Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆరేండ్లలో 67 వేల కోట్లు

-హైదరాబాద్‌ కోసం ఖర్చుచేశాం
-మున్సిపాలిటీలకు ప్రతినెలా రూ.148 కోట్లు
-ఆర్నెళ్లలో పురపాలికల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు
-మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు
-రెండు నెలల్లో రూపాయికే నల్లా కనెక్షన్
‌ -విశ్వనగరానికి కేంద్రం అన్యాయం
-ఏ విషయంలోనూ సహకరించని కేంద్రం
-శాసనసభలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్

ఆర్థిక చోదకశక్తి అయిన రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రత్యేక ఆలోచన, ఎజెండాతో ముందుకు పోతున్నామని, మహానగర అభివృద్ధికి గత ఆరేండ్లలో రూ.67,149.23 కోట్లు ఖర్చు చేశామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. ఓ వైపు పరిశ్రమలను ఆకర్షిస్తూ, ఉపాధి కల్పిస్తూ, విద్యారంగంలో అవకాశాలు కల్పిస్తూ దేశానికి ఆదర్శంగా సాగుతున్నామన్నారు. రహదారులను అభివృద్ధికి స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం (ఎస్సార్డీపీ) పేరిట ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రతిపక్షాలు అడిగాయని, కానీ.. ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైనే ఖర్చుచేశామని గణాంకాలతో సహా వివరించారు. బుధవారం అసెంబ్లీలో పద్దులపై చర్చకు ఆయన జవాబిచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మున్సిపాలిటీలకు ప్రతినెలా రూ.148 కోట్లు
మున్సిపాలిటీలకు ప్రతినెలా ఠంచన్‌గా రూ.148 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. కరోనాతో ఇబ్బందులున్నా అన్ని పురపాలికలకు రూ.1,766 కోట్లు విడుదలచేశాం. ఆర్నెళ్లలో ప్రతి మున్సిపాలిటీలో ఒక ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మించబోతున్నాం. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాం. గతంలో చెత్త ఎత్తే వాహనాలు 2,613 ఉంటే వాటిని 4,975కు పెంచాం. ఇప్పుడు రాష్ట్రంలో డంపింగ్‌యార్డు లేని మున్సిపాలిటీయే లేదు. మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లను అన్ని మున్సిపాలిటీల్లో ఏర్పాటుచేస్తు న్నాం. ఇప్పటికే 71 మున్సిపాలిటీల్లో రూ.251 కోట్లతో నిర్మాణం ప్రారంభమైంది. 11చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చి.. గాంధీ జయంతి (అక్టోబర్‌ 2) నాటికి 14,020 ప్రజా మరుగుదొడ్ల నిర్మించాం. ఈ ఏడాది కూడా 783.75 కోట్లు కేటాయించాం.

రెండు నెలల్లో రూపాయికే నల్లా కనెక్షన్
‌ మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పనులు తుదిదశకు చేరుకొన్నాయి. రాబోయే 2నెలల్లో రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తూ.. ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వబోతున్నాం. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేశాం. దీనిద్వారా మురుగునీటి కాల్వలు, డ్రైనేజీలు, ప్రధాన రహదారులు, పార్కులన్నింటినీ బాగుచేస్తున్నాం. పురపాలకచట్టం ప్రకారం ప్రతి బడ్జెట్‌లో 10% గ్రీన్‌ బడ్జెట్‌ పెట్టుకొన్నాం. దీనివల్ల రాష్ట్రంలో 142 మున్సిపాలిటీల్లో 1,618 నర్సరీలు ఏర్పాటు చేసుకొన్నాం. ఇతరులకూ మొక్కలు అందించేస్థాయికి చేరుకొన్నాం. అన్ని మున్సిపాలిటీల్లో 5.90 లక్షల ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం వల్ల ఏటా రూ.81 కోట్ల విద్యుత్‌ చార్జీలు ఆదా చేస్తున్నాం. ప్రతినెల కార్మికులకు మొదటివారంలోనే రూ.12వేల వేతనం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాజధాని ఎంత విస్తరించినా నీటికొరత రావొద్దని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ కోసం రూ.2,381.52 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాం. 104 ఏండ్ల తర్వాత ఇటీవల అంతభారీ స్థాయిలో హైదరాబాద్‌కు వరదలొచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్ట్రాటజిక్‌ నాలా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం అమలుచేస్తున్నాం. దీనికి రూ.830 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాం.

కానీ ఇది ఏ పథకంలోనూ ఫిట్‌కావడంలేదంటూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. వరద వచ్చినా పైసా సాయం చేయరు.. భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవాలు రాకుండా చర్యలు తీసునేందుకు సహకరించాలంటే దానికీ మనసు రావడంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 34% హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. 70 దేశాల రాయబారులు వచ్చి బయోలాజికల్‌ ఈవెంట్స్‌, భారత్‌ బయోటెక్‌, ఇతర సంస్థలను పరిశీలించి, తమ దేశానికి సహకరించాలని కోరారు. ఇలాంటి అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన నగరానికి సాయం చేయకపోవడం మంచిది కాదు. ఇప్పటికైనా కేంద్రం హైదరాబాద్‌ అభివృద్ధికి సాయంచేయాలి. మెట్రో రెండోదశ కోసం డీపీఆర్‌ కూడా అందజేశాం. నిధులు ఇవ్వాలని రెండు మూడేండ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. మెట్రోరైల్‌ కూడా ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికే పరుగులు పెడుతుంది తప్పా.. మనవద్దకు రావడంలేదు. చెన్నైలో 192 కిలోమీటర్లకు రూ.63 వేల కోట్లు పెట్టారు. హైదరాబాద్‌కు అరపైసా కూడా ఇవ్వలేదు. దేశాభివృద్ధిలో 5% జీడీపీని కాంట్రిబ్యూట్‌ చేస్తున్న తెలంగాణకు కేంద్రం ఎందుకు తోడ్పడటంలేదు?

