Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అవసరమైతే దేశ రాజకీయాల్లోకి

-అక్కడికి వెళ్లడం గౌరవంగా భావిస్తా.. దేశ ప్రజలు గుణాత్మక మార్పు ఆశిస్తున్నరు: సీఎం కేసీఆర్ -మార్పుల గురించి మాట్లాడాల్సి న వాళ్లతో మాట్లాడుతున్నా -ప్రధానిని తూలనాడినట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధం -ఎవరికోసమో నేను మాట్లాడే ప్రజల భాష మార్చుకోను -కాంగ్రెస్, బీజేపీ దొందూదొందే -ప్రజలకు, రైతులకు చేసిందేమీలేదు -మేం చేస్తున్న అభివృద్ధితోవారికి ఫ్రస్ట్రేషన్ -అడగకుండానే అన్ని వర్గాలకు అన్నీ ఇస్తున్నం -విభజన హామీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నయి -రాజ్యసభ సభ్యుల ఎంపిక పార్టీ అంతర్గత వ్యవహారం -మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు

జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే.. దేశంకోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అవసరమని, దేశ ప్రజలు పరివర్తన కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా విన్నకథలనే వింటూ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. శనివారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం తర్వాత మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై తన స్పందనను తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని దుయ్యబట్టారు. రెండుపార్టీలు మార్చిమార్చి దేశాన్ని పరిపాలిస్తున్నా పథకాల పేర్ల మార్పు తప్ప ప్రజలకు, రైతులకు ఒరిగిందేమీలేదని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ రాజకీయ సంఘటన గురించి ప్రస్తావిస్తూ.. థర్డ్ ఫ్రంటో మరో ఫ్రంటో.. దేశంలో రాజకీయ గుణాత్మక మార్పుల గురించి మాట్లాడాల్సినవాళ్లతో మాట్లాడుతున్నానని చెప్పారు. ఆవిర్భవించిన అనతికాలంలోనే అధికారం అందుకున్న రాజకీయ శక్తుల చరిత్ర మనకు ఎరుకేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పటికే ఆలోచనలు సాగుతున్నాయని, జాతీయస్థాయికి వెళ్లాల్సి వస్తే బాజాప్తా పోతామని కుండబద్దలు కొట్టారు.

దేశంకోసం పనిచేసే హక్కు మాకు లేదా? అని సీఎం అన్నారు. పంటల కనీస మద్దతు ధర కనీసం ఐదొందలు చొప్పున పెంచాలని కేంద్రాన్ని డిమాండ్‌చేయాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. ప్రధానిని తాను దూషించినట్టుగా జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనని కొట్టిపారేశారు. మీడియాతో జరిపిన సుదీర్ఘ సంభాషణలో ఆయన దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఆవశ్యకత గురించి పదేపదే నొక్కిచెప్పారు. చైనా అద్భుత అభివద్ధిని సాధించిందని, మనమెందుకు ఆ స్థాయికి ఎదుగలేమని నిలదీశారు. నదుల్లో వేలకొద్దీ టీఎంసీల నీరుంటే దేశంలో కరువులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రబలమైన ఆవశ్యకత ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయో చరిత్ర చెప్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జనతా పార్టీ పుట్టడం.. ఎన్నికల్లో స్వీప్ చేయడం 60 రోజుల్లో జరిగింది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 8, 9 నెలల్లోనే స్వీప్ చేసింది. ఇక టీఆర్‌ఎస్ పుట్టిన 60 రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసింది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎలా ప్రారంభమవుతుందో చెప్ప లేం. కానీ సమయం నిర్ణయిస్తది.

పనిమాత్రం ఆగదు అని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ పరివర్తన తీసుకురావడానికి తనవంతు కృషిచేస్తానని, మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే.. తప్పక ఆలోచిస్తానని స్పష్టంచేశారు. 70 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెట్టుకోవడం సరైంది కాదని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ అమలుకాలేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కేంద్రం తెలంగాణకు చేసిన మెహర్బానీ ఏమీ లేదని, రాష్ర్టానికి ఉన్న హక్కుగా తప్పితే తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని స్పష్టంచేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. సుదీర్ఘ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్

వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. -విభజన చట్టం హామీలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన అనేక అంశాలు ఇప్పటికీ అమలుకాలేదు. వాటి మీదనే కేంద్రాన్ని పెద్దఎత్తున నిలదీయాలని, పోరాటం చేయాలని నిర్ణయించాం. చాలా సందర్భాల్లో దరఖాస్తులు ఇచ్చినం. డెలిగేషన్ రూపంలో వెళ్లి చెప్పాం. మా లోక్‌సభ, రాజ్యసభ పార్టీ నాయకుల నేతృత్వంలో అనేకసార్లు వినతులు ఇచ్చాం. రాష్ట్ర మంత్రులు కూడా వెళ్లి కేంద్రానికి మా సమస్యలు చెప్పారు. నాలుగేండ్లయినా ఆశించినస్థాయిలో స్పందన రాలేదు. ఇక రిజర్వేషన్ల విషయం ప్రధానమంత్రి గారికి నేను స్వయంగా చెప్పాను. 70 ఏండ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్ల అంశం మీ దగ్గర (కేంద్రం పరిధిలో) పెట్టుకోవడం సరికాదని చెప్పాం. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు కూడా ఈ మాట బలంగా చెప్పి పంపించాం. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే రిజర్వేషన్లు మా రాష్ర్టాల పరిధిలో మేం ఇచ్చుకుంటున్నాం. మేం కేంద్రాన్ని అడుగడం లేదు. కాబట్టి, ఈ అంశం మీ దగ్గర పెట్టుకోవద్దని చెప్పాను. దానిపైన స్పందన లేకపోగా, పాతపద్ధతే కొనసాగిస్తామని చెప్తున్నారు. దీనిపైనా పెద్దఎత్తున పోరాటం కొనసాగిస్తాం. రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేయవచ్చనని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది పెద్ద విషయం కాదు. కేంద్రం అనుకుంటే ఆర్టికల్ 16ను సవరించవచ్చు. దీనికి అన్ని రాష్ర్టాలు సపోర్ట్ చేస్తాయి. ఏకగ్రీవంగా బిల్లు పాస్ అయితది. కానీ, కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అసలు రహస్యం ఇదే.

పారిశ్రామిక ప్రోత్సాహకాల కొనసాగింపుపై పోరాటం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రెండు రాష్ర్టాలకు ఇవ్వాలని విభజన చట్టంలో చెప్పారు. కానీ కంటితుడుపుగా ఒకటో రెండో ఇచ్చారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఇస్తున్నట్టుగా ఇస్తే, కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టాల్లో పెట్టుబడులు బాగా పెరుగుతాయి. ఉభయరాష్ర్టాలు అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందని అందరూ కొట్లాడి అడిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టింది. వీళ్లు (బీజేపీ) తీసేసిండ్రు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కొనసాగించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తం. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కూడా మా ఎంపీలు పోరాటం చేస్తరు. ఇవికాకుండా తెలంగాణకు ఇవ్వాల్సిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఇలా అనేకం పెండింగ్‌లో ఉన్నయి. వీటిపైన కేంద్రాన్ని నిలదీస్తం. ఆ ప్రకారంగా పార్లమెంట్ సమావేశాల్లో ముందుకుపోవాలని సమావేశంలో నిర్ణయించినం. ఎప్పటికప్పుడు మా ఎంపీలతో సమీక్షించుకుంటూ ముందుకు వెళుతం.

ఎవ్వరూ మమ్మల్ని ఏం చేయలేరు.. మాకు ఉన్నదేంది.. మేం చేసిన కుంభకోణమేంది? ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చేయలేరు. అంత నిటారుగా మేం ఉన్నాం. మాకున్న ఆస్తులన్నీ బహిరంగ రహస్యమే. మాకు పెద్దగా ఆస్తులు కూడా లేవు. ఈ దుర్మార్గమైన ఆస్తులు మనకు అక్కర్లేదని మా కుటుంబం అంతా కూర్చుని తీర్మానం కూడా చేసుకున్నాం. మాకు ఎంత ఉందో దాన్ని ఎప్పటికప్పుడు, నికరంగా నా జేబుకు ఉన్న పెన్నుతో సహా ప్రతి సంవత్సరం ఐటీ లెక్కలు సమర్పిస్తున్నాం. ఎన్నికలకు వెళ్లినప్పుడు అఫిడవిట్ సమర్పిస్తాం. దాని ప్రకారమే యాజిటీజ్, కచ్చితంగా ఉన్నాం. అంతకుమించి మమ్మల్ని చేయగల్గింది కూడా ఏం లేదు. ఎవరైనా భ్రమల్లో, భ్రాంతుల్లో ఉంటే ఏమీ చేయలేం. గతంలో మాదిరిగా కుంభకోణాల్లో ఉన్నోళ్లు, అక్రమ సంపాదనల్లో ఉన్నోళ్లు భయపడుతరు. కేసీఆర్ భయపడరు. ఆ అవసరం లేదు కేసీఆర్‌కు. ముట్టుకుని చూస్తే తెలుస్తది కథేంది అనేది. ఎవరిని పడితే వారిని ఏదిపడితే అది ఊహించుకుంటే కుదరదు.

అన్ని పార్టీల మాదిరిగానే మా పార్టీ నడుస్తది.. ఎన్నికలప్పుడు ప్రతిపార్టీకి చందాలు ఇస్తరు. ప్రపంచవ్యాప్తంగా పార్టీలు ఎట్లా నడుస్తున్నయో, టీఆర్‌ఎస్ కూడా అట్లనే నడుస్తున్నది. అవి ఎన్నికల రాజకీయాలు. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఎట్ల నడుస్తాయో మా పార్టీ కూడా అట్లనే నడుస్తది. అమెరికాల ట్రంప్ పార్టీ ఎట్లా నడుస్తదో.. భారతదేశంలో అన్ని పార్టీలు ఏ పద్ధతిని అవలంబిస్తయో.. మా పార్టీ కూడా అదే పద్ధతిని అవలంబిస్తది. టీఆర్‌ఎస్‌కు బోలెడంత మంది సానుభూతిపరులున్నారు. మా పార్టీ సభ్యులే 70 లక్షల మంది ఉన్నరు. అయినా ఎలక్షన్లలో పిచ్చిపిచ్చి కథలు చేయాల్సిన అవసరం మాకు లేదు.

