-అమ్మ భాష తెలుగును మరువొద్దు -నవ తెలంగాణ నిర్మాణ బాధ్యత టీచర్లదే -వారికి పూర్తి సహకారముంటుంది -వచ్చే ఏడాది నుంచి తెలంగాణ పాఠాలు -టీఎస్‌యూటీఎఫ్ విద్యా సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి

సమాజంలోని ప్రస్తుత అవసరాల కోసం ఇంగ్లిష్‌ను కచ్చితంగా నేర్చుకోవాలని, కాని అమ్మ భాష తెలుగును మాత్రం విస్మరించకూడదని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం రవీంధ్రభారతిలో ఏర్పాటు చేసిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యను నిషేధించలేక పోయినప్పటికీ సర్కారీ విద్యను బలోపేతం చేయటం ద్వారా కార్పొరేట్ విద్యను నిర్వీర్యం చేయవచ్చన్నారు.
ప్రభుత్వ విద్యకోసం ఏటా రూ.పదివేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులో లేకపోవడం వల్లే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ళవైపు మొగ్గుతున్నారని, లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చినా లెక్కచేయటంలేదన్నారు. ఇప్పడున్న మేధావివర్గంలో సగంమంది చెట్టుకింద పాఠాలు నేర్చుకున్నవారేనని తెలిపారు. అంబేద్కర్ కూడా చెట్టుకింద చదువుకున్నారని గుర్తు చేశారు.

100 ఏండ్ల రాజరికం, 60 ఏండ్ల అరాచక ప్రభుత్వంలో సర్కారీ స్కూళ్ళలో నేటికీ కనీస ప్రమాణాలు లేకుండా పోవడం దారుణమన్నారు. టీచర్లందరికీ ఒకే పని, ఒకే విధానం, ఒకే రకమైన జీతంతోపాటు ఒకే రకమైన సర్వీసు రూల్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దసరా సెలవుల తర్వాత ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సర్కారీ విద్య బలోపేతం కోసం సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ పాఠాలు అందుబాటులోకి వస్తాయని, ఈ మేరకు పాఠ్య పుస్తకాల రూపకల్పనకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కే నాగేశ్వర్ అన్నారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రసంగించారు.