-అందరి పేర్లు నమోదయ్యేవరకు నామినీ దరఖాస్తులు స్వీకరించాలి
-మొదటివిడుత ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధం
-సత్వరమే బుక్కుల్లో తప్పుల సవరణ
-సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశం
-2.13 లక్షల పాడిరైతులకు సబ్సిడీ బర్రెలు
రాష్ట్రంలోని 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయసున్న రైతులందరికీ రైతుబంధు జీవితబీమా పథకాన్ని వర్తింపజేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రైతులందరి పేర్లు నమోదయ్యే వరకు నామినీ దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం కొనసాగించాలని సూచించారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ, పేరు మార్పిడి తదితర కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని చెప్పారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో రైతుబీమా పథకం, భూ రికార్డుల కార్యక్రమంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు బీమా పథకం కోసం రైతులందరి పేర్లు నమోదు చేయాలి. రైతులకు ఎన్నిచోట్ల భూమి ఉన్నా, ఎన్ని ఖాతాలున్నా ఒక రైతుకు ఒక పాలసీ మాత్రమే వర్తిస్తుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సున్న ప్రతి రైతు పేరు నమోదు చేయాలి. నామినీ దరఖాస్తు ఫారాలు తొందరగా ఇచ్చేలా రైతులకు అవగాహన కలిగించాలి. ఇప్పటివరకు సేకరించిన వివరాలను వెంటనే ప్రభుత్వానికి అందజేస్తే, మొదటి విడత బీమా ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పారు.
త్వరితగతిన తప్పుల సవరణ భూ రికార్డుల ప్రక్షాళన తరువాత రైతులకు కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇచ్చాం. రైతుబంధు చెక్కులు ఇచ్చాం. కొందరు రైతులకు పాస్‌పుస్తకాలు ఇంకా అందలేదు. కొన్ని పాస్‌పుస్తకాల్లో తప్పులు సవరించాల్సిఉంది. పేరు మార్పిడులు కూడా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని గతంలోనే ఆదేశాలు జారీచేశాం. కానీ అనుకున్నంత వేగంగా పని జరుగడం లేదు. వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ముందు రికార్డులన్నింటినీ మాన్యువల్‌గా సరిచేసుకోవాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్కే జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శులు ఎస్ నర్సింగ్‌రావు, శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో కార్యదర్శిస్మితాసబర్వాల్, అదనపు కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, ఎంపీ వినోద్‌కుమార్, ప్రభుత్వ విప్ పల్లారాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ బర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించండి పాడి పరిశ్రమ సంఘాల సభ్యులకు సబ్సిడీపై బర్రెలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ సొసైటీలకు చెందిన 2.13లక్షల మంది పాడిరైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. ఒక్కో యూనిట్‌కు రూ.80 వేలు కేటాయించాలని, రూ.5 వేల వరకు అదనంగా రవాణా ఖర్చులకోసం ఇవ్వాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 75%, ఇతరులకు 50% సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా పశువులను కొనుక్కునే అవకాశం రైతులకు కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు.