Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అవినీతిని సహించం

-గత ప్రభుత్వాల మకిలి మనకొద్దు.. ప్రభుత్వ పథకాలకు మీరే సారథులు -అర్హులకే ఇండ్లు.. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై నేడు మార్గదర్శకాలు -ఇండ్ల మంజూరు అధికారం మంత్రులు, ఎమ్మెల్యేలకు చెరిసగం! -ప్రాజెక్టుల నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్ల కోసం రూ.5.04 లక్షలు -వాటర్‌గ్రిడ్‌కు అడ్డంకులు తొలగించేందుకు కఠినంగా వ్యవహరించండి -ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణలో వేగం పెంచండి: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్

KCR-review-meet-with-District-collectors-and-SP's

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడటంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా కలెక్టర్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం ఒక్క ఏడాదిలో నిర్మించిన ఇండ్లలోనే రూ.5వేల కోట్ల అవినీతికి పాల్పడిందని చెప్పారు.

ఇప్పుడు అలాంటి అక్రమాలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకటిన్నర సంవత్సరాల కాలం ముగిసింది. ప్రధాన పథకాలను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచి, తెలంగాణ రాష్ట్ర ఫలాలను ప్రజలకు అందించాల్సిన సమయమిది. అందుకే ప్రతి పథకం, సంక్షేమ కార్యక్రమంకూడా అట్టడుగున ఉండే లబ్ధిదారులకు చేరేలా ప్రగతిరథాన్ని మీరే ముందుకు తీసుకెళ్లాలి. దానికి మీరే సారథులు అని కలెక్టర్లకు సీఎం సూచించారు.

మధ్యాహ్నంనుంచి రాత్రివరకు సుమారు ఆరున్నర గంటలపాటు నిర్వహించిన సమావేశంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంతోపాటు నీటిపారుదల ప్రాజెక్టులు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్ల నిర్మాణం, పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, మిషన్ కాకతీయ రెండోదశ, హరితహారం తదితర పథకాలపై కూడా చర్చించారు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది.. ఎలా చేయాలనుకుంటున్నది.. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నది.. అనే అంశాలపై కలెక్టర్లకు సీఎం స్పష్టంగా వివరించారు. అదే సమయంలో తన మంత్రివర్గ సహచరులకు కూడా వారి బాధ్యతలపై స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, అన్నిశాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు.

గత ప్రభుత్వాల మకిలి మనకొద్దు.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లపై ఈ సదస్సులో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో గృహనిర్మాణశాఖ పనితీరు, ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలను సీఎం ఉటంకించారు. గత ప్రభుత్వం ఒక్క ఏడాదిలో నిర్మించిన ఇండ్లలోనే రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, ఇప్పుడు అలాంటి అక్రమాలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వాల మకిలి మనకొద్దని, నిజమైన లబ్ధిదారులకే ఇండ్లు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటివాటిలో వేగం పెంచాలని సూచించారు. రెండో విడత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పథకం అమలులో అడ్డంకులను తొలగించేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడేందుకు హరితహారం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. గతంలోలాగా మొక్కలు నాటి ఎండబెట్టడం కాకుండా, నాటిన మొక్కను కచ్చితంగా కాపాడాలని, అవసరమైతే అగ్నిమాపక శకటాల ద్వారా మొక్కలకు నీళ్లు అందివ్వాలని కూడా స్పష్టంచేశారు.

దళితులకు మూడు ఎకరాల భూమి, జీవో 59, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క- సారలమ్మ జాతర తదితర అంశాలపై కూడా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సమస్య పరిష్కారంలో అవసరమైతే ఉదారంగా వ్యవహరించాలని (భూసేకరణలో భూమి కోల్పోయినవారికి), అలాగే వాటర్ గ్రిడ్ పైపులైన్ల నిర్మాణానికి ఎవరు ఒప్పుకోకపోయినా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

