Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అతడొక్కడు.. అనుక్షణం.. ఆఖరి దాకా..

ఆ రోజు ఎలా తెల్లారిందో తెలియదు. ఒకరకమైన ఉత్కంఠ. పొద్దున రాజ్యసభ మొదలుకావడానికి ముందే కేసీఆర్‌ మరోసారి ప్రధానమంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆరోజు రాజ్యసభ ఇన్నర్‌ లాబీలో కేసీఆర్‌తో మేము ఉన్నాము. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి హామీ ఇవ్వాలని సభలో అరుణ్‌జైట్లీ కోరారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసై నేటికి ఏడేండ్లు
తెలంగాణ.. అరవయ్యేండ్ల ఆకాంక్ష! సుదీర్ఘ పోరాటం. త్యాగాల చరితం. అనేక దశల్లో మలుపులు తిరిగిన ఉద్యమం. ఇందులో ఎన్నో మజిలీలు. ఉత్కంఠ రేపిన రోజులు. అలాంటివాటిలో కీలకమైన దశ.. 2014 ఫిబ్రవరి. ఆ నెలలో 18 నుంచి 20 వరకు.. మూడురోజులపాటు మరుక్షణం ఏమవుతుందోననే ఆదుర్దా.. ఆందోళన. ఉత్కంఠ రేపిన ఆనాటి పరిస్థితిపై రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రత్యేక వ్యాసమిది..

భారతదేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడేందుకు పార్లమెంటులో అవసరమైన చట్టపర ప్రక్రియ జరిగిన సందర్భం అది. తెలంగాణ బిల్లు రూపకల్పన, లోక్‌సభ, రాజ్యసభలలో దాని ఆమోదం అనేవి అప్పుడు చాలా క్లిష్టమైనవిగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేసేందుకు రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ పార్లమెంటు ఆమోదం పొందకుండా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజకీయ సుడిగుండాలను సృష్టించారు. వాటిని అధిగమించేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిక్షణం అప్రమత్తంగా అడుగులు వేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో మాదిరిగానే రాష్ట్ర ఏర్పాటు చివరి అంకంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గమ్యం ముద్దాడే చివరి నిమిషం వరకు లక్ష్య సాధనపైనే దృష్టి పెట్టారు.

ఏవిషయంలో అయినా కేసీఆర్‌ సూక్ష్మంగా ఆలోచిస్తారు. అక్కడితో ఆగకుండా అది పూర్తిస్థాయిలో అమలయ్యేవరకు వెంటపడతారు. కేసీఆర్‌లోని ఈ ప్రత్యేక లక్షణమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడంలో బాగా పనిచేసింది. అనేక ఉద్యమాలు, రాజకీయ కార్యాచరణలు, కేసీఆర్‌ వ్యూహాత్మక ఒత్తిడితో 2014లో యూపీఏ ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ను రూపొందించింది. ఫిబ్రవరి 18న పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

పార్లమెంటులో ఏ బిల్లుపై ఓటింగ్‌ జరిగినా తలుపులను మూయడం తప్పనిసరిగా జరుగుతుంది. ఓటింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టే ముందు స్పీకర్‌ బెల్‌ కొడతారు. వెంటనే పార్లమెంటు సిబ్బంది తలుపులను మూసివేస్తారు. ఆ తర్వాతే ఓటింగ్‌ జరుగుతుంది. ప్రతి బిల్లు విషయంలో సాధారణంగా జరిగే ఈ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకులు, ముఖ్యంగా ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగానే ప్రతికూలంగా చిత్రీకరించడం విచిత్రం.