ఇన్నాళ్లూ మిమ్మల్ని ఎవరైనా ఆపారా? నిర్మలా సీతారామన్‌గారు వచ్చి ఇకపై తెలంగాణపై దృష్టి సారిస్తామని అంటున్నరు. ఎవరు వద్దన్నరు వాళ్లని. ఇప్పటిదాకా ఎవరన్న ఆగబట్టినారా? దృష్టి.. రోజు కాకపోతే గంటగంటకు సారించండి. మోస్ట్ వెల్‌కం. మేం కూడా ఫ్రీగా గెలిచేది ఏం లేదు కదా. మేం కూడా ఎన్నికల్లో పోటీచేసి గెలువాల్సిందే. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు. మేం ఏం చేయాలో అది ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మేం మంచిగ చేసినమా? చెడ్డగ చేసినమా? అనేది ప్రజలే నిర్ణయిస్తరు. వచ్చే ఎన్నికల్లో వాళ్లే తీర్పు ఇస్తరు. దాన్ని మేం శిరసావహిస్తం.

సర్వేలో 106 సీట్లు గెలుస్తమని వచ్చింది మేం రెండు సర్వేలు చేయించుకున్నం. రెండు సర్వేలు కలిపి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేలకు పైగా శాంపిల్స్‌తోటి ఆరున్నల లక్షల శాంపిల్స్ తీస్తే.. ఒక సర్వేలో 106 సీట్లు గెలుస్తమని, మరో దాంట్లో 103 సీట్లు గెలుస్తమని వచ్చింది. రాజకీయాల్లో సన్యాసం తీసుకునుడు, గడ్డాలుపెంచుడు అని కొత్తకథ మోపైంది. ఈ ఫ్యాషన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థమయితలేదు. గడ్డాలు పెంచుకున్నరని, సన్యాసం తీసుకుంటా అన్నరని ప్రజలు సపోర్ట్ చేస్తరా? రాజకీయాల్లో ఇలాంటివి ఉంటయా? ఎప్పుడో 40, 50 ఏండ్ల కింద రాజకీయాలు ఇవి. ఇప్పుడు పనికొచ్చేవి కావు.

మీకోసం నా భాషను మార్చుకోను జైపాల్‌రెడ్డి మొత్తం కేసీఆర్ సంస్కారమే బాగాలేదంటున్నడు. కేసీఆర్ భాషనే అట్లుందంటున్నడు. కేసీఆర్ భాష అట్లనే ఉంటది మరి. ఉన్నది ఉన్నట్టు చెప్తే కేసీఆర్ భాష అట్లనే ఉంటది. ఏం తప్పు మాట్లాడిన? తెలంగాణలో రోజూ మాట్లాడుకునే భాషనే అది. ఏమిరా వాడు అటేపాయే.. వీడు అటేపాయే. ఇంకా రాకపాయే అంటరు. ఇంకా తమాషాగా మాట్లాడుతరు తెలంగాణలో. అలిగిపోయిన అలీసాబ్ అటేపాయే.. పిలువబోయిన పీర్‌సాహెబ్ అటేపాయే.. వీడు రాడాయే.. వాడు రాడాయే అని ప్రతినిత్యం మాట్లాడుకుంటరు. లేని రవ్వత్తులు, కవ్వత్తులు పెట్టి మాట్లాడడం నాతోటి కాదు. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కచ్చితంగా సింపుల్ లాంగ్వేజీలో, ప్రజల వ్యవహారిక భాషలోనే మాట్లాడుతం. మీకోసం నేను నా భాషను మార్చుకోను. మార్చుకోవాల్సిన ఖర్మ నాకు లేదు.

బీజేపీని పార్టీకింద చూడం.. జోక్ కింద తీసుకుంటంబీజేపీ లక్ష్మణ్ అప్పుడప్పుడూ మేమే ప్రత్యామ్నాయం అంటుంటరు. ఇవి పెద్ద జోకులు. వరంగల్ ఉపఎన్నికల్లో అమెరికా నుంచి ఒక డాక్టర్‌ను తీసుకువచ్చి పోటీకి పెట్టిండ్రు. మా పార్టీ అభ్యర్థికి నాలుగు లక్షల 60 వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది. దటీజ్ వాట్ బీజేపీ ఈజ్ ఇన్ తెలంగాణ. ఆ బీజేపీని మేం ఇక్కడ పెద్ద రాజకీయపార్టీ కింద పరిగణించం. పెద్ద జోక్ కింద తీసుకుంటం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పలగదీస్తం, పొడుస్తం అంటే చూడలేదా.. ఎన్ని ఎన్నికలు అని చెప్తం?

ఫ్రస్ట్రేషన్‌లో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్లు మెంటల్‌గా ఫ్రస్ట్రేషన్ అయిండ్రు. వాళ్లకున్న ఫ్రస్ట్రేషన్‌ను ప్రజలకున్నట్టు భావించుకొని పిచ్చి ప్రేలాపనలు చెప్పుకుంట పోతున్నరు. మా మీద ప్రజల్లో కోపముంటే నిజంగ బయటపడుతదని, ఏమైనా ఉంటే సరిదిద్దుకుందమని అనుకున్నం. కానీ పెద్ద బస్సుయాత్ర అంటే ఎక్కడా ఐదారువేల మంది దాటుతలేరు. అందుల కూడా ఈయన ఎమ్మడిపోయినోళ్లే సగంమంది ఉన్నరు. అందరికీ తెలిసిన రహస్యం అది. వీళ్లు ప్రజల సమస్యలు డిమాండు చేస్తే మేం నెరవేరుస్తం. ఎవ్వరు డిమాండు చేయకున్నా మేం చాలా నెరవేరుస్తున్నం. రైతులకు పెట్టుబడి ఆర్థిక సహాయం ఎవరు అడిగినరు? పేదింటి ఆడపిల్లల పెండ్లికి డబ్బులియ్యమని ఎవరైనా అడిగిండ్రా? హాస్టళ్లలో సన్నబియ్యం బువ్వ పెట్టమని ఎవరైనా అడిగిండ్రా? అనేక విషయాలు క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా.. దేశంమొత్తం మీద ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన ప్రాజెక్టు పనులు చేపడుతున్నం.

