-ఏడాదిలోగా అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు.. పాలమూరు పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి కేటీఆర్ వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక వనరులకు అనుగుణంగా మౌలికవసతులు కల్పించి పారిశ్రామిక వాడలు, పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది. వచ్చే ఏడాదిలోగా దేశంలో అత్యంత ఆకర్షణీయమైన అతిపెద్ద ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ హైదరాబాద్‌లో స్థాపించబోతున్నాం. 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 వందల స్టార్టప్ కంపెనీలకు వీలుగా తగిన సౌకర్యాలతో అధునాతన సాంకేతిక సౌకర్యాలు కల్పిస్తాం.
హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దే విప్లవాత్మక కార్యక్రమాన్ని చేపట్టాం. గ్రామపంచాయతీలకు సాంకేతిక ఫలాలు అందేలా, ప్రభుత్వ పథకాలు మెరుగ్గా గ్రామీణులకు చేరేలా ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం.
ఐటీ పరిశ్రమను కేవలం హైదరాబాద్‌కు పరిమితం చేయకుండా వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌కు విస్తరించనున్నాం అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో పరేడ్‌గ్రౌండ్స్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండావందనం చేశారు. అధికారులను, ప్రజలను ఉద్దేశించి ఉద్విగ్నంగా మాట్లాడారు. ఇది చారిత్రక సన్నివేశం. ఎందరో అమరవీరుల త్యాగఫలమైన స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను అందరూ కలిసి పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో జరుపుకోవడం సంతోషకరం.
సీఎం కేసీఆర్ బాటలో నడిచి బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు. వేడుకల్లో జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్,లక్ష్మా రెడ్డి , ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ ప్రియదర్శిని, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, ఎస్పీ నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.