Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అవకాశం వచ్చింది.. ఆగం కావొద్దు

-మతాల పేరిట చిచ్చుపెట్టే పార్టీకి బుద్ధిచెప్పండి
-ఢిల్లీలో ఉండాల్సింది గులాంలు కాదు.. పొట్లాడే టీఆర్‌ఎస్ ఎంపీలు
-అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి.. పార్లమెంట్‌లో చెల్లుతుందా?
-కేంద్రం మెడలు వచ్చి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసుకుందాం
-సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్

వచ్చే ఐదేండ్లు దేశం ఎటువైపు నడువాలో నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవి.. అవకాశం వచ్చింది. ఆగం కాకుండా దెబ్బకొడుదాం అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి చౌకీదార్లు, టేకేదార్లు వద్దని కేసీఆర్‌లాంటి జిమ్మేదార్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో మోదీ ప్రభ తగ్గిపోయిందని, కాంగ్రెస్ గాడి తప్పిందని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 150, కాంగ్రెస్‌కు 100 సీట్లు దాటే పరిస్థితి లేదని విశ్లేషించారు. తెలంగాణ ప్రజల ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌కు ఓటువేసి 16 మంది ఎంపీలను గెలిపిస్తే.. ఢిల్లీలో ఎవరు ఉండాలో నిర్ణయించిన వారమవుతామని తెలిపారు. మతాల పేరిట చిచ్చుపెట్టి అందులో చలిమంటలు కాగే పార్టీకి తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ తరఫున సికింద్రాబాద్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డికి మద్దతుగా ఘట్‌కేసర్‌లో రోడ్‌షోలు నిర్వహించారు. ఆయాచోట్ల కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌గాంధీకి.. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభమని, కానీ టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ర్టానికి లాభమని గుర్తుంచుకుని ఓటువేయాలని కోరారు.

కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ చేసింది శూన్యం కూటిలో రాయి తీయలేనోడు? ఏట్లో తీస్తానని బయలుదేరిన చందంగా కిషన్‌రెడ్డి పరిస్థితి ఉన్నదని, అంబర్‌పేటలో చెల్లని రూపాయి.. అమీర్‌పేటలో చెల్లుతదా? మనకు అవసరమా? అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. సికింద్రాబాద్ ప్రజలను ఓటుఅడిగే కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ ఐదేండ్లలో హైదరాబాద్ కోసం ఒక్కటంటే ఒక్క పని ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో కిషన్‌రెడ్డి గెలిచేది లేదు..మోదీ వచ్చేదీ లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే ఢిల్లీలో ఉండే గులాంలతో కాదని కొట్లాడే టీఆర్‌ఎస్ ఎంపీలతోనే సాధ్యమని చెప్పారు. కేంద్రమంత్రివర్గంలో ఉన్న ఒకేఒక్క తెలంగాణబిడ్డ దత్తాత్రేయను అర్ధంతరంగా మంత్రిపదవి నుంచి తొలిగించారని.. తెలంగాణ బిడ్డను గౌరవించలేని మోదీకి ఓట్లు ఎలా వేయాలో ఆలోచించాలని సూచించారు. తనను గెలిపిస్తే మంత్రి పదవి వస్తుందని చెప్పుకుంటున్న కిషన్‌రెడ్డి, ఉన్నఫళంగా మంత్రివర్గం నుంచి దత్తాత్రేయను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌కు సిగ్గుండాలి ఓటుకు నోటు కేసులో కెమెరాల సాక్షిగా దొరికిన ఓ దొంగకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ సిగ్గుపడాలని కేటీఆర్ అన్నారు. 30 లక్షల పైచిలుకు ఓటర్లున్న మల్కాజిగిరి అభ్యర్థిగా పోటీచేయించడానికి ఆ దొంగే దొరికాడా? అని ప్రశ్నించారు. దొంగకు టికెటిచ్చిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్పాలన్నారు. అతనికి ఓటేస్తే మల్కాజిగిరి మలినం అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ స్థానమూ మనకు ముఖ్యమేనని.. 16 ఎంపీలు గెలిపించుకుని తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన హక్కులు, పథకాలు, ప్రాజెక్టులు, నిధులు సాధిద్దామని పిలుపునిచ్చారు. పేదప్రజలు, రైతులు, సబ్బండవర్గాలు సంతోషంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని.. పార్లమెంట్‌లో మన గొంతుక ఉంటేనే కేంద్రంతో పోరాడి నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రోడ్‌షోలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్, పాటిమీది జగన్మోహన్‌రావు, మోతె శోభన్‌రెడ్డి, రామేశ్వర్‌గౌడ్..మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఘట్‌కేసర్‌లో జరిగిన రోడ్‌షోలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ హిందువులం కాదు.. బీజేపీలాగా టీఆర్‌ఎస్ నేతలు రాజకీయహిందువులు కాదని, ఎన్నికలతో సంబంధం లేని హిందువులని కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ హిందూ- ముస్లిం, ఇండియా-పాకిస్థాన్ అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టి చలిమంటలు కాచుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, అసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హైదరాబాద్‌లో ైఫ్లెఓవర్లు, నిరంతర విద్యుత్, సమృద్ధిగా తాగునీరు తదితర అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం కాబట్టే ఓట్లు అడుగుతున్నామని వివరించారు. హైదరాబాద్ కోసం ఒక్కపనైనా చేశామని చెప్పుకునే దమ్ము బీజేపీకి ఉన్నదా అని ప్రశ్నించారు.

ఏడెకరాల కోసం డెభై ఎకరాలు ఇస్తానన్నాం.. సికింద్రాబాద్‌లోని రైల్వేక్వార్టర్స్ వద్ద ఏడెకరాల జాగాకోసం పద్మారావు కాళ్లకు బలం కట్టుకుని తిరిగారని.. బదులుగా మరొకచోట 70 ఎకరాలు ఇస్తామన్నా కేంద్రం పట్టించుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. పేదలకు డబుల్‌బెడ్రూం ఇండ్లు కట్టుకుంటామంటే స్థలం ఇవ్వకుండా ఏడుచెరువుల నీళ్లు తాగిపించిందని మండిపడ్డారు. ఆదే ఢిల్లీలో మన ఎంపీల సంఖ్యాబలం ఉంటే గల్లా పట్టుకొని కేంద్రం మెడలు వచ్చి హైదరాబాద్‌కు పెద్దఎత్తున నిధులు తెచ్చుకోవచ్చని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తే హైదరాబాద్ రూపురేఖలు మారుస్తానని హామీఇచ్చారు.

నేడు జూబ్లీహిల్స్, నాంపల్లిలో కేటీఆర్ రోడ్‌షో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రచారంలో దూకుడు పెంచారు. రోడ్‌షోలతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. శనివారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన రోడ్‌షో నిర్వహించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌తో కలిసి ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని శ్రీరాంనగర్ చౌరస్తా, యూసుఫ్‌గూడ చౌరస్తాలో, రాత్రి ఏడు గంటలకు నాంపల్లిలోని చింతల్‌బస్తీ, మల్లేపల్లి మజీద్ వద్ద నిర్వహించే రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. వీటిని విజయవంతం చేసేందుకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఏర్పాట్లను పూర్తిచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.