ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న పింఛన్లు, ఆహారభద్రత పథకాలు అర్హులందరికీ అందుతాయని, ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆహారభద్రతాకార్డులు, పెన్షన్ల వల్ల ప్రభుత్వంపై రూ. 6వేల కోట్ల భారం పెరిగిందన్నారు.
– ఈ పథకాలతో సర్కారుపై రూ.6 వేల కోట్ల భారం – అర్హులకు అందకపోతే తిరిగి దరఖాస్తుల పరిశీలన – అన్ని గ్రామాల్లో కల్లాలు, గిడ్డంగుల నిర్మాణం – రాష్ట్రంలోనే గజ్వేల్‌లో తొలి మిల్క్ గ్రిడ్: మంత్రి హరీశ్‌రావు

గురువారం మెదక్ జిల్లా గజ్వేల్ మార్కెట్‌యార్డులో సద్దిమూటను మంత్రి ప్రారంభించారు. రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో భోజనామృతం పథకాన్ని ప్రారంభించి రోగులకు వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలలో పెన్షన్లు, డిసెంబర్‌లో ఆహార భద్రతాకార్డులు పంపిణీ చేస్తామన్నారు. అర్హులకు అందకపోతే దరఖాస్తులను తిరిగి పరిశీలించి వర్తింపజేస్తామన్నారు. రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.
దళారుల చేతిలో రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 36 వేల క్వింటాళ్ల మొక్కొజొన్నలు, రూ.56 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో కల్లాలు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని, ఎకరం భూమి సమకూర్చితే గ్రామాలకు నిధులను మంజూరు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కూడా భూమి అందుబాటు లో ఉంటే అక్కడే నిర్మిస్తామన్నారు.
ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతుల కోసం సద్దిమూట కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇప్పటివరకు బోయినపల్లి, సిద్దిపేట, గజ్వేల్ మార్కెట్‌యార్డుల్లో ప్రారంభించామన్నారు. ఈ పథకానికి సుభోజనం అని పేరు పెడితే, సీఎం కేసీఆర్ తెలంగాణ భాషలో పెద్దలు వాడే సద్దిమూటగా నామకరణం చేశారన్నారు. చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నదని, వర్షపు నీటిని నిల్వ చేసుకుని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలన్నదే లక్ష్యమన్నారు. రాష్ట్రంలోనే ప్రథమంగా గజ్వేల్‌లో మిల్క్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు రూ.30 కోట్ల రాయితీని రైతులకు వర్తింపజేస్తూ స్థానిక రైతులకు వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమను అనుసంధానం చేయాలన్నదే సీఎం లక్ష్యమన్నారు.
అంతకుముందు నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో సుమారు రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ ఓఎస్డీ హన్మంతరావు, ఆర్డీవో ముత్యంరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, నగర పంచాయతీ చైర్మన్ భాస్కర్, ఆర్జేడీ రాజశేఖర్, మార్కెటింగ్ ఓఎస్డీ జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు భూంరెడ్డి, యాదవరెడ్డి, మాదాసు శ్రీనివాస్, సద్దిమూట నిర్వాహకులు రవి పిరెడ్డి, శ్రీసత్యగౌడ చంద్రదాస్ పాల్గొన్నారు.