Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆశవర్కర్ల పారితోషికం 6 వేలకు పెంపు

-ఈ నెల నుంచే అమలు -వచ్చే బడ్జెట్‌లో అంగన్‌వాడీలతో సమానంగా వేతనాలు -త్వరలో జాబ్ చార్ట్ రూపకల్పన -విద్యార్హతలున్నవారికి ఏఎన్‌ఎం పోస్టుల్లో ప్రాధాన్యం -ఇకపై గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పరిగణన -వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -జనహితలో ఆశ వర్కర్లతో సమావేశం

ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెరిగిన పారితోషికం మే నెల నుంచే అందుతుందని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్‌నుంచి ఆశ వర్కర్ల పారితోషికాలు అంగన్‌వాడీ వర్కర్ల స్థాయికి చేరుకుంటాయని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్హతలు కలిగి తగిన శిక్షణ పొందిన ఆశ వర్కర్లకు ఏఎన్‌ఎం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆశ వర్కర్లను మరింతగా భాగస్వాములను చేస్తామని చెప్పారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఆశ వర్కర్లనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు నెలకు కేవలం రూ.1000, రూ.1500 మాత్రమే లభించడం సరికాదని సీఎం అన్నారు. ఇకపై మీకు కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత నాది.. ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యత మాత్రం మీది అని సీఎం కేసీఆర్ ఆశ వర్కర్ల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆశ వర్కర్లను తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని అధికారులను ఆదేశించారు.

గోడు విన్నవించుకున్న ఆశ వర్కర్లు.. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశ వర్కర్లు ప్రగతిభవన్‌కు తరలి వచ్చారు. వారందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన సీఎం అనంతరం జనహితలో వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు తమ సాదక బాధకాలను సీఎంకు విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి అన్ని రకాల సేవల్లో తాము తలమునకలై పనిచేస్తున్నామని వారు తెలిపారు. ఆరోగ్య సంబంధమైన పనులతో కాకుండా, ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో కూడా భాగస్వాముల మవుతున్నామని, అయినప్పటికీ తమకు నెలకు వెయ్యి, పదిహేను వందల పారితోషికం మాత్రమే వస్తున్నదని సీఎంకు గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ ఆశ వర్కర్లనుద్దేశించి మాట్లాడారు.

రెండో దశలో మరింత పెంచుతా.. అంగన్‌వాడీ వర్కర్లకు రెండు దఫాలుగా జీతాలు పెంచి న్యాయం చేశాం. ఇప్పుడు ఆశ వర్కర్లకు కూడా సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరిగే విధంగా జీతాలు పెంచుతాం. మొదటి దశలో ప్రతి ఆశ వర్కర్‌కు నెలకు రూ. 6 వేలు అందేలా చేస్తాం. రెండవ దశలో మరోసారి జీతాలు పెంచి అంగన్‌వాడీ టీచర్ల స్థాయికి ఆశ వర్కర్లను తీసుకువస్తాం. వర్కర్లలో విద్యార్హతలుండి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏఎన్‌ఎం నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తాం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1200 ఏఎన్‌ఎం పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. ఇందులో కొంత మందికి ముందుగా అవకాశం కల్పిస్తాం. ఇతర కోర్సులు చేసిన వారుంటే వైద్య ఆరోగ్య శాఖలో దానికి సంబంధించిన ఉద్యోగాలు ఇస్తాం. మీరు బయోడేటాలను తయారు చేసి పెట్టండి, జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు కలెక్ట్ చేసి పెట్టండి అని సీఎం కేసీఆర్ అన్నారు.

జాబ్ చార్ట్ ఇస్తాం.. ఆశవర్కర్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గ్రామాల్లో ఆశ వర్కర్ల సేవలు వినియోగించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తాం. వారికి జాబ్‌చార్ట్ కూడా లేదు. ఏ పని పడితే ఆ పని చేయిస్తున్నారు. వాస్తవానికి రోజులో గంట రెండు గంటలు మాత్రమే పని చేయడానికి ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో రోజంతా వారితో పనిచేయిస్తున్నారు. వారికి కడుపు నిండా జీతం ఇవ్వడం లేదు. ఇతర పనులు కూడా చేయిస్తున్నారు. అలా చేసిన పనికి అదనపు పారితోషికం ఇవ్వడం లేదు. ముందుగా మీ ఇంట్లో మీకు గౌరవం పెరుగాలి. మీ ఇంట్లో గౌరవం పెరిగితే మీ ఊర్లో మీకు గౌరవం పెరుగుతుంది. ఇకపై మీరు గ్రామంలో ఆరోగ్య సంబంధ పనులే చేయాలి. ఇంకో పని చేయవద్దు. ఎలక్షన్లకు సంబంధించిన పని వస్తే ఒక్క రోజు ఉంటది. దానికి అదనంగా పైసలు ఇస్తరు. బాండెడ్ లేబర్‌గా ఆశ వర్కర్లను వాడొద్దు అని కేసీఆర్ చెప్పారు.

