Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అర్హులందరికీ రేషన్‌కార్డులు

పాన్‌కార్డుతో లింకులేదు.. పేదరికమే గీటురాయి.. కార్డుల ఏరివేత చేపట్టలేదు.. ప్రజలే స్వచ్ఛందంగా సరెండర్ చేస్తున్నారు కొత్త లెవీ విధానం రాష్ట్రాలకు ఇబ్బందికరమే.. నమస్తే ఇంటర్వ్యూలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్

Eetela rajendar

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ తెల్లరేషన్ కార్డు ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అర్హులై మరికొందరు పేదవారికి కార్డులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభు త్వం వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి… అర్హత ఉండి, కార్డులేని వారికి కచ్చితంగా కొత్త కార్డులు పంపిణీ చేస్తాం అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రేషన్‌కార్డుకు పాన్‌కార్డుకు ఎలాంటి లింకులేదన్నారు.

రేషన్‌కార్డుల జారీపై ఇంకా మార్గదర్శకాలు ఖరారు కాలేదని పేర్కొన్నారు. బోగస్ కార్డుల ఏరివేతపై ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని చెప్పిన ఈటెల… సర్కారు కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టలేదని కుండబద్దలు కొట్టారు. కేవలం పౌరసరఫరాలశాఖ ఇచ్చిన ప్రకటనకు స్పందించిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వద్ద ఉన్న అదనపు కార్డులను అప్పగిస్తున్నారని చెప్పారు. ఇలా ఏకంగా పది లక్షల కార్డులు వెనక్కి ఇచ్చారని చెప్పారు. పేదల సంక్షేమమే పరమావధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఈటెల రాజేందర్ నమస్తే తెలంగాణతో పలు అంశాలు పంచుకున్నారు.

టీ మీడియా: రాష్ట్రంలో బోగస్ రేషన్‌కార్డుల ఏరివేత ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఈటెల: వాస్తవంగా బోగస్ కార్డుల ఏరివేత వంటి కార్యక్రమమేదీ ప్రభుత్వం చేపట్టలేదు. గత ప్రభుత్వాల హయాంలో కుటుంబాలకు మించి రేషన్‌కార్డులు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో కచ్చితంగా అనర్హులు, ఒకే కుటుంబానికి రెండు కార్డులు ఉన్నాయనే అంశాలు మా దృష్టికి వచ్చాయి. బోగస్ కార్డులుంటే వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రెండుచోట్ల కార్డులు ఉన్నవారు, అసలు కుటుంబాలు లేకున్నా కార్డులు జారీ అయిన వాటిని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి అప్పగించారు. ఇలా దాదాపు పది లక్షల కార్డులను స్వాధీనం చేశారు. అంతేకానీ ప్రభుత్వం పనిగట్టుకొని ఎవరి కార్డు తీసేయలేదు.

బోగస్‌గానీ, అదనపు కార్డులు ఎవరివద్ద ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది? అర్హతలేని వాళ్ల వద్దనే ఈ కార్డులు ఎక్కువ ఉన్నాయి. చాలామంది పట్నం వచ్చినోళ్లు అటు ఊరి కార్డు ఉంచుకుంటూనే.. పట్నంలోనూ మళ్లీ కార్డు తీసుకున్నరు. కొన్నిచోట్ల డూప్లికేట్ కార్డులు కూడా జారీ చేసిండ్రు.. అసలు మనుషులు, కుటుంబాలు లేకుండా కూడా కొన్ని కార్డులు ఉన్నాయి.

రేషన్‌కార్డులకు ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందా..? ఇంకా పూర్తి కాలేదు. ఆధార్‌తో అనుసంధానం తొంభై శాతం పూర్తయింది. ఆధార్‌కు ప్యారలల్‌గా మేం చేసిన సమగ్ర సర్వే ఇంకా శాస్త్రీయంగా (సైంటిఫిక్‌గా) ఉంది. కాబట్టి ఆధార్, తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేతోపాటు ఇప్పుడున్న రేషన్‌కార్డులన్నింటినీ క్రోడీకరించుకొని కార్డులులేని వారికి కొత్తవి ఇచ్చే ప్రక్రియ మొదలుపెడ్తాం.