పార్లమెంటులో ఎప్పుడూ జరగని సంఘటనలు తెలంగాణ బిల్లు విషయంలోనే జరిగినట్లుగా మీడియాలోని ఒక వర్గం ప్రచారం చేసింది. అటల్‌ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు పార్లమెంటులో గలాటా జరిగింది. ఆ సందర్భంలో గాయపడిన ఒక ఎంపీ నెలపాటు చేతికి కట్టుతోనే సభకు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ విషయంలో అలాంటివి కాదుకదా ఏ చిన్న అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. అయినా ఏదేదో అయిపోయినట్లుగా చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఉన్నత స్థాయిలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అందుకే రాష్ట్రం ఏర్పడుతుందని కేసీఆర్‌ చెప్పారు. అందరిలోనూ అదే విశ్వాసం కలిగింది. అయినా సరే సీమాంధ్ర రాజకీయ నేతల తీరుతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని.. బిల్లు ప్రక్రియ మొదలైనప్పటినుంచి పూర్తయ్యేవరకు కేసీఆర్‌ అప్రమత్తంగా ఉండేవారు. బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు, సభలో ఆమోదం పొందిన సందర్భాల్లో క్షణం సైతం వదలకుండా దృష్టి, మనసంతా దానిపైనే ఉండేది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏ అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ఏర్పాటు కచ్చితంగా జరగాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు ప్రక్రియ సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎంపీ విజయశాంతితోపాటు మాజీ ఎంపీలమైన నేను, జితేందర్‌రెడ్డి ఉన్నాము. మాజీ ఎంపీలకు పార్లమెంట్‌లోని సభలలో ఇన్నర్‌ లాబీ లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. దీంతో బిల్లు ప్రక్రియను దగ్గరగా చూసే అవకాశం నాకు కలిగింది. బిల్లు ప్రవేశపెట్టడానికి ముందే కేసీఆర్‌.. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభలో బీజేపీ పక్ష నేత సుష్మాస్వరాజ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌లను కలిసి బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కోరారు. అప్పటినుంచి లోక్‌సభ, రాజ్యసభ రోజువారీ వ్యవహారాలతోపాటు కాంగ్రెస్‌, బీజేపీలో ఏం జరుగుతున్నది.. ఎలా చేయాలనేదానిపై తెలుసుకోవాలని కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మాకు చెప్తుండేవారు.

పార్లమెంటులో ఏ బిల్లుపై ఓటింగ్‌ జరిగినా తలుపులను మూయడం తప్పనిసరిగా జరుగుతుంది. ఓటింగ్‌ ప్రక్రియ మొదలుపెట్టే ముందు స్పీకర్‌ బెల్‌ కొడతారు. వెంటనే పార్లమెంటు సిబ్బంది తలుపులను మూసివేస్తారు. ఆ తర్వాతే ఓటింగ్‌ జరుగుతుంది. ప్రతి బిల్లు విషయంలో సాధారణంగా జరిగే ఈ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకులు, ముఖ్యంగా ఒక వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగానే ప్రతికూలంగా చిత్రీకరించడం విచిత్రం.

యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించిందిగానీ 15వ లోక్‌సభ పదవీకాలం దగ్గరపడింది. 2014 ఫిబ్రవరి 21తో సభ ముగుస్తుంది. ఆ తర్వాత లోక్‌సభ సాధారణ ఎన్నికలే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సభ మళ్లీ సమావేశమయ్యేది. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసే ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ను స్పీకర్‌ మీరాకుమార్‌ ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సీమాంధ్ర ఎంపీలు కొందరు సభలో అంతరాయం కల్పించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18న లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్‌ జరిగింది. బిల్లు సభ ఆమోదం పొందింది. లోక్‌సభలో ఆమోదం తర్వాత బిల్లు వెంటనే రాజ్యసభకు రావాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇబ్బందులే. సభ గడువు ముగుస్తుంది. మళ్లీ సాధారణ ఎన్నికలు. ఈ కారణంతోనే సీమాంధ్ర ఎంపీలకు ఒక దింపుడు కల్లం ఆశ ఉండేది.

