Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆరోగ్య తెలంగాణ

-ప్రజారోగ్య వ్యవస్థ మరింత పటిష్ఠం
-జిల్లా యూనిట్‌గా వైద్య సేవల విస్తరణ
-అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు
-రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ కేంద్రాలు
-అన్ని హాస్పిటళ్లలో బ్లడ్‌బ్యాంకుల ఆధునికీకరణ
-రోగుల సహాయకులకు వసతి కేంద్రాల ఏర్పాటు
-వరంగల్‌లో ఎయిమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీ
-మరిన్ని డయాలసిస్‌ సెంటర్లు, ఆధునిక యంత్రాలు
-వైద్యశాలలు.. కాలేజీల్లో సాంకేతిక విద్య కోర్సులు
-ప్రభుత్వ దవాఖానల నిర్వహణకు ప్రత్యేక నిపుణులు
-ప్రత్యేక భవనాల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు
-సూర్యాపేటలోని కేంద్రం 200 పడకలకు పెంపు
-సత్తుపల్లి, మధిరలో 100 పడకల దవాఖానలు
-తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం
-ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో తొలిదఫా ఆరోగ్య సర్వే
-అలర్జీ పరీక్షలు, వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌, వరంగల్‌, సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బాగుకోసం గత ఏడేండ్లుగా చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో ఇక ఈ రంగాన్ని నూటికి నూరు శాతం ప్రజల సేవకు సిద్ధం చేయాలని నిశ్చయించింది. ఇప్పటిదాకా సాగునీటి రంగాన్ని తీర్చిదిద్ది గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే ఇప్పుడు వైద్య రంగాన్ని సమూలంగా సంస్కరించాలని క్యాబినెట్‌ సమావేశం తీర్మానించింది.

బడ్జెట్‌కు అదనంగా 10 వేల కోట్లు
రానున్న రెండేండ్లలో వైద్య వ్యవస్థ బాగుకోసం మరో 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. బడ్జెట్‌లో ఇచ్చిన నిధులకు ఇది అదనం. కరోనా తరహా మహమ్మారులు పీడిస్తున్న తరుణంలో మున్ముందు ఇలాంటి ఆరోగ్య విపత్తులు ఎన్ని ఎదురైనా తట్టుకొని నిలిచేలా, పేదలకు, ప్రజలకు చౌకగా, అత్యంత నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయి చికిత్సలు అందించేలా ప్రభుత్వ వైద్య వ్యవస్థను ఆధునికీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ దవాఖానల పరిపాలన మొదలుకొని, పారామెడికల్‌ సేవల దాకా విప్లవాత్మక మార్పులు తేనున్నారు. రాజధాని హైదరాబాద్‌కు రానవసరం లేకుండానే ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లాలోనే పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు పొందేలాగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు, ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయబోతున్నది. ఈ మేరకు నివేదిక తయారు చేసేందుకు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సబ్‌ కమిటీని మంత్రిమండలి ఏర్పాటు చేసింది.

క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందుకోసం అనేక చర్యలకు సమాయత్తమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా మారిన వైద్యసేవలను జిల్లా కేంద్రాలే యూనిట్‌గా విస్తరించేందుకు సిద్ధమయింది. జిల్లా స్థాయిలోనే వైద్యసేవలు అందించడంతోపాటు, వైద్య పరీక్షా కేంద్రాలనూ ఏర్పాటుచేయనున్నది. అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ కేంద్రాలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు క్యాబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో 9 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.

ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలను మెరుగుపర్చడం, పేదలకు మరింత చేరువగా వైద్యం అందించడంపై సుదీర్ఘంగా చర్చించింది. వైద్యారోగ్యరంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిశలు కృషిచేయాలని మంత్రిమండలి ఆదేశించింది. రాష్ట్రంలో అన్నిస్థాయిల్లోని దవాఖానల్లో రోగుల సహాయార్థం వచ్చేవారికోసం వసతికేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.