మనసున్న ప్రభుత్వం మాది
కరోనా సంక్షోభంలోనూ మా ప్రభుత్వం సంక్షేమాన్ని ఆపలేదు. ఏ పథకమూ ఆగలేదు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా మినిమమ్‌ ఇన్‌స్పెక్షన్‌.. మాక్సిమమ్‌ ఫెసిలిటేషన్‌ నినాదంతో పరిశ్రమలు పెట్టేవారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా అనుమతి ఇస్తున్నాం. సౌకర్యాలు కల్పిస్తున్నాం. పారిశ్రామికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్రంనుంచి సరైన సహకారం అందడం లేదు. హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటుచేస్తున్నామని, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరినా కేంద్రం స్పందించలేదు. వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు, హైదరాబాద్‌లో ఫార్మాసిటీకి చేయూత ఇవ్వాలని కోరినా సమాధానం ఇవ్వలేదు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని 2014 విభజన చట్టంలోనే పేర్కొని ఏడేండ్లయినా, ఎన్నిసార్లు అడిగినా ఉలుకు, పలుకు లేదు. ప్రపంచంలోనే మూడోవంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లో తయారవుతుంటే.. వాటిని పరీక్షించే సెంటర్‌ను 1200 కిలోమీటర్ల దూరంలోని హిమాచల్‌ప్రదేశ్‌ కసౌలిలో ఏర్పాటుచేశారు.

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ పెడతామని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే దేవాదాయశాఖకు రూ.350 కోట్లు కట్టి 150 ఎకరాలు కేటాయించాం. తీరా ఇప్పుడు కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టేది లేదంటున్నారు. మహారాష్ట్రలో 2018లో ప్రతిపాదన రాగానే మంజూరుచేసి పనులు మొదలుపెట్టారు. తెలంగాణపై ఎందుకీ వివక్ష? హైదరాబాద్‌లో డీఆర్డీవో, ఆర్సీఎల్‌ వంటి అనేక రక్షణరంగ సంస్థలున్నాయి. వాటికి అనుబంధంగా వెయ్యికిపైగా ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌- బెంగళూరు మార్గంలో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ పెట్టాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోకుండా ఒక్క రక్షణ సంస్థ లేని బుందేల్‌ఖండ్‌లో పెట్టారు. దీనిపై కేంద్రం పునరాలోచించాలి. నిజామాబాద్‌లో పసుపుబోర్డు పెట్టాలని కోరితే తిరస్కరించి.. తమిళనాడు ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. ఇదేం లాజిక్‌? నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని రైతులే ముందుకొచ్చి నడుపుకొంటే రూ.250 కోట్ల వరకు ఖర్చయినా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధం. రైతులు రావడం లేదు. మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణపై చిత్తశుద్ధితో ఉన్నాం. ఇందుకు సిర్పూర్‌ పేపర్‌ మిల్లే ఉదాహరణ. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఇండస్ట్రియల్‌ హెల్త్‌క్లినిక్‌ ఏర్పాటుచేసి 271 ఎంఎస్‌ఎంఈలను పునరుద్ధరించాం. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. దేశంలోనే అత్యధిక అక్రెడిటేషన్‌ కార్డులు తెలంగాణలోనే ఉన్నాయి. వారి సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేశాం. కరోనా వేళ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఇంటి స్థలాల విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాను.

వరంగల్‌కు రూ.250 కోట్లు
హైదరాబాద్‌ తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.250 కోట్ల ప్రత్యేక నిధులను బడ్జెట్‌లో కేటాయించాం. వరంగల్‌లో ప్రజా రవాణాకోసం మెట్రో నియో అనే కార్యక్రమం కింద రూ.150 కోట్లు ప్రతిపాదించాం. ఇతర పట్టణాల్లోనూ ఎయిర్‌ ట్రావెల్స్‌ కోసం రూ.77.41 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.150.94 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాం. భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం లేకుండా స్వీయ ధృవీకరణతో అనుమతి పొందేలా టీఎస్‌బీపాస్‌ చట్టాన్ని తీసుకొచ్చాం. 21 రోజుల్లో అనుమతి రానిపక్షంలో 22వ రోజు ఆటోమెటిక్‌గా అనుమతి వచ్చినట్లుగా భావించే ఈ కొత్త చట్టం.. దేశానికే ఆదర్శం. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో ప్రజలకు అందిస్తాం. రూ.9714 కోట్లతో స్లమ్‌ రీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానలను 300కు పెంచబోతున్నాం. కోకాపేటలో 268 కోట్లతో లేఅవుట్‌ అభివృద్ధి చేస్తున్నాం. దీనిద్వారా రూ.2500 కోట్ల ఆదాయం వస్తుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.