లోక్‌సభ ఆమోదించినా కొన్ని ఇతర పార్టీలతో కలిసి రాజ్యసభలో బిల్లు నెగ్గకుండా చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతుందని సీమాంధ్ర ఎంపీలు భావించారు. బిల్లును లోక్‌సభ ఆమోదించిన కారణంగా తెలంగాణ ప్రజలలో పార్టీపై వ్యతిరేకత ఉండదని, రాజ్యసభలో విషయం తర్వాత చూడవచ్చని కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. సీమాంధ్ర రాజకీయాలపై సమగ్ర అవగాహన ఉన్న కేసీఆర్‌ ఎప్పటికప్పుడు దానికి అనుగుణంగా ఆలోచించేవారు. బిల్లు ఫిబ్రవరి 18న లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత సమావేశాలు ముగియడానికి మరో మూడు రోజులే ఉన్నాయి. గడువు తక్కువగా ఉండటంతో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదించే విషయంలో జాప్యం జరుగుతుందేమోనని కేసీఆర్‌కు ఎక్కడో సందేహం కలిగింది. బిల్లు ప్రక్రియలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే కేసీఆర్‌.. రాష్ట్ర ఏర్పాటు కోసం ఎలా వ్యవహరించాలనేదానిపై ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలతో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో సంప్రదింపులు జరిపేవారు. జరుగుతున్న పరిణామాలను వారికి వివరించి తెలంగాణ తరఫున ఏం చేయాలో చెప్పేవారు. కాంగ్రెస్‌ ఎంపీలతో మాట్లాడటంతోపాటు బీజేపీ పక్ష నేత సుష్మాస్వరాజ్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌లను కలిసి రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని కేసీఆర్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే ఉత్పన్నమయ్యే పరిస్థితులను వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఫిబ్రవరి 19న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు అప్పటి బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు కొన్ని సవరణలు ప్రతిపాదించారు. పునర్విభజన తర్వాత ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనాలు కల్పించే అంశాలను చేర్చాలని సూచించారు. లోక్‌సభ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’కు సవరణలు చేస్తే.. అది రాజ్యసభలో ఆమోదం పొందినా మళ్లీ లోక్‌సభకు రావాల్సి ఉంటుంది. సవరించిన బిల్లు మళ్లీ లోక్‌సభలో ఆమోదం పొందాలి. లోక్‌సభ సమావేశాలు ముగిసేందుకు మిగిలింది ఒక్క రోజే. అంటే రాజ్యసభలో సవరణలకు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికి వస్తుంది. చివరిదశలో ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై మరోసారి ఒకింత ఆందోళన మొదలయింది. బిల్లు అంశం ముందుకొచ్చినప్పటినుంచి నాలుగు రోజులు కేసీఆర్‌ కంటిమీద కునుకులేదు. ఫిబ్రవరి 19న అయితే మరీ ఉత్కంఠ పరిస్థితి. ఆ రోజు సభ ముగిసిన తర్వాత కేసీఆర్‌.. బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్‌ను కలిశారు. బిల్లుకు రాజ్యసభలో సవరణల ప్రక్రియకు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవాంతరాలు తలెత్తుతాయని తెలిపారు. 15వ లోక్‌సభ ముగింపు సమయంలో ఇలా జరగడం వల్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేని పరిస్థితి వస్తుందని వివరించారు. ఈ విషయంలో బీజేపీ తరఫున రాజ్యసభలో ఆ పార్టీ నేత అరుణ్‌జైట్లీకి సూచనలు చేయాలని కోరారు. బిల్లుకు సవరణలు కాకుండా పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం తరపున హామీలు కోరాలని సూచించారు.

2014 ఫిబ్రవరి 21తో సభ ముగుస్తుంది. ఆ తర్వాత లోక్‌సభ సాధారణ ఎన్నికలే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సభ మళ్లీ సమావేశమయ్యేది. ఫిబ్రవరి 18న లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్‌ జరిగింది. బిల్లు సభ ఆమోదం పొందింది. లోక్‌ సభలో ఆమోదం తర్వాత బిల్లు వెంటనే రాజ్యసభకు రావాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇబ్బందులే.

