Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆత్మగౌరవం బీజేపీకి తాకట్టు

-ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు
-మాజీ మంత్రిపై మంత్రి కొప్పుల ఫైర్‌
-ఆత్మగౌరవం బీజేపీకి తాకట్టు

సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం చల్లూరు వేంకటేశ్వర ఫంక్షన్‌ హాలులో టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో పెద్ద ఎత్తున నిర్వహించిన సమావేశంతోపాటు హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో మీడియాతో కొప్పుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు తనకు ఐదేళ్లుగా భేదాభిప్రాయాలు ఉన్నాయని ఈటల రాజేందర్‌ స్వయంగా ఒప్పుకున్నారన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్‌ గొప్ప మనసుతో ఈటలకు రెండు సార్లు మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించారని గుర్తుచేశారు. తమ భూములు ఆక్రమించారని దళితులంతా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తేనే ఈటల మీద చర్యలు తీసుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్‌కు ఒక్క పైసా ఇవ్వని, అణగదొక్కాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈటల తాకట్టుపెట్టాడని దుయ్యబట్టారు. కమ్యూనిస్టు భావాలున్న ఈటల బీజేపీలోకి ఎలా వెళ్తారని, ఏ స్వార్థం కోసం వెళ్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈటల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రారంభించినందుకా?, హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యం పెట్టాలని అడిగిన వెంటనే సీఎం కేసీఆర్‌ అమలు చేసినందుకా?, రెండు సార్లు మంత్రి పదవులు ఇచ్చినందుకా?.. చెప్పాలని మంత్రి కొప్పుల ప్రశ్నించారు. సీఎం కావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఆత్మగౌరవం అనే సమస్య వచ్చిందని, వందల ఎకరాలు ఉన్నందుకే ఇదంతా చేసి సీఎం కేసీఆర్‌పై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈటల రాజీనామా వల్ల టీఆర్‌ఎస్‌కు నష్టమేమి లేదన్నారు. ఈటల రాకముందు హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎలా ఉందో ఇప్పుడు కూడా నిండుకుండలా అలాగే ఉన్నదని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కుర్చీపై కన్నేసిండు : మంత్రి గంగుల
హుజూరాబాద్‌ టౌన్‌/హుజూరాబాద్‌ రూరల్‌, జూన్‌ 13: ఈటలకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గ అభివృద్ధిని పక్కకు పెట్టి తన వ్యక్తిగత పనులను చక్కబెట్టుకున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. కేసీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చోవాలని కుట్రలు పన్నాడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లోని కిట్స్‌ ఆడిటోరియంలో.. హుజూరాబాద్‌ మండల, మున్సిపల్‌ పరిధిలోని టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గంగుల మాట్లాడారు. ఎస్సీ, బీసీల వద్ద తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈటల హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయకుండా శామీర్‌పేటలో తన గడిని నిర్మించుకున్నాడని మండిపడ్డారు. అభివృద్ధి అంటే ఇక నుంచి చూపెడతామని, వచ్చే ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

అసైన్డ్‌ భూములను పేదలకు పంచాలి
-ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌
ఆస్తులు కాపాడుకునేందుకే ఈటల రాజేందర్‌ బీజేపీలోకి వెళ్తున్నాడని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో 18 ఏండ్లుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈటల టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలపై నిజమైన ప్రేమ ఉంటే అసైన్డ్‌ భూములను తిరిగి పంచాలని సవాల్‌ విసిరారు. 57 ఏండ్లు ఉండి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. 4.50 లక్షల మందికి వారం రోజుల్లో కొత్త రేషన్‌ కార్డులు అందజేస్తామన్నారు. అనంతరం సిరిసేడు గ్రామానికి చెందిన 50 మంది యువకులతోపాటు ఆటో యూనియన్‌ సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

కేసీఆర్‌ వల్లే అభివృద్ధి : కెప్టెన్‌
తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే ఒక్క సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమవుతుందని రాజ్యసభ సభ్యు డు కెప్టెన్‌ వీ లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. రైతుల సంక్షేమ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అనేక పథకాల అమలుచేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, బీసీ కమిషన్‌ మాజీ సభ్యు డు వకుళాభరణం కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యం : రసమయి
‘పార్టీని వదలి ఎంతో మంది వెళ్తుంటారు.. వస్తుంటారు.. కానీ, పార్టీయే శాశ్వతం. ఇది మనందరం గుర్తుంచుకోవాలి’ అని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. పార్టీ పిలుపు మేరకు మన అభ్యర్థిని గెలిపించి తీరాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు.

అప్పుడెక్కడ పోయింది ఆత్మగౌరవం : మంత్రి మల్లారెడ్డి
చట్టవిరుద్ధంగా అసైన్డ్‌ భూములను కాజేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రజలంతా ఛీకొడుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పేదల నుంచి అక్రమంగా అసైన్డ్‌ భూములను తీసుకున్నప్పుడు ఈటల ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆదివారం కంటోన్మెంట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమ్యూనిస్టునని పదేపదే చెప్తున్న ఈటల ఇప్పుడు కమ్యూనిజాన్ని బీజేపీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.