన్నారు.
హైదరాబాద్‌లో బహిరంగ సభ.. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్ష హోదాలో నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రణాళికలు, వివిధ జిల్లాల్లో సీఎం పర్యటన, మెదక్ ఉప ఎన్నిక, కంటోన్మెంట్ ఎన్నికల్లో ప్రజల స్పందనపై చర్చించామన్నారు. ఇక ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మరోవైపు పార్టీని బలోపేతం చేస్తామని, ఈ రెండు సమాంతరంగా కొనసాగుతాయన్నారు. పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్‌ను ఎన్నుకొని రెండేండ్లు అయిందని, ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉందని చెప్పారు.
ఇందులో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని, ప్రతి నియోజకవర్గంలో 25వేల సాధారణ, ఐదువేల క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ఆతర్వాత గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుంటా మన్నారు. పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 27న బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. సభ్యత్వ నమోదును జిల్లా మంత్రులే సమన్వయం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీలోకి కొత్తవారు వచ్చినా, పాత వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు.
గ్రేటర్‌నుంచి త్వరలోచేరికలు.. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన నలుగురు మంత్రులు, ఇతర పార్టీ నగర ప్రముఖులతో త్వరలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో ప్రజల స్పందన చూసి గ్రేటర్ హైదరాబాద్‌లో పలు పార్టీల నుంచి ప్రముఖులు టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలుంటాయని, కొందరు ఎమ్మెల్యేలు కూడా తమతో సంప్రదిస్తున్నారని తెలిపారు.
నగరంలో అనుమతిలేకుండా వేలాది ఇండ్లు ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించే క్రమంలో ఉన్న సాధక బాధకాలపై కూడా చర్చించి అందరికీ అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అందరికీ క్రమబద్దీకరణ జరగాలనేదే ప్రధాన ఆలోచన అన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీ ఎన్నికలపైనా సమీక్షలో చర్చించామన్నారు. గ్రేటర్‌పై త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు సమావేశంలో మంత్రులు పద్మారావు, నల్లగొండ, మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌ఛార్జిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, కంటోన్మెంట్ ఇన్‌ఛార్జి గజ్జెల నగేష్ పాల్గొన్నారు.