ఆరోజు ఎలా తెల్లారిందో తెలియదు. ఒకరకమైన ఉత్కంఠ. పొద్దున రాజ్యసభ మొదలుకావడానికి ముందే కేసీఆర్‌ మరోసారి ప్రధానమంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆరోజు రాజ్యసభ ఇన్నర్‌ లాబీలో కేసీఆర్‌తో మేము ఉన్నాము. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి హామీ ఇవ్వాలని సభలో అరుణ్‌జైట్లీ కోరారు. అలా సవరణల అడ్డంకులు లేకపోవడంతో తెలంగాణ ఏర్పాటు బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సోనియాగాంధీ నిర్ణయం.. దాని అమలు కోసం కేసీఆర్‌ నిరంతర పర్యవేక్షణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైంది. ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌లను కలిసి అంశాలను వివరించడంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల వ్యూహాలకు చెక్‌ పెట్టారు. కీలకమైన బిల్లు ఆమోద ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అందుకే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.

ప్రజాస్వామ్యయుతంగా కొనసాగిన ఉద్యమం, టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ కార్యాచరణతో తెలంగాణ ఏర్పాటుకు బిల్లు సిద్ధమైంది. దాంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఇక ఆపలేమనే అనుమానం సీమాంధ్ర ప్రజాప్రతినిధులలో మొదలయ్యింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తొమ్మిది రిట్‌ పిటిషన్లను దాఖలు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ సరిగా లేదని పేర్కొన్నారు. ఏదైనా కారణంతో బిల్లుపై స్టే వస్తే అంతే సంగతులు. పార్లమెంటు సమావేశాలతోపాటు లోక్‌సభ గడువు కూడా ముగుస్తుంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా సమావేశాలు ముగిసేలోపు స్టే ఇచ్చేలా చేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో వ్యవహరించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో కొందరు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తొమ్మిది రిట్‌ పిటిషన్లను దాఖలు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ సరిగా లేదని పేర్కొన్నారు. ఏదైనా కారణంతో బిల్లుపై స్టే వస్తే అంతే సంగతులు. పార్లమెంటు సమావేశాలతోపాటు లోక్‌సభ గడువు కూడా ముగుస్తుంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా సమావేశాలు ముగిసేలోపు స్టే ఇచ్చేలా చేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో వ్యవహరించారు.

ఇలాంటివాటిని ముందే ఊహించిన కేసీఆర్‌ న్యాయప్రక్రియకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏం చేయాలో నాకు ఆదేశాలు ఇచ్చేవారు. న్యాయప్రక్రియ కావడంతో మొత్తం అటువైపే ఎక్కువగా ఉండాలని నన్ను అదిలించేవారు. బిల్లు విషయంలో దాఖలయిన పిటిషన్లపై వాదనల కోసం ప్రఖ్యాత న్యాయవాదులను కేసీఆర్‌ ఎంపిక చేశారు. వారికి గంటల లెక్కన భారీ మొత్తంలో ఫీజులు ఉండేవి. బిల్లుపై దాఖలైన పిటిషన్లపై కేసీఆర్‌ రోజువారీగా న్యాయనిఫుణులతో చర్చించేవారు. చట్టసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై అభ్యంతరాలను వ్యక్తం చేసే పరిస్థితి కోర్టులో ఉండదని వారు చెప్పారు. దీంతో ధీమా ఏర్పడింది. చివరికి అదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు’పై స్టే ఇచ్చే ఆస్కారం ఉండదని, చట్టం అయిన తర్వాత లోపాలు ఉంటే వాటిపై జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ఆఖరి కుట్రలను కేసీఆర్‌ అడ్డుకోగలిగారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.

(వ్యాసకర్త: రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు)
-బోయినపల్లి వినోద్ కుమార్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.