సర్కస్ ఫీట్లు చేసినా కాంగ్రెస్‌కు పది సీట్లు దాటవు గతంలో రైతుల తలకాయలు పగుల్తే ఎవరూ మళ్లిచూడలే. ఎవరూ పట్టించుకోలే. వందరోజుల్లో భూరికార్డుల ప్రక్షాళన చేయించి పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇవ్వబోతున్నం. ఇంటికాడికి పోయి అయ్యా మీ పహాణి, నకలు ఇదిగో అని ఇప్పటివరకు ఇట్ల ఎవరు ఇచ్చిండ్రు? నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగితే కాని పనిని మేం చేసి చూపించినం. ఇది రైతుల ప్రత్యక్ష అనుభవంలో ఉన్నది. దే ఆర్ ఎంజాయింగ్. ఇవన్నీ ఉన్నయి కాబట్టే సందు దొరుకదు. కాంగ్రెస్ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా ఆ పార్టీ పది సీట్ల గీత దాటదు. అది కూడా మేం పట్టించుకోకపోతేనే. బీజేపీ మొత్తమే గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న సీట్లు కూడా రావు. అదీ వాస్తవ పరిస్థితి. దానికే వారు ఫ్రస్ట్రేట్ అయితున్నరు.

ఆ 68 నిమిషాలు మాట్లాడిందేమైంది? భారత రైతాంగం అసహనానికి గురయితున్నదని నేను చెప్పిన. ఇంకా వాళ్ల ఓపికను పరీక్షించవద్దని చెప్పిన. నేను 70 నిమిషాలు మాట్లాడిన. అందులో రెండు నిమిషాలు.. గారు అంటే గాడు అన్నారని దాన్ని పట్టుకొని చొక్కాలు చిపుకొంటున్నరు. మిగిలిన 68 నిమిషాలు మాట్లాడిందేమైంది? దానికి సమాధానం చెప్పరేంది? ఆ ఇష్యూలు నేను ముందు పెట్టిన కాబట్టే గగ్గోలు పెడుతున్నరు. ఇది వాస్తవంగా జరిగింది. అందుకే దీన్ని ఎవరూ పట్టించుకోనవసరం లేదు. నేను ఎవరినీ దూషించలేదు. దూషించడం నా అభిమతం కాదని మరోసారి స్పష్టతనిస్తున్నా. లేనిదాన్ని ఉన్నట్టుగ చెప్పుకొని ఒక దుష్ప్రచారానికి దిగుతున్నరు. ఇది కరెక్టుకాదు.

బీజేపీ-కాంగ్రెస్ దొందూ దొందే రైతు ఎడల, ఇంకోదాని ఎడల నేను చెప్పిన సిద్ధాంతాలపరంగా బీజేపీ, కాంగ్రెస్ రెండూ దొందూదొందే. దేశంలో గుణాత్మకమైన మార్పు వస్తలేదు. రావాల్సిన అక్కర ఉన్నది. చాలా సీరియస్‌గా దేశంలో ఏదో ఒకటి జరుగాల్సి ఉంది. 70 ఏండ్ల నుంచి దేశం ఇదే మూసలో పోవాల్సిన అవసరం లేదు. దేశ రాజకీయాల్లో అనేక విషయాల్లో ప్రబలమైన మార్పు రావాలి. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్న. ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్ ఆ స్టాండ్‌మీదనే కొనసాగుతది. దాంట్ల ఎలాంటి అనుమానం వద్దు. అనవసరమైన పిచ్చి ప్రయత్నాలు వాళ్లు మానుకుంటే మంచిది. ఎక్కువ తక్కువ మాట్లాడి వారి గౌరవం వాళ్లే తీసుకుంటున్నరు. ప్రజలే న్యాయ నిర్ణేతలు. CMKCR1 గుణాత్మక మార్పుకోసం ప్రజల ఎదురుచూపు మూడో ప్రత్యామ్నాయమా.. మరోటా అనేది పక్కనపెడితే ఒకటి వెరీ క్లియర్. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముంది. ప్రజలు దానికోసం ఎదురుచూస్తున్నరు. విసిగిపోయినరు. 70 సంవత్సరాలు గడిచిపోయినయి. తక్కువ సమయం కాదు. చాలా సుదీర్ఘ సమయం. అందుకే మార్పునకు శ్రీకారం చుట్టబడతది. ఇప్పటివరకు ఎవరు పాలించినరు? 70 ఏండ్లలో ఐదున్నరేండ్లు చరణ్‌సింగ్, వీపీసింగ్, జనతాదళ్, చంద్రశేఖర్, దేవెగౌడ, మొరార్జీ దేశాయి వంటి వారి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నయి. గరిష్ఠంగా ఈ ఆరు సంవత్సరాల తక్కువ సమయాన్ని మినహాయిస్తే, మిగిలిన 64 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ లేదా బీజేపీ పాలించినయి. జాతికి వాళ్లు ఏం సమాధానం చెప్తరని నేను సీరియస్‌గా డిమాండ్ చేస్తున్న. 70 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తాగేందుకు నీళ్లు లేవు. ఇది నిజం కాదా? అబద్ధమా? ఎన్ని రోజులు ఈ స్టోరీలు వింటం? దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సి ఉంది. అయితే దానిని సాధారణ భాషలో మూడో ఫ్రంట్ అని మాట్లాడుతున్నరు.