పేదల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఇండ్ల నిర్మాణం పేదల పక్కా ఇంటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ పథకంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 60వేల ఇండ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించే ఇండ్లలో 50శాతం జిల్లా మంత్రులు, మిగిలిన 50శాతం ఎమ్మెల్యేలకు మంజూరీ అధికారాలు అప్పగించారు. ఇప్పటి వరకు పేదలకు గృహాలను ఊరికి దూరంగా విసిరేసినట్లుగా నిర్మించారు. డబ్బాల్లా నిర్మించిన ఆ ఇండ్లలో ఎవరూ నివాసం ఉండటం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే గృహనిర్మాణాలు పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉండాలి. ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 400 ఇండ్లు నిర్మించాలి. వచ్చే ఏడాదినుంచి ఈ సంఖ్యను పెంచుకుంటూ పోతాం. గృహనిర్మాణ కార్యక్రమంలో కలెక్టర్లు చాలా కీలకంగా పనిచేయాలని కోరుతున్నా. ఒక కుటుంబానికి ఒకసారి ఇల్లు కట్టించామంటే అది రెండు తరాలకు ఉపయోగపడాలి. అందుకే ఎక్కువ వ్యయం అవుతున్నా రెండు బెడ్‌రూమ్‌లు, హాల్, కిచెన్, రెండు బాత్‌రూమ్‌లు ఉండేలా డిజైన్లు రూపొందించాం అని తెలిపారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామంలో నిర్మిస్తున్న గృహాల నమూనాలను ఈ సందర్భంగా అధికారులకు చూపించారు.

గ్రామాల్లో 36వేలు.. పట్టణాల్లో 24వేల ఇండ్లు ఈ ఏడాది నిర్మించే 60 వేల ఇండ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 36 వేలు, పట్టణ ప్రాంతాల్లో 24 వేలు నిర్మిద్దామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇండ్ల నిర్మాణం కోసం స్థలాలను సేకరించాలని, గృహాలను కాలనీలుగా నిర్మించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఖర్చు వందశాతం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

గృహ నిర్మాణానికి ఇసుక తెచ్చుకోవడానికి సులభంగా అనుమతి వచ్చేలా చూడాలని, నిబంధనలు నెపంగా చూపి పేదల గృహ నిర్మాణాలను ఆపవద్దన్నారు. అవసరమైతే మినహాయింపులు కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే మంజూరైన ఇండ్ల పట్టాలు, గృహ లబ్ధిదారుల వివరాలను సేకరించాలని ఆదేశించారు. మండల కేంద్రాలు, పట్టణాలకు 5 కిలో మీటర్ల పరిధిలో ప్రభుత్వ భూమిని వాడ వద్దనే నిబంధనను సవరిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమిని గృహనిర్మాణం కోసం ఉపయోగించాలని సూచించారు.

గృహనిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గృహనిర్మాణ కార్యక్రమం గతంలో అవినీతికి మారుపేరుగా మారింది. ఒక ఏడాదిలోనే రూ.5 వేల కోట్ల అవినీతి జరిగింది. 300 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. కొందరు జైలుకు వెళ్లారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రావద్దు. చాలా జాగ్రత్తగా పని చేయాలి. లబ్ధిదారుల ఎంపికలో అర్హులనే గుర్తించాలి. ఈ విషయంలో తహశీల్దార్లు ఇచ్చే సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి. తప్పు దొర్లితే శిక్ష తప్పదు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సూపర్‌చెక్ చేయాలి. ఈ ఏడాది ఇండ్ల నిర్మాణంలో వచ్చే అనుభవాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్‌లో పకడ్బందీగా పథకాన్ని అమలు చేయాలి అని సీఎం ఆదేశించారు.

నేడు మార్గదర్శకాల విడుదల..! డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకానికి ప్రభుత్వం సిద్ధం చేసిన మార్గదర్శకాలపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో లోతుగా చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన సాంకేతికాంశాల ప్రకారం ఇండ్లను నిర్మించగలిగే సామర్థ్యం ఉన్న సంస్థల జాబితాను సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సంస్థలైతే కాలనీల లే అవుట్లు, ఇండ్ల నిర్మాణం తదితర అంశాలు బాగుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కలెక్టర్ల అభిప్రాయాలను కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకం మార్గదర్శకాలు బుధవారం విడుదలచేసే అవకాశం ఉంది.