తెల్ల రేషన్‌కార్డులకు దేనిని ప్రామాణికంగా తీసుకుంటరు? పేదరికమే మాకు గీటురాయి. పాన్‌కార్డు ఉందా..? లేదా..? అన్నది కాదు. నిజమైన పేదలకైతే తప్పకుండా కార్డు ఇవ్వాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్‌కార్డులు అవసరం లేదు కదా. ఇంతకుముందు తెల్లరేషన్‌కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేలా నిబంధనలున్నాయి. దీనిపై త్వలోనే ప్రభుత్వ విధానం (పాలసీ)ను నిర్ణయిస్తం. మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు.

రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ బియ్యం సరఫరా ఎంత ఉంది? తెలంగాణ రాష్ట్రంలో నెలకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నం. దీనిమీద ప్రభుత్వం నెలకు దాదాపు రూ.1500 కోట్ల సబ్సిడీని ఇస్తున్నది. సంవత్సరానికి 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మేం సరఫరా చేస్తున్నం. దీనికి తోడు చక్కెర, గోధుమలు, కిరోసిన్, గోధుమపిండి, కందిపప్పు, పసుపు, కారం, చింతపండు ఇలా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను నిరుపేదలకు ఇస్తున్నాం. బోగస్, అదనపు కార్డులు తొలగిస్తే.. నెలకు ఎంత రేషన్ ఆదా అవుతుందని అంచనా వేశారు? ఇప్పుడే ఆ లెక్కలు ఇప్పుడే చెప్పలేం. అధికారులు నివేదికలు రూపొందిస్తున్నారు.

ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు ఎప్పుడిస్తుంది? గత ప్రభుత్వాల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. గతంలోనే 92 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చినట్లుగా లెక్కలున్నాయి. మొన్న తెలంగాణ సర్కారు చేపట్టిన సర్వేతో ఇవన్నీ తప్పని తేలిపోయింది. మా లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలు ఉన్నట్లు తేలింది. మొన్నటి సర్వే తర్వాత ప్రభుత్వం దగ్గరకు కచ్చితమైన లెక్కలు వచ్చినయి. సర్వే రిపోర్టును ఆధారం చేసుకుని నిరుపేదలకు కార్డులు మంజూరు చేస్తాం.కొత్త రేషన్‌కార్డులు దసరా-దీపావళి మధ్య ఇవ్వడం సాధ్యపడదు.

కేంద్రం కొత్తగా తెచ్చిన లెవీ విధాన ప్రభావం ఉంటుందా? కేంద్ర లెవీ విధానం ప్రకారం ఇంతకుముందు 75-25 శాతం లెక్క ఉండేది. మిల్లర్లు 75 శాతం ఎఫ్‌సీఐకి ఇస్తే.. 25 శాతం ఓపెన్ మార్కెట్లో అమ్ముకునేవాళ్లు. మొన్న కేంద్ర ప్రభుత్వం లెవీని 25 శాతానికి పరిమితం చేసి… 75 శాతాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చని మార్పు చేసింది. ఈ విధానం రాష్ట్రాలకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ పద్ధతి వద్దని.. లేవీని 75 శాతంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసింది.

కేంద్రం నుంచి స్పందన ఏమైన వచ్చిందా? ఇంకా సమాధానం రాలేదు. ఈనెల 10న ఢిల్లీకి వెళ్ల్లినప్పుడు కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తో మాట్లాడుతాం.

ఈ ఏడాది సీజన్ మొదట్లో వర్భాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా..? లెవీకి ఇబ్బంది కలుగొచ్చు కదా! కచ్చితంగా… పంట తగ్గడానికి ఆస్కారం ఉంది. మొన్నటిదాకా కనీవినీ ఎరుగని భయంకరమైన కరువు ఉంది. ఇప్పుడిప్పుడే కొంత వర్షాలు పడుతున్నా.. సీజన్ దాటిపోయింది. కాబట్టి ఈ వర్షాలు వచ్చే పంటకు ఏమైనా పనికొస్తాయేమోగానీ మొదటి పంట ఈల్డింగ్ తగ్గిపోయినమాట వాస్తవం. కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.

ఈ పరిణామాలతో బియ్యం కొరత ఏర్పడే అవకాశముందా? ఇప్పటికిప్పుడు బియ్యం కొరతకు ఆస్కారం లేదు. నిల్వలు పుష్కలంగా ఉండటంతో ధరలు పెరిగే అవకాశం కూడా లేదు. వచ్చే సంవత్సరానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా బియ్యం ఇవచ్చు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.