ఏమొస్తదో కాలమే నిర్ణయిస్తది. కానీ వందశాతం దేశంలో గుణాత్మక మార్పు రావాలనే దానికి నేను కట్టుబడి ఉన్న. దేశంలో ఓ ప్రశ్న వినిపిస్తున్నది. కాంగ్రెస్ పోయింది.. బీజేపీ వచ్చింది. కానీ ఏం మార్పు తెచ్చింది? ఏం జరిగింది? పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరు. రైతులకేంచేశారో చెప్పండి. ఫలానా పని చేసినమని చెప్పండి. ఎత్తి చూపించే పథకమేందో చెప్పండి. మీరు పెట్టిన కిరీటమేందో చూపండి. రైతుల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని మేం డిమాండు చేసినం. ఇప్పుడున్న ఎమ్మెస్పీకి ఓ ఐదేసి వందలు పెంచండి చూద్దాం! రేపు పార్లమెంటుల మా ఎంపీలు దీనిని డిమాండు చేస్తరు. ఇది మా ప్రధాన అజెండా. ఇప్పుడే నిర్ణయం తీసుకున్న. వడ్లకు రూ.1590 ఉంది. దానిని రూ.2100 చేయండి. ఎందుకు చేయరండి? మీదికి మాత్రం రైతులు చనిపోతున్నరు.. ఇంత మంది చనిపోతున్నరని చక్కగ మాట్లాడుతరు. ఇదా మాట్లాడేది?

పథకాల పేర్లలో తప్ప మార్పు ఏది? వీళ్లొచ్చి వాళ్లొచ్చినా, వాళ్లొచ్చి వీళ్లొచ్చినా.. పథకాల పేరు మార్పు మాత్రమే జరుగుతది. నేను 2004లో ఎంపీగా మొదటిసారి పార్లమెంటుకు పోయిన. అప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.4లక్షల కోట్లు. 14 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2018లో రూ.24లక్షల కోట్లు. అదే 2-3శాతం ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ తప్ప ఒక ప్రత్యేకమైన కృషి జరిగింది లేదు. ఇంతపెద్ద దేశాన్ని పాలించేవాళ్లం.. మనమీద చాలా బాధ్యత ఉంటది. దేశ ప్రజలు మార్పుకోసం వేచిచూస్తున్నరు. నాతోటి మాట్లాడే చాలామంది అదే అభిప్రాయం వెలిబుచ్చుతున్నరు. దశాబ్దాల తరబడి దేశాన్ని చూస్తున్న సీనియర్ పాత్రికేయులు, ఆర్థికవేత్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ.. కొత్త భావనతో దేశంలో మార్పు కోరుకుంటున్నరు. రేపు బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తది.. ఏమైనా మార్పు వస్తదా? గుణాత్మకమైన మార్పు ఏమైనా ఉంటదా? దేశంలో కొత్తగా జరుగుతదని ఏమైనా ఆశిస్తున్నరా? కేవలం పథకాల పేర్లు మారుతయి అంతే.

దేశ రాజకీయాలకు అవసరమైతే పనిచేస్తా జాతీయ రాజకీయాలకు కేసీఆర్ అవసరమైతే.. దేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తాను. దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం అవసరం. దేశ ప్రజలు పరివర్తన కోరుకుంటున్నారు. అందుకు వారిని సిద్ధంచేయాలి. గుణాత్మకమైన మార్పురావాలి. అన్ని రంగాల ప్రజలను ఆదుకోవాలి. ఈ నిమిషానికి వచ్చిన గెలుపు, ఓటములతో ఎలాంటి ప్రయోజనం లేదు. నాడు విజయ్‌మాల్యా, నేడు నీరవ్‌మోడీ పారిపోయారు అంటూ కాలం వెళ్లబుచ్చితే లాభం లేదు. దేశ రాజకీయాల్లో మార్పురావాలి. అది గుణాత్మకంగా ఉండాలి. జాతీయ రాజకీయాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రబలమైన ఆవశ్యకత ఉన్నపుడు ఎలాంటి మార్పులు జరిగాయో చరిత్రలో ఉన్నాయి. జనతా పార్టీ పుట్టడం, ఎన్నికల్లో స్వీప్‌చేయడం కేవలం 60 రోజుల్లోనే జరిగింది. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన 8, 9 నెలల్లోనే స్వీప్‌చేసింది. ఇక టీఆర్‌ఎస్ పుట్టిన 60 రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేసి, అనంతరం తన లక్ష్యాన్ని విజయవంతంగా ముద్దాడింది. ఇవి అందరి మనసులో ఉంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ప్రారంభమవుతుందో చెప్పలేం. కానీ సమయం నిర్ణయిస్తది. పని మాత్రం ఆగదు. జాతీయ రాజకీయాల గురించి వందశాతం మాట్లాడుతాం. తప్పులేదు. ఇప్పటికే ఆలోచనలు కూడా ప్రారంభమయ్యాయి. మాట్లాడేవారు మాట్లాడుతున్నారు. అది తప్పా? ఇంత పెద్ద జాతీయ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ ముసుగు వేసుకొని పోవాలా ఏంది? బాజాప్తా పోతం. దేశంకోసం పనిచేసే హక్కు మాకు లేదా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పనిచేయొచ్చు కదా!