దళితులకు భూమి కొనివ్వండి దళితులకు మూడెకరాల భూ పంపిణీ విషయంలో అధికారులు మరింత చొరవ చూపాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసలు భూమి లేని వారికి మూడెకరాల భూమి కొనివ్వాలి. కొంత భూమి ఇప్పటికే ఉన్నవారికి మిగతా భూమి కొనివ్వాలి. భూగర్భజలాలున్న భూములే కొనాలనే నిబంధనను తొలగించాలి. దళితులకు భూమి కొనిచ్చే విషయంలో ఇబ్బందికరంగా ఉన్న నిబంధనలను మార్చండి. గిరిజన ఉప ప్రణాళిక నిధుల ద్వారా ఎస్టీలకు కూడా వ్యవసాయ భూమి సమకూర్చాలి. ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్‌ను కూడా మరింత పటిష్ఠంగా, ఎక్కువ మందికి ఉపయోగ పడే విధంగా అమలు చేయండి అని కలెక్టర్లు, ఇతర అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

స్థలాల క్రమబద్ధీకరణలో వేగం పెరగాలి జీవో 58, 59 ద్వారా ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, పట్టాల పంపిణీ కార్యక్రమాలను వేగంవంతం చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామజ్యోతి కార్యక్రమంద్వారా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయండి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు చెత్త సేకరణ కోసం 25 వేల రిక్షాలు అందిస్తాం. చేంజ్ ఏజెంట్లతో కలెక్టర్లు నిరంతరం సమావేశాలు నిర్వహించాలి అని సూచించారు.

శాంతి భద్రతల పర్యవేక్షణతోపాటు సామాజిక మార్పులలో కూడా పోలీసులు భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండేలా ప్రజలను చైతన్య పరచాలని, వందశాతం మరుగుదొడ్లు ఉండే విషయంలో ఎమ్మెల్యేలలో మంత్రులు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయంలో సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం సూచించారు.

వాటర్ గ్రిడ్ పైప్‌లైన్లకు రైట్ ఆఫ్ వే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందించేందుకు చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం పనులను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులు వేగంగా పూర్తి చేయాలి. ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నాయి. పైప్‌లైన్లు వేయడానికి రైట్ ఆఫ్ వే చట్టాన్ని వినియోగించుకోవాలి.

ప్రాజెక్టు పూర్తికావద్దనే ఉద్దేశంతో కొందరు తమ భూముల్లోంచి పైప్‌లైన్లు వేయవద్దని అడ్డుకుంటున్నారు. 1.6 మీటర్ల లోతున పైప్‌లైన్ వేస్తున్నందున ఎవరూ పైప్‌లైన్ నిర్మాణం అడ్డుకోకుండా కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. పైప్‌లైన్లు 13,550 చోట్ల రైల్వేలైన్లు, రహదారులు, కాలువలను దాటాల్సి వస్తున్నది. రైల్వేలు, నేషనల్ హైవేల విషయంలో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. మిగతాచోట్ల అధికారుల మధ్య కలెక్టర్లు సమన్వయం కుదర్చాలి అని సూచించారు.

నిర్వాసితులకు వెంటనే చెల్లింపులు నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూమిని సేకరించే విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూసేకరణలో జాప్యం నివారించడం కోసం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. నీటిపారుదల ప్రాజెక్టులు చాలా ఆలస్యంగా పూర్తికావడానికి ప్రధాన కారణం భూసేకరణలో ఆలస్యమే. భూసేకరణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులపై ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలి. రైతుల భూమికి, పశువుల కొట్టానికి వెలకట్టి ఒకేసారి డబ్బులు చెల్లించి భూమిని సేకరించాలి.

నీటిపారుదలశాఖకు బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తున్నందున డబ్బుల సమస్యలేదు. ప్రాజెక్టులవల్ల నిర్వాసితులైనవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.5.04 లక్షలు ఇవ్వాలి అని అధికారులను సీఎం ఆదేశించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, అదిలాబాద్ జిల్లాల్లో ప్రాజెక్టుల కోసం భూసేకరణ వేగంగా జరగడం పట్ల కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

డిసెంబర్ 31లోపు రెండోదశ మిషన్ కాకతీయ ఈ ఏడాది మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు డిసెంబర్ 31లోగా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వర్షాలు పడని ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని, ఫేజ్-1 ద్వారా మొదలు పెట్టిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఫేజ్-2 కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఫీడర్ చానళ్ల మరమ్మత్తులు చేపట్టాలి. చెరువులు కబ్జాకు గురికాకుండా కఠిన చట్టాలు తెస్తాం. చెరువుల కింద ఆయకట్టు నిర్ధారించడానికి సర్వేలు నిర్వహించండి అని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.