Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అటవీశాఖకు కుదుపు

-ఒకేరోజు ఐఎఫ్‌ఎస్ అధికారులు సహా 200 మందికి తబాదలా
-నిర్లక్ష్యపు అధికారులపై బదిలీ వేటు
-అటవీప్రాంతాల్లో సమర్థులకు పోస్టింగ్
-అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఉత్తర్వులు
-హైదరాబాద్‌లో కాదు.. క్షేత్రస్థాయిలో దృష్టిపెట్టండి
-ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం

అటవీశాఖ భారీ కుదుపునకు లోనైంది. మునుపెన్నడూ లేనివిధంగా ఒకేరోజు 200 మంది అటవీశాఖ అధికారులను తబాదలా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమర్థులకు పోస్టింగ్ ఇచ్చింది. జంగల్ బచావో-జంగల్ బడావో నినాదంతో ఒకవైపు స్మగ్లర్లు, అటవీ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతూనే.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటువేసింది. ఐఎఫ్‌ఎస్ అధికారులు మొదలుకుని చీఫ్ కన్జర్వేటర్లు, కన్జర్వేటర్లు, డీఎఫ్‌వో, ఎఫ్‌డీవో, ఏసీఎఫ్‌స్థాయి అధికారులను పెద్దసంఖ్యలో బదిలీచేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలోని అడవులు, అభయారణ్యాల్లో క్షేత్రస్థాయినుంచి ఉన్నతస్థాయి వరకు చాలామందిని తబాదలా చేశారు. ఉన్నతాధికారులు కేవలం హైదరాబాద్ నుంచే పరిస్థితిని పర్యవేక్షించకుండా క్షేత్రస్థాయిలో దృష్టిసారించాలని ఆదేశించారు. అటవీశాఖలో భారీ స్థాయిలో బదిలీలు చోటుచేసుకోనున్నాయని నమస్తే తెలంగాణ మంగళవారం నాటి సంచికలో ముందే పేర్కొన్న సంగతి తెలిసిందే. అడవుల రక్షణను విస్మరించి, స్మగ్లర్లతో అంటకాగుతున్న అధికారులు, సిబ్బంది జాబితాను తయారుచేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. ఉన్నతాధికారులు పలువురి పేర్లతో లిస్ట్ రూపొందించి నివేదించారు. దీన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి.. సదరు అధికారుల బదిలీలకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అటవీశాఖ అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

కీలక అధికారుల బదిలీ
కవ్వాల్ పెద్దపులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ శరవణన్‌ను బదిలీచేసి.. ఆయన స్థానంలో ప్రస్తుతం అచ్చంపేట, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్‌ను నియమించారు. చీఫ్ కన్జర్వేటర్‌స్థాయి అధికారి ఎస్కే సిన్హాకు అమ్రాబాద్ అభయారణ్యంలో ఫీల్డ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠినంగా వ్యవహరించగల సత్తాఉన్న, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో అటవీ సంపద తరిగిపోవడంపై, కలప స్మగ్లింగ్‌పై కొంతకాలంగా సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నదని, అక్కడ అటవీ సంపదను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, పాల్వంచ, కిన్నెరసాని, వరంగల్, ఖానాపూర్, అమ్రాబాద్, బాన్సువాడ, ఇల్లెందు, కాగజ్‌నగర్, ఇచ్చోడకు కొత్త డీఎఫ్‌వోలను నియమించారు. కొందరికి కీలక పోస్టింగ్‌లిచ్చారు.

ఇప్పటికే పలువురిపై సస్పెన్షన్ వేటు
వివిధ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, స్మగ్లర్లకు సహకరించడం వంటి ఆరోపణలతో ఇప్పటికే 11 మంది అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటువేశారు. పెద్దపులి, చిరుతపులి మరణాల కేసులో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా మంచిర్యాల ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ జే వెంకటేశ్వర్‌రావును బదిలీ చేశారు. ఇచ్చోడలో నీల్గాయి వేటలో నిందితులకు సహకరించి, పెద్దపులి చర్మం ఒలిచిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బీట్, సెక్షన్, రేంజ్ ఆఫీసర్లను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. మరోవైపు నిజామాబాద్‌లో కలప రాకెట్‌ను ఛేదించారు. కలప అక్రమ రవాణా కోసం నిందితులకు సహకరిస్తున్నారన్న కారణంగా నిజామాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ బీ రామ్మోహన్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటువేయగా, మరో నలుగురిని అరెస్ట్‌చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.