మోదీకి నేను మంచి దోస్తును మోదీ అంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రధానిగా ఆయనను అమితంగా గౌరవిస్తాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మోదీకి నేను మంచి మిత్రుడిని. దేశంలో మందగించిన అభివృద్థికి నేను వ్యతిరేకం. అది జీర్ణించుకోలేకపోతున్నాను. గుణాత్మక మార్పులు రావడం లేదనేదే నా ఆవేదన. ఎందుకు ఇంకా నక్సలైట్లున్నారు? సామాజిక ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? దళితులు, గిరిజన గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్టలో 52, తమిళనాడులో 69, ఇంకో దగ్గర 50 శాతం రిజర్వేషన్లు.. ఎందుకు ఇంత తేడా? బీజేపీ, యూపీఏ పాలన ఏదైనా.. ఎందుకు పరిష్కారం చూపలేదు? ఎందుకు సమాన రిజర్వేషన్లు కల్పించలేదు?

కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు కేంద్రం తెలంగాణకు ఇచ్చిన మెహర్బానీ ఏం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 కింద ఆర్థికసంఘం ద్వారా నిధుల కేటాయింపు ఉంటుంది. అది అన్ని రాష్టాలకు ఉన్న హక్కు. బీజేపీ ఉన్నా.. ఎవరున్నా అది చేయాల్సిందే. దీని ప్రకారం, తెలంగాణకు అదనంగా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. నాలుగేండ్లలో మొత్తం రూ.81,362 కోట్లు వచ్చాయి. ఇదంతా రాజ్యాంగబద్ధం. తెలిసీతెలియని నాయకులు కేంద్రం నిధులిచ్చిందని అంటున్నారు. వారు చెప్పేది శుద్ధ తప్పు. వారికున్న అజ్ఞానానికి చింతిస్తున్నాను. కేంద్రం ఇచ్చిన దానికంటే మన రాష్ట్రం కేంద్రానికిచ్చిందే ఎక్కువ. దాదాపు రెండున్నర రెట్లు అందించాం. వాళ్లిస్తే మనం బతికేది ఏం లేదు. నీతి ఆయోగ్ తెలంగాణలో ప్రారంభమైన రెండు మంచి స్కీములను గుర్తించింది. భగీరథకు రూ.19వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు.. అంటే మొత్తం రూ.24 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసుచేస్తే.. 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం లేదు.

పూర్తి మద్దతు అనుకుంటే పొరపాటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది చీప్ పొలిటికల్ స్టంట్. దేశ పరిస్థితిని అది మార్చుతుందా? వ్యక్తిగతంగా మోదీ తో నాకు ఎలాంటి పంచాయితీ లేదు. రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని అంశాలకు మద్దతు ఇచ్చాను. డీమానిటైజేషన్ వస్తే బ్లాక్‌మనీ అదుపులోకి వస్తుందని, దొంగల ఆటకట్టొచ్చని భావించాను. ఇక జీఎస్టీవల్ల ట్యాక్సేషన్ పెరిగి దేశానికి మంచి జరుగుతుందని అనుకున్నాను. దళితుడిని రాష్ట్రపతిగా చేసే క్రమం లో సహకారం అందించాలని కోరితే మద్దతు తెలిపాను. ఇలా అంశాలవారీగా మద్దతు ఇచ్చాను. కానీ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపామని అనుకుంటే పొరపాటే.

చైనా స్ఫూర్తి మనకెందుకు సాధ్యంకాదు? 1976 వరకు చైనాలో మావో బతికి ఉన్నంతవరకు రెండుసార్లు తీవ్ర కరువు వచ్చింది. మొత్తం 15 లక్షల మంది చనిపోయినరు. చైనాలో వ్యవసాయ అనుకూల భూమి మన దేశంలోకంటే తక్కువ. జనాభా మనకంటే ఎక్కువ. గత 20-28 ఏండ్లలో చైనాలో ఎంత మార్పు వచ్చింది? అక్కడేమైనా బంగారం తింటున్నరా? హిమాలయాలకు వాళ్లు అవతలివైపు, మనం ఇవతలివైపు. ఇప్పుడు ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో ఆర్థిక శక్తిగా చైనా ఉన్నది. విదేశీ మారక నిల్వల్లో ప్రపంచంలో చైనా నంబర్‌వన్. అదెలా సాధ్యమైంది? అక్కడ ఉన్నోళ్లు మనుషులే. అది ఆసియా ఖండంలోనే ఉన్నది. కాకపోతే అవసరమైన చట్టాలు, మార్పులు చేసుకున్నరు. 25-30 ఏండ్లలో ఇంత ప్రబలమైన శక్తిగా బలపడ్డరు. అది మనకెందుకు సాధ్యం కాదు? మనం మనుషులమేకదా!

