Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆగస్టు 15న రెతు బీమా

-రైతాంగానికి దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని పథకం పంద్రాగస్టునప్రారంభం -ప్రభుత్వం ద్వారానే ప్రీమియం చెల్లింపు -ఒక్క రూపాయి చెల్లించకుండానే రైతులకు రూ.5లక్షల జీవిత బీమా -ప్రతిఏటా ఆగస్టు 1న ప్రీమియం -సహజ మరణాలకూ వర్తింపు -ఎల్‌ఐసీ ద్వారా పథకం అమలు -18 నుంచి 59 ఏండ్ల రైతులు జీవిత బీమా పథకానికి అర్హులు -డెత్ సర్టిఫికెట్ ఇస్తే చాలు -పదిరోజుల్లోగా బీమా మొత్తం చెల్లింపు -గడువులోగా చెల్లించకుంటే ఎల్‌ఐసీకి జరిమానా -సమీక్షా సమావేశంలోముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నిర్ణయాలు -బీమా చరిత్రలోనే సరికొత్త రికార్డన్న ఎల్‌ఐసీ ప్రతినిధులు -రైతు సంక్షేమంకోసం పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు

తెలంగాణలో వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా రైతు సంక్షేమానికి కూడా అత్యంత ప్రాధాన్యమిస్తూ.. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా రైతు జీవితబీమా పథకాన్ని పంద్రాగస్టు నుంచి ప్రారంభించడానికి రైతు బాంధవుడైన ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇప్పటివరకూ భారతదేశ చరిత్రలో, బీమా కంపెనీల చరిత్రలో సైతం కనీవినీ ఎరుగని రీతిలో జీవిత బీమా పథకాన్ని స్వాతంత్య్రదినోత్సవ కానుకగా రైతులకు అందించబోతున్నారు. వ్యవసాయాభివృద్ధి కోసం, సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు, ఎకరానికి రూ.8 వేల పంట పెట్టుబడి సాయాన్ని అందించిన సర్కారు, అన్నదాత ఆత్మైస్థెర్యాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు రైతుబీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఆగస్టు 15న రైతుబీమా పథకాన్ని ప్రారంభించి, రైతులందరికీ బీమా సర్టిఫికెట్లు అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరంలేదని, ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టంచేశారు. ఇందుకోసం అయ్యే నిధులను బడ్జెట్‌లోనే కేటాయించి, ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీనాడే బీమా కంపెనీలకు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతులకు జీవిత బీమా పథకం రూపకల్పనపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో మాట్లా డి విధి విధానాలు ఖరారుచేశారు. విశ్వసనీయత, విస్తృత యంత్రాంగం కలిగిన భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ద్వారా ఈ బీమా పథకం అమలుచేస్తామని ప్రకటించారు.

సహజంగా మరణించినా బీమా చెల్లింపు రైతు ఏ కారణంతో మరణించాడనే దానితో సంబంధం లేకుండా, సహజంగా మరణించినప్పటికీ, రైతు ప్రతిపాదించిన నామినీకి పదిరోజుల్లోగా రూ.5లక్షల జీవిత బీమా చెల్లించే విధంగా పథకం ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కేవలం ప్రమాద బీమా అయితే ప్రభుత్వ వ్యయభారం కూడా తక్కువ అయ్యేదన్నారు. కానీ ఎంత వ్యయ భారమైనాసరే మరణించిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి జీవిత బీమా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇంతపెద్ద మొత్తంలో జీవితబీమా చేస్తున్నందున ఎల్‌ఐసీ కూడా దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, పకడ్బందీగా అమలుచేయాలని సీఎం కోరారు.

అత్యధికులు చిన్న రైతులే తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే 93 శాతం ఉన్నారు. ఒక ఎకరంలోపు ఉన్నవారు 18 లక్షలు ఉన్నారు. వారికి భూమి తప్ప మరో జీవనాధారం లేదు. ఏదేని పరిస్థితుల్లో రైతు చనిపోతే ఆ కుటుంబం ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడుతుంది. రైతుల కుటుంబాలను ఈ బాధ నుంచి తప్పించడానికి జీవిత బీమా కల్పించాలని నిర్ణయించాం. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉంటే, ఆ కుటుంబానికి ఆసరా ఉం టుంది. కేవలం ప్రమాద బీమా వర్తింపచేయడంవల్ల ప్రభుత్వానికి భారం తక్కువగా ఉన్నప్పటికీ, రైతులకు పెద్దగా లాభం ఉండదు. కాబట్టి వ్యయం ఎక్కువైనా సరే సాధారణ మరణాలకు కూడా వర్తించే విధంగా జీవిత బీమా చేయాలని నిర్ణయించాం. ఇది తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమంకోసం వేస్తున్న మరో ముందడుగు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ వినోద్, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్‌రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, ఎల్‌ఐసీ రీజనల్ మేనేజర్ ఆర్ చందర్, డివిజనల్ మేనేజర్లు బిఎస్ నర్సింహ, సుబ్రహ్మణ్యం, బ్రాంచి మేనేజర్ జీ పట్నాయక్ పాల్గొన్నారు.

