Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అతడే ఒక మిషన్

రేపటి నవ్యశక్తిగా తెలంగాణ అవతరించడం సత్యం. యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూడటం తథ్యం. కేసీఆర్ కన్న కల సాకారమవుతుంది. ఆపై తన చూపు విశ్వవ్యాప్తమవుతుంది. తన దార్శనికత భారత రాజకీయాలను ప్రభావితం చేయగల కాలమొకటి వస్తుంది. ప్రాంతీయ పరిధిని దాటి ఆయన సేవలు జాతీయస్థాయిలో అనివార్యమవుతాయి.

Naradasu-Laxman-Rao-06 ఆకులు రాల్చుకున్న అడవి.. శిశిరం తరువాత కొత్త చిగురులు తొడగాలి. అది ప్రకృతి ధర్మం. నేలకొరిగిన వీరుల త్యాగఫలంగా లభించిన విజయం తరువాత శాంతిపూలు పూయాలి. ప్రగతి ఫలాలు పండాలి. ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలి. ఇది యుద్ధాన్ని నడిపించి, గెలిపించిన నాయకుడి కర్తవ్యం. ఆ కర్తవ్య ప్రబోధంలోంచే కలగన్న తెలంగాణను కాలంతో పోటీ పడి నిర్మిస్తున్న కఠోర సాధకుడు కేసీఆర్. నిన్న యుద్ధాన్ని నడిపించింది, నేడు గెలుపు పగ్గాలను చేపట్టింది ఆయనే కాబట్టి తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చే బాధ్యతలో తపన నిండిన తాదాత్మ్యతలో ఉన్నాడు.

తల్లిదండ్రులు తమ బిడ్డలకు వారి భవిష్యత్తుకు అవసరమైన విషయాలతోపాటు భద్రతపట్ల కూడా మెరుగైన ఆలోచనలు చేస్తూ, అందుకు అవసరమైన ప్రణాళికలతో శ్రమిస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు తల్లి, దండ్రి. తెలంగాణే కుటుంబం. అందిపుచ్చుకున్న అధికారాన్ని అందలంలా కాకుండా, అంధకారం నిండిన జీవితాల్లో వెలుతురు నింపే ఆయుధంగా భావిస్తున్నాడు. అందుకే అధికారంలో ఉన్న సమయంలో అర నిమిషం వృథా అయినా అభివృద్ధిలో ఎక్కడ వెనకబడతామోనని అహోరాత్రులు తన మేధస్సుకు పదును పెట్టి శ్రమిస్తున్నాడు. ఐదేళ్ళ పదవీకాలం తన సంపూర్ణ శక్తిసామర్థ్యాల వినియోగానికి, ఫలితాల సాధనకు తనకు తాను నిర్దేశించుకున్న స్వీయ మూల్యాంకనంగా భావిస్తున్నాడు.

కేసీఆర్ ఆలోచనలన్నీ సాకారమై అంతిమ ఫలితాలు సాధించిన పిదప, అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు, సాంస్కృతిక వికాసం మొదలైన అంశాల నిర్వచనానికి తెలంగాణయే సైద్ధాంతిక ప్రాతిపదికగా నిలువబోయే కాలాన్ని మనం చూడబోతున్నాం.ఇందుకు కారణం కేసీఆర్ స్వీయ దార్శనికత. తెలంగాణ సాధనోద్యమంలో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు తానొక్కడి ఆత్మవిశ్వాసాన్నే ప్రజలందరిలో పాదుకొల్పి అజేయమైన శక్తిగా ఉద్యమాన్ని నడిపి విజయాన్ని సాధించాడు. ఇప్పుడు కూడా అసాధ్యమంటున్న అంచనాలనూ తారుమారు చేస్తూ సంచలనాత్మక పథకాలనూ ఆచరణాత్మకంగా సుసాధ్యం చేసే దిశలో కార్యసాధకుడిగా తనలోని విజన్‌ను చాటుకుంటున్నాడు. ఈ నేలను, ప్రజలను, సంస్కృతిని, జీవితాలను, వీరి భవితవ్యాన్ని ఎంతగా ఆవాహన చేసుకుంటే తప్ప ఇంతటి అంకితభావం సాధ్యం కాదు. ఉఛ్వాస, నిశ్వాస నిండా తెలంగాణమే ఉన్నపుడు, ఊపిరి ఉన్నంతవరకు బంగరు భవితకు బాటలు వేసే ఊహలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. దాని ఫలితమే ఇప్పటి ఈ ప్రగతి.