అసలు దేశంలో కరువు ఎట్ల ఉంటది? దేశంలో ఉన్న నీళ్లను 30-35 శాతమే వాడుకుంటమా? కరువు కాటకాలొస్తయి.. నార్తర్న్ చైనాకు సౌత్ చైనా నుంచి 2400 కిలోమీటర్లు తీసుకువెళ్లి 1600 టీఎంసీలు ఇస్తున్నరు. మనకు లేకనా? బ్రహ్మపుత్ర, గంగానదిలో 40వేల టీఎంసీలు ఉన్నయి. దేశంలో కరువు ఎట్ల ఉంటది? ఎందుకు ఉండాలి? దేశంలో ఆ పని ఎందుకు జరుగతలేదు? సాగునీళ్లురావు. తాగునీళ్లురావు. కరంటు ఉండదు. ఉత్పత్తి అయిన కరంటును దేశం వాడుకోజాలదు. అవసరమైన చట్టాలు మార్చాలి. జాతీయస్థాయిలోనైతే చట్టం, రాజ్యాంగ మార్చవచ్చు. ఈ రోజు అది జరుగుతలేదు.

దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాలి ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతున్నా. థర్డ్‌ఫ్రంట్ అంటరో.. మరో ఫ్రంట్ అంటరో లేక మెయిన్ ఫ్రంట్ కూడా కావొచ్చు. భారత రాజకీయ పరివర్తనలో మార్పు తీసుకరావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నాకు వ్యక్తిగత మిత్రుడు. ఆయనతో కలిశా. మాట్లాడా. రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్పు విషయంలో నాయకత్వం వహించాల్సి వస్తే తప్పక ఆలోచిస్తా. జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించే అవకాశం వస్తే తెలంగాణవాదులంతా గర్వపడాలి. 1999 నుంచి తెలంగాణ సాధించాలనే తపన ఉంది. 2001 నుంచి బయటికి వచ్చి పోరాడినం. టీఆర్‌ఎస్ ఏర్పడిన మొదటి ఏడాదే స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌చేశాం. 14 ఏండ్లకు తెలంగాణ సాధించాం. తెలంగాణలో ప్రజలందరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు తప్ప ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. తెలంగాణ శాంతియుతంగా ఉంది. ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని ఎవ్వరు వచ్చినా.. ప్రపంచనేతలు, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు.. ఎవ్వరు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. తెలంగాణలో ప్రజలకు ఏ ఇబ్బంది లేదు. ఆరోగ్యం సహకరించి, భగవంతుడి ఆశీస్సులు ఉంటే దేశ రాజకీయాల్లో ప్రబలమైన మార్పు తీసుకొచ్చేందుకు కృషిచేస్తా. త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పార్టీ అంతర్గత వ్యవహారం అమరవీరుల కుటుంబాలను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక అనేది టీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. దీనిని విలేకరులకు చెప్పడం పద్ధతికాదు. అమరవీరులకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. అమరవీరుల గురించి మాట్లాడేది కాంగ్రెసా?! అమరవీరుడి తల్లి శంకరమ్మను ఓడగొట్టిందే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆనాడు ఎన్నికల్లో ఈ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎట్లా డబ్బులు పంచిండో తెలంగాణ ప్రజలు చూసిండ్రు. శంకరమ్మను ఓడించేందుకు డబ్బులు పంచింది, కారు బాయ్‌నెట్‌లో డబ్బులు తరలించింది ఈ మహానుభావుడే కదా! రాజ్యసభ సీటుకు పోటీ పెడతామని కాంగ్రెస్ చెప్పడం విడ్డూరం. టీఆర్‌ఎస్‌కు మూడు సీట్లు గెలిచే సంపూర్ణ మెజార్టీ ఉన్నది. కాంగ్రెస్‌కు మెజార్టీ లేనప్పుడు పోటీ పెడుతామనపడం కాంగ్రెస్‌వాళ్ళ ఫ్రస్టేషన్. అది ఏ స్థాయిలో ఉన్నదో ప్రజలు అర్థం చేసుకోవాలి. గెలిచే అవకాశం ఉంటేనే పోటీచెయ్యాలి. లేకుంటే చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమి చేసిండో.. ఏమి జరిగిందో అందరూ చూసిన్రు.

వంచన నుంచి ప్రజలు బయటపడాలనేది నా తపన ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. తమాషా చేస్తున్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తారో.. ఇవ్వరో కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఏపీ ప్రజలు ఆవేదనలో ఉన్నారు. ప్రజలను వంచిస్తున్నారు. వంచన నుంచి ప్రజలు బయటపడాలనేది నా తపన. చెప్పింది చెయ్యాలి. నేను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతా. రాజకీయాల్లో ప్రబలమైన మార్పు కోసం 100 శాతం నావంతు కృషి చేస్తా.

పదేండ్లలో జరుగనిది నాలుగేండ్లలో! పదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కు పెట్టిన పెట్టుబడి వ్యయం రూ.1.19 లక్షల కోట్లు. అదే నాలుగేండ్లలో టీఆర్‌ఎస్ హయాంలో పది జిల్లాలకు పెట్టిన పెట్టుబడి రూ.1.19 లక్షల కోట్లు. ఇప్పుడు సంక్షేమం.. అభివృద్ధి జరుగుతున్నది. పదేండ్ల కాంగ్రెస్ హయాంలో 23 జిల్లాలకు జరిగింది ఇప్పుడు నాలుగేండ్లలో పది జిల్లాలకు జరిగింది. ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. మా పథకాలన్నీ గోప్యంగా ఉండేవి కావు. ప్రజలకు తెలుస్తయి. మిషన్ భగీరథతో నాకే నల్లా వస్తది. 24 గంటల కరంటు నాకే బాయిదగ్గర, ఇంటిదగ్గర వస్తది. కళ్యాణలక్ష్మి నాకే వచ్చే. కేసీఆర్ కిట్ నా బిడ్డకే వచ్చే. ఎవరన్న చెప్పాల్న? గురుకుల పాఠశాల పెడితే మా పిల్లగాడే, మా బిడ్డనే చదువుకొనే. ఇలా టీఆర్‌ఎస్ డిజైన్ చేసిన ప్రతిఒక్క స్కీం కూడా ప్రజల అనుభవంలో ఉన్నది.