రైతు జీవిత బీమా పథకం అమలు ఇలా… -ఎల్‌ఐసీతోపాటు ఇతర బీమా సంస్థల నిబంధనల ప్రకారం సాధారణ జీవిత బీమా 18 నుంచి 60 ఏండ్ల వయసున్నవారికే వర్తిస్తుంది. 59 ఏండ్లలోపు వారినే బీమా పథకానికి నమోదు చేసుకొంటారు. 60 ఏండ్ల వయస్సు వచ్చేవరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. తెలంగాణలో కూడా రైతులకు జీవిత బీమా పథకం కోసం 18 నుంచి 59 ఏండ్లలోపు వారి పేర్లు నమోదుచేస్తారు. -ఆధార్ కార్డుపైన నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. 2018 ఆగస్టు 15నాటికి రైతులకు 18 నుంచి 59 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రతి ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లు నమోదు చేస్తారు. -ప్రతి రైతుకు ప్రభుత్వం-ఎల్‌ఐసీ సంయుక్తంగా బీమా సర్టిఫికెట్‌ను ఇస్తాయి. -బీమా సొమ్ము రూ.5 లక్షలు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించే స్వేచ్ఛను రైతుకే ఇస్తారు. రైతు నుంచి నామినీని ప్రతిపాదించే పత్రం తీసుకుంటారు. దాని ప్రకారమే బీమా సొమ్ముచెల్లిస్తారు. త్వరలో వ్యవసాయాధికారులు గ్రామాల్లో రైతుల నుంచి నామిని ప్రతిపాదనల పత్రాలను సేకరిస్తారు.

-రైతు మరణించిన పది రోజుల్లోగానే రూ.5లక్షల రూపాయలను నామినికి అందజేస్తారు. రైతు కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. పది రోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించేవిధంగా ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి మధ్య త్వరలోనే సేవా ఒప్పందం కుదురుతుంది. పదిరోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్‌ఐసీకి జరిమానా విధిస్తారు. -రైతుల తరుఫున ప్రభుత్వమే ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి ఏడాది బడ్జెట్లోనే ప్రీమియం కోసం నిధులు కేటాయించి, ఆగస్టు 1న ఎల్‌ఐసీకి చెల్లిస్తారు. -ప్రతి నెలా రైతుల వివరాలను వ్యవసాయాధికారులు అప్‌డేట్‌చేస్తారు. దాని ప్రకారం బీమా పథకానికి అర్హులయ్యే రైతుల జాబితా కూడా అప్‌డేట్ అవుతుంది. ఎప్పుడు భూమికొంటే అప్పటి నుంచి బీమా వర్తిస్తుంది. -క్లస్టర్లవారీగా 18-59 ఏండ్ల వయస్సు గల రైతుల జాబితాను సిద్ధం చేస్తారు. ప్రభుత్వం వారి తరఫున ఏకమొత్తంలో ప్రీమియం చెల్లించి, రైతుల జాబితాను ఎల్‌ఐసీకి అందిస్తుంది. దాని ప్రకారమే ఎల్‌ఐసి బీమా సర్టిఫికెట్లను ముద్రిస్తుంది. బీమా సర్టిఫికెట్లను ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి రైతులకు పంపిణీ చేస్తుంది.

దేశ చరిత్రలో సరికొత్త రికార్డు: ఎల్‌ఐసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతులకు రూ.5లక్షల జీవిత బీమా సౌకర్యం దేశ చరిత్రలో, బీమా సంస్థల చరిత్రలోనే సరికొత్త రికార్డని ఎల్‌ఐసీ ప్రకటించింది. ప్రగతిభవన్‌లో బీమా పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన సందర్భంగా ఎల్‌ఐసీ రీజనల్ మేనేజర్ ఆర్ చందర్, డీఎంలు బీఎస్ నర్సింహ, సుబ్రమణ్యం మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి గ్రూపు ఇన్సూరెన్సులున్నాయి కానీ అందులో సభ్యులు వేలసంఖ్యలో మాత్రమే ఉండేవారన్నారు. లక్ష నుంచి రెండు లక్షలకు మాత్రమే బీమా చేయిస్తారని తెలిపారు. ప్రీమియం సొమ్ము తక్కువవుతుందనే ఉద్దేశ్యంతో ప్రమాద బీమా మాత్రమే చేస్తారని చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యయమైనా సరే, రైతులందరికీ ప్రయోజనం కలిగించాలని భావించిందని, ప్రీమియం ఎంతైనా సరే, ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా చేయాలని నిర్ణయించిందని ప్రశంసించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల బీమా చేయడం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. ఇన్ని లక్షల రైతులు సభ్యులుగా గ్రూపు ఇన్సూరెన్స్ చేయడం కూడా దేశ చరిత్రలో, ఇన్సూరెన్సు కంపెనీల చరిత్రలో రికార్డని హర్షం వ్యక్తంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.