అభివృద్ధి శాశ్వత ఎజెండా అయినపుడు అధికా రం ఆలంబన. అధికారం శక్తివంతమై ఉండాలం టే రాజకీయ సుస్థిరత అనివార్యం. రాజకీయ సుస్థిరతకు పునరేకీకరణే మార్గం. అది ఒక చారిత్రక అవసరంగా భావించి కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానించారు. ఈ పరిణామం టీఆర్‌ఎస్‌కు తిరుగులేని బలాన్నిచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, ఇతర ఉప ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసి, రాజకీయ సుస్థిరతకు బీజం వేసింది.

కేసీఆర్ విలక్షణ నేత.అధినేతగా క్యాడర్‌లో నిరంతరం నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ఆయనే నెంబర్‌వన్. నిరాశతోనో, లోలోన నిరసన భావనతోనో ఉన్న ఎవరైనా, ఆయనతో మాట్లాడిన పిదప ఆయన వేవ్ లెంత్‌లోకి వెళ్ళవలసిందే. క్యాడర్‌తోనే కాదు, ప్రజలతోనూ నిరంతరం కనెక్ట్ అయి వుంటారు. తెలంగాణ మూలాలతో ముడివడిన ఏదో ఒక అంశాన్ని ఎప్పటికీ ప్రజల్లోకి తీసుకువెళ్తుంటారు. తెలంగాణకు జరుగబోయే ప్రతి మంచినీ అద్భుతంగా ప్రజెంట్ చేస్తూ ఆయన ఆలోచనలకు ఆమోదాన్ని మూటగట్టుకుంటాడు. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసంతో ఉంటాడు. ఆ విశ్వాసమే అసాధ్యమనుకొనే లక్ష్యాలను కూడా నిర్దేశించుకొనేలా చేస్తుంది. ఈ కోణమే ఇతర నాయకుల నుండి కేసీఆర్‌ను వేరు చేసే అంశం. ఈ డైనమిక్ థాట్స్‌లోంచి వెలుగు చూసినవే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల రీడిజైనింగ్, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, కళ్యాణలక్ష్మి, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూ పంపిణీ, నిరంతర విద్యుత్తు మొదలైనవి.

ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న అనేక పథకాల్లోంచి వీటిని ప్రత్యేకంగా ప్రస్తావించడమెందుకంటే.. వీటి సాధనతో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. గత పాలకులు కేటాయించిన సాగునీటి రంగ బడ్జెట్ టీడీపీ హయాంలో 4312.23 కోట్లు, కాంగ్రెస్- 36,894.55 కోట్లు కాగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం 26వేల కోట్లు బడ్జెట్‌ను ప్రతి ఏటా కేటాయించి కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రకటించడమంటే, స్వయంపాలన, సమర్థనాయకత్వం, సామూహిక జన చైతన్యంల మేలిమి సమన్వయం ఎంత శక్తివంతమైనదో నడుస్తున్న చరిత్రగా చాటిచెప్పడమే. పథకాల ప్రాథమ్యాలను ఎంచుకోవడంలోనే కేసీఆర్ విజయ రహస్యం దాగి ఉన్నది. ప్రతి చేనుకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు, అనాథలు, అభాగ్యులకు పెన్షన్లు, యువకులకు ఉపాధి ఉద్యోగావకాశాలు, నిరుపేదలకు నీడ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, పారిశ్రామిక సకల రంగాల వారికి ఉపయుక్తమైన పథకాలను తనకు తానుగా ఆలోచించి, అమలుపరుస్తున్న నేపథ్యం తెలంగాణను, కేసీఆర్‌ను విడదీయజాలని ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నది.

ఇంతటి మేధోవంతమైన పాత్రను పోషిస్తున్న ఆయన ఆలోచనలకు చోదకశక్తిగా పనిచేస్తున్న అంశం ఒకటున్నది. అదే ఆయన నిరంతర అధ్యయనశీలత. ముఖ్యమంత్రిగా ఉన్న ఏ వ్యక్తి టేబుల్ ఐనా ఫైళ్ళతో నిండి ఉంటుంది. కానీ, కేసీఆర్ గారి ఛాంబర్‌లో గానీ, ఇంట్లో గానీ కట్టలకొద్ది అనేక పుస్తకాలుంటాయి. తెరచాపతో పడవ నడిపేవాడికి గాలివాటం తెలియాలి. సంక్షోభాలెదుర్కొనే వాడికి సమస్య మూలాలు తెలియాలి. కేసీఆర్‌కు తెలంగాణ భౌగోళిక స్వరూపంతో పాటు, వనరుల లభ్యత, నీటిపారుదల స్వరూపం, ప్రజల జీవన విధానంలోని వైవిధ్యం, సాంస్కృతిక వైశిష్ఠ్యం, సారస్వత వైభవాలు, చారిత్రక ఆనవాళ్ళు,ఆధ్యాత్మిక సౌరభాలు.. అన్నింటి పట్ల సాధికారికమైన అవగాహన ఉన్నది.