బుధవారం 19 జిల్లాల్లో ప్రారంభించనున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఇతర అన్ని జిల్లాలకు విస్తరించాలని.. ఈ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్‌ ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌, టుడీ ఈకోతోపాటు మహిళల క్యాన్సర్‌ స్రీనింగ్‌ కోసం ‘మామోగ్రామ్‌’ యంత్రాలను ఏర్పాటుచేయాలని వైద్యశాఖను ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటుచేసిన డయాలసిస్‌ కేంద్రాల్లో యంత్రాల సంఖ్యను పెంచడంతోపాటు, మరిన్ని కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. కరోనా మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, ఔషధాలను సమకూర్చుకోవాలని ఆదేశించింది.

ఆరోగ్య తెలంగాణ
హైదరాబాద్‌, వరంగల్‌, సిద్దిపేటలో చర్మచికిత్స కేంద్రాలు
చర్మ సంబంధ జబ్బుల పరీక్షలు, చికిత్సకోసం హైదరాబాద్‌, వరంగల్‌, సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సూచించింది. సత్తుపల్లి, మధిరలో 100 పడకలతో నూతన దవాఖానలను నిర్మించాలని, ప్రస్తుతం ఉన్న దవాఖానలను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని పేర్కొన్నది. సూర్యాపేటలో ప్రస్తుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని నిర్ణయించింది.

జిల్లాకో క్యాన్సర్‌ కేంద్రం
క్యాన్సర్‌ రోగులకు కీమోథెరపీ, రేడియో థెరపీ కోసం అవసరమైన మౌలిక వసతులతో జిల్లా కేంద్రాల్లోనే క్యాన్సర్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. దవాఖానల్లో ఇప్పటికే ఉన్న బ్లడ్‌ బ్యాంకులను ఆధునికీకరించడంతోపాటు మరిన్ని కొత్త బ్లడ్‌ బ్యాంకులను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఆర్థోపెడిక్‌, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు మౌలిక వసతులను కల్పించి, అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని వైద్యశాఖకు సూచించింది. వరంగల్‌లో ఖాళీచేస్తున్న జైలు స్థలంలో ఎయిమ్స్‌ తరహాలో అన్నిహంగులతో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అన్ని దవాఖానల నిర్వహణకు హాస్పిటల్‌ అడ్మిస్ట్రేషన్‌ కోర్సు అభ్యసించిన వారిని నియమించుకోవాలని సూచించింది. ప్రభుత్వ దవాఖానలు, వైద్యశాలల్లో నర్సింగ్‌, మిడ్‌వైఫరీ కోర్సులను, లాబ్‌ టెక్నిషియన్‌, రేడియాలజీ టెక్నిషియన్‌, డయాలసిస్‌ టెక్నిషియన్‌ తదితర ప్రత్యేక నైపుణ్యం ఉన్న కోర్సులను అందుబాటులోకి తేవాలని వైద్యశాఖను ఆదేశించింది.

మరింత పటిష్ఠంగా మాతాశిశు సంరక్షణ
రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ కేంద్రాలను మరింతగా పటిష్ఠపర్చాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. తల్లీబిడ్డలను ఇతర రోగులతో కాకుండా.. ప్రత్యేకంగా వైద్యసేవలందించాలని సూచించింది. ఇందుకోసం మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ప్రత్యేక భవనంలో ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా భవనాలను నిర్మించి వసతులు కల్పించాలని నిర్ణయించింది. ఈ భవనంలోనే హైరిస్‌ ప్రసవాలకు అవసరమైన వైద్యసేవల కోసం ప్రత్యేక ‘మెటర్నల్‌ ఐసీయూ’లను, నవజాత శిశువుల కోసం ఎస్‌ఎన్‌సీయూలను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. గర్భిణులకు మూడో నెలనుంచి సమతుల పౌష్టికాహార కిట్లను అందించాలని సూచించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.