Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఆగస్టు 15 మూడు కానుకలు

-రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు -పేదలకు కంటి చూపు.. రైతులకు బీమా సౌకర్యం.. -బీసీలకు సబ్సిడీ రుణాలు -ప్రజలకు అందనున్న మిషన్ భగీరథ ఫలాలు -స్వచ్ఛ గ్రామాలకు ఆగస్టు 15 నుంచే శ్రీకారం

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు. పేదప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు, రైతుకు దన్నుగా ఉండే బీమా, స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థికసహాయం అందించే కార్యక్రమాలను బుధవారం నుంచి సర్కారు చేపడుతున్నది. ఆ రోజునే అందరికీ సురక్షితమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకంలో భాగంగా నదీజలాలను బల్క్‌గా గ్రామాలకు అందించనున్నారు. పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా పంద్రాగస్టు నాడు అన్ని గ్రామాలలో ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరు కూడా కంటి చూపు సమస్యలతో బాధపడకూడదని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ప్రజలకు కండ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రజలందరికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో భాగంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ముందుగా సర్కారు దవాఖానలను బలోపేతం చేసింది. అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఆ తరువాత డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో సిజేరియన్ ద్వారా ప్రసూతిచేసే విధానాన్ని పకడ్బందీగా నియంత్రించింది. కేసీఆర్ కిట్స్ విధానాన్ని తీసుకొచ్చి పేదింటి గర్భిణులు, పిల్లలకు అండగా నిలిచింది. ఇప్పుడు ప్రజలందరికీ కంటిచూపు మంచిగా ఉండాలనే లక్ష్యంతో కంటివెలుగు పథకాన్ని చేపట్టింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

అన్నదాతలకు అండగా.. గ్రామసీమలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యవసాయరంగం పురోభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ భావించారు. స్వయానా రైతు అయిన ముఖ్యమంత్రికి రైతుల బాధలేమిటో బాగా తెలుసు. రైతుకు సర్కారు దన్నుగా నిలిస్తే ఎంత కష్టమైనా చేసి ఉత్పత్తిని పెంచుతారని, అభివృద్ధిలో భాగస్వాములవుతారని గుర్తెరిగారు. అందుకే ముందుగా భూమి సమస్యలను పరిష్కరించడానికి భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. ఆ వెంటనే రైతు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి ఇచ్చారు. రైతులు ఏ కారణంతో మరణించినా ఆయా కుటుంబాలకు అండగా నిలువాలని నిర్ణయించిన సీఎం.. కొత్తగా బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనున్నది. మంత్రులు, అధికారులు, రైతు సమన్వయ సమితి నేతలు.. ఇందులో చురుకైన పాత్ర పోషించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పథకాన్ని ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచే అమలుచేయనున్నారు. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో, పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.

బడుగులకు బాసటగా.. బడుగువర్గాలు బలపడేలా చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. అన్ని వర్గాల బీసీ ప్రజలు, కులవృత్తులవారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తున్నది. గొల్లకుర్మల ఆర్థిక ప్రగతి కోసం గొర్రెల పంపిణీ చేపట్టింది. గీత కార్మికుల రక్షణకు చర్యలు తీసుకున్నది. చేనేత కార్మికులకు భరోసా ఇచ్చింది. ఎంబీసీల అభ్యున్నతికి చర్యలు తీసుకున్నది. ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటుచేసింది. వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలని భావించే బడుగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీయే. ఈ విధంగా బడుగువర్గాలకు ఆర్థికసహాయం అందించే పథకాన్ని ఆగస్టు 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. లాంఛనంగా ఆరోజు జిల్లాకు వందమంది లబ్ధిదారులకు ఆర్థికసహాయం అందించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు బల్క్‌గా మంచినీటి సరఫరాను పంద్రాగస్టునాడే అందించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని అధికారులు పూర్తిచేశారు. మరోవైపు రాష్ట్రంలోని 12,751 గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నెలపాటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గ్రామప్రజలందరినీ భాగస్వాములను చేసి స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని కూడా సీఎం కేసీఆర్ పంద్రాగస్టు నుంచే ప్రారంభించనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.