అందుకే సందర్భం ఏదైనా, చర్చించే సమస్య ఏదైనా మాట్లాడే ప్రతిమాటలో ఒక ఫిలాసఫీ తొణికిసలాడుతుంది! ప్రతి పనిని ఘనంగా ఊహించడం, ఊహించిన దానికంటే ఘనంగా చేయడం కేసీఆర్ ఘనత. అడ్జస్ట్‌మెంట్ అండ్ కాంప్రమైసింగ్ అనేది సార్వకాలిక, సార్వజనీన జీవన అనువర్తిత సూత్రం. ఈ సూత్రాన్ని కేసీఆర్ అనేక నిర్ణయాత్మక సందర్భా ల్లో అమలుచేయడం ఆయనలోని సానుకూల దృక్పథానికి నిదర్శనం. పార్టీల నుంచి చేరికల సందర్భం లో గానీ, మంత్రి పదవులను కట్టబెట్టడంలో గానీ, ఎన్నికల్లో టికెట్లు కేటాయించడం కానీ.. ప్రతి సందర్భంలోనూ అనేక సమీకరణాలకు అనుగుణమైన సర్దుబాటు ధోరణిని అవలంబించడం వల్లనే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతున్నారు.

అభివృద్ధి ఒకసారితో ఆగిపోయేది కాదు. అమలు చేస్తున్న పథకాలు జనజీవితాల్లో మౌలిక మార్పులను తీసుకొచ్చేవే అయినప్పటికీ, అంతిమంగా పేదరికాన్ని పారదోలడమే జీవిత లక్ష్యంగా కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మస్తిష్కంలో ఎన్ని అభివృద్ధి అస్ర్తాలు దాగి ఉన్నాయో ఎవరం ఊహించజాలం. అతడే ఒక మిషన్. అందుకే ఆయనకు ఆంధ్రలోనూ అభిమానులున్నారు. ప్రధాని మోదీ స్వయంగా కేసీఆర్ పనితీరును అభినందిస్తున్నాడు. అనేక రాష్ర్టాల ముఖ్యమంత్రులు మన పథకాలను అమలు చేయడానికి అధ్యయనాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ ఇతర ప్రముఖులు సమావేశమైన ఒక సందర్భంలో కేసీఆర్ ప్రతిభను ఘనంగా పొగడడం జరిగింది. శాంతి కొరకు యుద్ధం.. యుద్ధం లో శాంతిని వెతుక్కునే వాడే విజేత అని చైనా యుద్ధతంత్ర నిపుణుడు సంజూ మాటలు కేసీఆర్ కు అతికినట్లు సరిపోతాయి. ఎందుకంటే అనేక కుట్రలు పన్నిన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో కానీ, మహారాష్ట్ర, కర్నాటకతో కానీ శాంతి, సౌభ్రాతృత్వ సంబంధాలు నెరపడం ద్వారా, ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు పరిపక్వ రాజకీయ నేతగా ప్రాంతాలకతీతంగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు.

రేపటి నవ్యశక్తిగా తెలంగాణ అవతరించడం సత్యం. యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూడటం తథ్యం. కేసీఆర్ కన్న కల సాకారమవుతుంది. ఆపై తన చూపు విశ్వవ్యాప్తమవుతుంది. తన దార్శనికత భారత రాజకీయాలను ప్రభావితం చేయగల కాలమొకటి వస్తుంది. ప్రాంతీయ పరిధిని దాటి ఆయన సేవలు జాతీయ స్థాయిలో అనివార్యమవుతాయి. భారతీయ ఫెడరల్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచి, జాతీయ రాజకీయ యవనికపై కొత్త సూరీడై వెలిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహు శా రానున్నది కేసీఆర్ శకమేనేమో..?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.