Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

-పేదలకు అందుబాటులో సర్కారు వైద్యం -ఏజెన్సీల్లో సీజనల్ వ్యాధులపై గిరిజన భాషల్లో ప్రచార కార్యక్రమం -గణనీయంగా తగ్గిన మాతాశిశు మరణాలు -నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి లక్ష్మారెడ్డి

ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ కృషి చేస్తున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ, అన్ని వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మూడేండ్ల పాలన పూర్తయిన సందర్భంగా లకా్ష్మరెడ్డి నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఇలా..

వైద్యరంగంలో సాధించిన మార్పులేమిటి? కార్పొరేట్‌కు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దుతున్నాం. గతంలో అత్యవసర వైద్యానికి చాలా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు. ఇప్పుడు జిల్లాకేంద్రాల్లోని వైద్యశాలల్లో ఐసీయూలు ఏర్పాటు చేశాం. ఏరియా దవాఖానల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నాం. అన్నిచోట్ల ల్యాబ్‌లను ఏర్పాటుచేస్తున్నాం. డయాలసిస్ సెంటర్లు, ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం. ప్రభుత్వ వైద్యశాలల్లో రోజుకో రంగు బెడ్‌షీట్ల విధానం అమల్లోకి తెచ్చాం. శుభ్రత కోసం కొత్త పాలసీని అమలుచేస్తున్నాం.

పేదలకు సరైన వైద్యం అందుతుందా? సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం కలిగించే స్థాయికి చేరుకోగలిగాం. దవాఖానల్లో రోగులసంఖ్య 25 నుంచి 30 శాతానికి పెరిగింది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందే గుర్తించగలిగితే.. ప్రజల ప్రాణాలను కాపాడగలమన్న ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాం. ఆయా శిబిరాల్లో వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. అవయవ దానాన్ని ప్రోత్సహిస్తూనే.. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆర్థికసాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వాలు ఖర్చుచేయని విధంగా గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ ద్వారా అమలుచేస్తున్నాం.

సీజనల్ వ్యాధులపై ఏం చేస్తున్నారు.? రాష్ట్రంలో ప్రాంతాల వారీగా విస్తరించే వ్యాధులు, సీజనల్‌గా వచ్చే వ్యాధులకు సంబంధించి జిల్లాల వారీగా ప్రొఫైల్‌ను రూపొందించాం. ప్రజలకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశాం. వ్యాధులు విస్తరించకుండా సేవలు అందిస్తున్నాం. అన్ని వైద్యశాలల్లో మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాం. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. మలేరియా నివారణకు దోమతెరలు పంపిణీ చేస్తున్నాం. సీజనల్ వ్యాధులపై గిరిజన భాషల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

మాతాశిశు సంరక్షణలో ఎటువంటి మార్పులు ఆశిస్తున్నారు? పేద గర్భిణులు పౌష్ఠికాహారం తీసుకునేందుకు సర్కారు ఆర్థికసాయం అందిస్తూనే.. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ కిట్లను అందజేస్తున్నాం. తల్లీబిడ్డలకు నాలుగు విడతలలో రూ.12వేలు, ఆడబిడ్డ పుడితే రూ.వెయ్యి అదనంగా చేర్చి రూ.13వేల సాయంతోపాటు రూ.2వేల విలువైన కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నాం. ప్రసవ సమయంలో చనిపోతున్న కేసులను తగ్గించేందుకు హైదరాబాద్‌లోని పేట్ల బురుజు మెటర్నిటీ దవాఖానలో ఆబ్‌స్టెట్రిక్స్ ఇంటెన్సివ్ కేర్‌యూనిట్ (ఓఐసీయూ), మెటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎంఐసీయూ)లను నెలకొల్పాం. తెలంగాణ వచ్చాక మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ రేటు దేశ సగటు కంటే తక్కువగా ఉండటం విశేషం.

గ్రామీణ వైద్యశాలల బలోపేతానికి ఏం చేస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందించే పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లలో పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులోకి తెస్తున్నాం. 24గంటలు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటూ, అదనంగా వైద్యులను నియమిస్తున్నాం. 104 సేవలను విస్తృతం చేస్తున్నాం. వైద్య, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖలో 6వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. నియామక ప్రక్రియపై దృష్టి సారించాం. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ టెండర్ల ప్రక్రియలో మార్గదర్శకాలు మార్చి నాసిరకం మందులు, వైద్య పరికరాలు కొనకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.