ఎన్టీఆర్ సమాధి, పీవీ సమాధి పగులగొడ్తమని ఓ పిచ్చోడు అంటడు. ఇంకో పిచ్చోడేమో బండ్లు రాంగ్ రూట్ల నడుపుండ్రి, చలాన్లు జీహెచ్ఎంసీ కడ్తదంటడు. మా పిల్లగాండ్లను ఆగం జేస్తరా మీరు? చలాన్లు, మోటర్ వెహికల్ చట్టం తెచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? – కేటీఆర్

“నేనేమో ఐటీ కంపెనీలు తెచ్చి కొలువులు ఇప్పిస్తం అంటున్న. వాళ్లేమో హిందూ, ముస్లిం పంచాయతీలు పెట్టి కర్ఫ్యూలు తెస్తం అంటున్నరు. ఎవరు కావాల్నో ఆలోచించండి. మన బతుకులు బాగుచేసే వాళ్లను, మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చే వాళ్లను గెలిపించండి” అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగిన సభకు పెద్దసంఖ్యలో హాజరైన ప్రజలను ఇక్కడ చూడొచ్చు.
‘హైదరాబాద్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేద్దామని మేం అంటుంటే.. బీజేపోళ్లు హిందు-ముస్లిం పంచాయతీ, కర్ఫ్యూలు తెస్తామంటూ లొల్లి చేస్తున్నారు. వాళ్లు చెప్పే మాటలు విని ఆగం కాకుండ్రి.. ఆలోచించి ఓటు వేయండి’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఐఎల్ క్రాస్‌రోడ్, మల్లాపూర్ శివహోటల్ జంక్షన్, చిలుకానగర్ జంక్షన్, హెచ్‌పీఎస్ రామంతాపూర్‌లో మంత్రి రోడ్‌షో నిర్వహించారు. కాప్రా, డాక్టర్ ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, మల్లాపూర్, మీర్‌పేట హెచ్‌బీకాలనీ, నాచారం, చిలుకానగర్, ఉప్పల్, రామంతాపూర్, హబ్సీగూడ డివిజన్ అభ్యర్థుల తరపున కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆయా చోట్ల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పనిచేసి చూపిస్తాం.. ఓటేయండని ఐదేండ్ల కింద వచ్చి అభ్యర్థించినం.. చేసిన పనులను చెబుతున్నం.. చేయబోయే పనులను కూడా చెబుతూ ఈసారి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. మరీ బీజేపీ వాళ్లు ఏం చేసినరో.. ఏం చేస్తరో చెప్పమంటే మాత్రం చెప్పకుండా వేరే ముచ్చట్లు చెబుతున్నారని మండిపడ్డారు.
హిందువులను, ముస్లింలను రెచ్చగొడుతూ పంచాయతీ పెట్టడమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. ఆనాడు మంచినీటికి ఎంత గోస పడ్డామో యాది చేసుకోవాలన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో మంచినీళ్ల సమస్య తీర్చేందుకు వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, కరెంట్ సమస్య తొలగించుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను ఆరేండ్లలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. హైదరాబాద్ పచ్చగుండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా.. కంపెనీలు రావాలన్నా.. మన పిల్లలకు కొలువులు రావాలన్నా.. బతుకులు బాగుపడాలన్నా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడే వచ్చిపోయే పొలిటికల్ టూరిస్టు(బీజేపీ నాయకులు)ల వల్ల కాదని కేటీఆర్ చెప్పారు. ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, మేయర్ బొంతు రాంమోహన్, ఆయా డివిజన్ల బాధ్యులు పాల్గొన్నారు.