ప్రధానమంత్రిని నేను ఆ మాట అనలేదు గత నాలుగు రోజులుగా నేను టౌన్‌లో లేను బయట ఉన్నా. కొన్ని చిత్రవిచిత్రమైన విషయాలు వింటున్నా. ఆదిలాబాద్, కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రినో, మరొకరినో నేను తూలనాడినట్టు మాట్లాడుతున్నారు. అది వందశాతం శుద్ధతప్పు. దాన్ని నేను ఖండిస్తున్నా. నేను అననిదాన్ని అన్నట్టుగా చిత్రీకరించారు. నేను కూడా టేప్ తెప్పించుకొని విన్నాను. నేను అందులో ప్రధానమంత్రి గారికి అని, మోదీ గారికి అని స్పష్టంగా చెప్పిన, దాన్ని నేను గాడికి అన్నట్టుగా వారు (బీజేపీ వాళ్లు) చెప్తున్నారు. అది వాళ్ల ఖర్మ. ప్రధానమంత్రిని మేమే కించపర్చుకుంటాం అని బీజేపీ వాళ్లు అనుకుంటే నేను చేసేది ఏమీలేదు. నేను మాట్లాడిన కాంటెక్ట్స్ వింటే ప్రతి ఒక్కరికీ అర్థమైతది. అక్కడ నేను ఆ మాట అనాల్సిన కాంటెక్ట్స్ లేనే లేదు. రెండో విషయం ఇతరత్రా కొన్ని లేనిపోనివి చేసి అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. అది మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.

నేను వాడు, వీడు అని పదజాలం వాడిన, అయితే అది మోడీగారిని కాదు. నేను మళ్లీ టేపులు తెప్పించి చూశా. రెండు కాంటెక్ట్స్‌ల్లో మాట్లాడిన. ఒక సందర్భంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, బీజేపీ అధికారంలోకి వచ్చినా.. ఒరిగేది ఏం లేదు. 70 ఏండ్లలో వీళ్లు చేసింది ఏమీ లేదు. ఇదే పాతచింతకాయ పచ్చడి తప్ప వచ్చేది ఏం లేదని చెప్పిన. ఐ స్టాండ్‌బై మై వర్డ్స్. ఆ విషయంలో నా వైఖరిలో మార్పు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాట్లాడినప్పుడు వాడు, వీడు అని మాట్లాడిన. 30 ఏండ్ల నుంచి నేను ఇక్కడే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నా అని చెప్పిన. ప్రతిపక్షంలో ఉన్నాను. అధికారంలో ఉన్నాను. టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌వాడు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీవాడు వరి కంకులు, కందిళ్లు తీసుకుని అసెంబ్లీకి తెచ్చిండ్రు. వీడు అధికారంలో ఉంటే వాడు తెచ్చిండు, వాడు అధికారంలో ఉంటే వీడు తెచ్చిండు. కానీ పల్లెల్లో కరంటు తెచ్చింది గులాబీ జెండావాడు మాత్రమే అని చెప్పిన. అంతకుమించి నేను ఎవరినీ దూషించలేదు. దూషించే అలవాటు నాకు లేదు.

బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రధానమంత్రినే విమర్శిస్తారా? అని అంటున్నారు. రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా ప్రధానమంత్రిని విమర్శించొద్దని! ఇది ప్రజాస్వామ్యం. అవసరమైతే దేశంలో ఎవరినైనా విమర్శించే అవకాశం ఇస్తది ప్రజాస్వామ్యం. రెండోది.. ఓ బీజేపీ ఎమ్మెల్యే మాట్లడుతరు.. కేసీఆర్‌కు జైలుకు పోవాలని ఉందా? అని అంటే ఏం అన్నట్టండి? అంటే జైలుకు పంపిస్తారా? దేశంలో మాట్టాడినోళ్లందర్నీ జైలుకు పంపిస్తరా? ఏం రాజకీయం ఇది? వీళ్లు ఏమన్నా తానీషాలా? ఎవర్నైనా సరే, మేం ఏదో చేయగలం అని అనుకుంటే సరికాదు. కొన్ని సందర్భాల్లో కొందర్ని ముట్టుకుంటే భస్మం అయితరు. నాకు ఉన్నదేంది.. నేను జైలుకు పోయేదేంది? కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని మేం అద్భుతమైన పాలన సాగిస్తున్నాం. ఈ ప్రధానమంత్రిగారే పదిసార్లు కితాబిచ్చారు. దేశంల అందరు కరంటు ప్రైవేటువాళ్ల దగ్గర కొంటుంటే, కేసీఆర్.. బీహెచ్‌ఈఎల్ కే కరంటు ఇచ్చిండని ప్రధానమంత్రే ప్రశంసించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.