ఆరోగ్య పరిరక్షకులుగా మారాలి.. ఆరోగ్య విషయాలపై ప్రజలకు అవగాహన లేక అనేక రోగాల బారిన పడుతున్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా మిషన్ భగీరథ కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి ఇంటికి మంచినీళ్లు నల్లాల ద్వారా వస్తే సగం రోగాలు పోతాయి. అలాగే పేదరికం కారణంగా నిండు గర్భిణీలు కూడా కూలి పనులకు వెళుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ బాధలు పోవాలనే ప్రసవానికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తల్లీ బిడ్డల ఆరోగ్యపరిరక్షణ కోసం కేసీఆర్ కిట్స్ అందిస్తున్నాం. రాష్ట్రంలో ఆరున్నర లక్షల ప్రసవాల్లో కేవలం 2.25 లక్షల ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల నాలుగు లక్షల వరకు పెరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో ఆశ వర్కర్లు భాగస్వాములు కావాలి. క్షేత్ర స్థాయిలో మీరే ఆరోగ్య పరిరక్షకులుగా మారాలి. ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలి. తెలంగాణ ఆశవర్కర్ల పనితీరును ఇతర రాష్ర్టాల వాళ్లు వచ్చి చూడాలి అని సీఎం కేసీఆర్ చెప్పారు.

మొక్కలకు నీళ్లు కేసీఆరే పోయాలా? గ్రామాలు దరిద్రంగా ఉన్నాయి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొక్కలు నాటుతున్నది. అయితే ఊర్లలో మొక్కలు చూసే నాథుడు లేడు. వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, గ్రామ కార్యదర్శులు ఇలా..ఎంతమంది ఉండి కూడా ఏమి లాభం? కేసీఆర్ ఒక్కడు ఊరూరికి వెళ్లి మొక్కలకు నీళ్లు పోసి సాదుతడా? చెట్లు పెంచాలనే సోయి వీఆర్‌ఓలకు ఉండవద్దా! గ్రామం పట్టిష్టం కావాలంటే మంచి చట్టం తెచ్చుకోవాలి. ప్రధానికి కూడా చెప్పా. ఏ ఊరికి ఆ ఊరు.. ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ వికాసం కోసం జరుగాల్సిన పని అక్కడ చేస్తే బాగుంటుంది. ఢిల్లీలో మీరు.. హైదరాబాద్‌లో నేను ఉండి డబ్బులు పంపిస్తే కాదని చెప్పా. జిల్లాకు జిల్లా, గ్రామానికి గ్రామం, మండలానికి మండలం, రాష్ట్రానికి రాష్ట్రం ప్లాన్ రూపొందించుకొని పని చేయాలి. మీ డ్యూటీలు ఏమిటో నిర్ణయిస్తాం. ఇప్పుడిప్పుడే లైన్‌లోకి వస్తున్నాం. అన్ని పనులు నేను ఒక్కడినే ఒకేసారి చేయలేను కదా… ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో మంచి చట్టం తెస్తాం. 20, 21, 22 తేదీలలో ఏదో ఒక రోజు మళ్లీ కూర్చుందాం.

చక్కగా చర్చించి జాబ్‌చార్ట్ తీసుకొని ముందుకు పోదాం. ఆశ వర్కర్లు ఏమి చేయాలి? ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎవరెవరు ఏ పని చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ఆశ వర్కర్లను తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలువాలి. ఆశ వర్కర్ల సేవలు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీ లక్ష్మారెడ్డి, టీ హరీశ్‌రావు, ఎంపీ కవిత, ప్రభుత్వ సలహాదారు వివేకానంద, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ సలీమ్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారి, కమిషనర్ వాకాటి కరుణ, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంకు ఆశ వర్కర్ల కృతజ్ఞతలు తమ పారితోషికాన్ని భారీ ఎత్తున పెంచడంపై ఆశ వర్కర్లు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ప్రకటన రాగానే జనహిత ప్రాంగణం జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. తమ కష్టాలను చూసి తమ బాధలు పోగొట్టడానికి సీఎం కేసీఆర్ పెద్దమనసుతో నిర్ణయం తీసుకున్నారని వారన్నారు. కన్న తండ్రిలా తమ సమస్యలు అర్థం చేసుకున్న సీఎంకు రుణపడి ఉంటామని వారు మీడియాకు చెప్పారు.

ఎంపీ వినోద్ హర్షం రాష్ట్రంలో ఆశ కార్మికుల పారితోషికాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. వీరి పారితోషికాన్ని పెంచాలని గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రికి విజ్ఞప్తి చేశానని, పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో చర్చించానని, లోక్‌సభలో ఆరోగ్య శాఖ బడ్జెట్ చర్చ సందర్భంగా, ప్రత్యేకంగా 377వ నిబంధన కిందా చర్చించానని చెప్పారు. కేంద్రం స్పందించకపోయినా సీఎం కేసీఆర్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంపై వినోద్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ సైతం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆశ వర్కర్ల పారితోషికాలు పెంచినందుకు టీఎన్జీవోల సంఘం గౌరవ అధ్యక్షులు దేవీ ప్రసాద్, అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం. రాజేందర్‌లు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆశవర్కర్ల వేతనాల పెంపునకు ఎంపీ కవిత కృషి ఆశవర్కర్ల వేతనాల పెంపునకు ఎంపీ కవిత అవిరళ కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల విషయంలో బడ్జెట్‌లో కోత పెట్టింది. దీంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు ఎంపీ కవితను పలుమార్లు కలిసి విజ్ఞాపనలు ఇస్తూ వచ్చారు. దీనితో కేంద్ర స్థాయిలో కవిత విశేష ప్రయత్నాలు చేశారు. కేంద్రమంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్రస్థాయిలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. దీనిఫలితంగానే సీఎం తొలుత అంగన్‌వాడీ వర్కర్ల వేతనాలు భారీగా పెంచారు. తర్వాత ఇపుడు ఆశవర్కర్లకు రూ.6 వేల వేతనాలు పెంచుతూ నిర్ణయించారు. తమ వేతనాల పెంపునకు కృషి చేసిన ఎంపీ కవితకు ఆశవర్కర్లు ధన్యవాదాలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.