-పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ -గుజరాత్ ఐహబ్కు వీహబ్ సహకారం -ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం -ఇన్నోవేషన్ రంగానికి మరింత ఊతం -240 మహిళా స్టార్టప్‌లకు చేయూత

దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అద్భుత పథకాలను అధ్యయనం చేసేందుకు చాలా రాష్ట్రాలు ఇక్కడకు పరుగులు తీస్తున్నాయి. పథకాల అమలుతీరును పరిశీలించి.. ఆయా రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రం సైతం తెలంగాణ మద్దతు కోరింది. మహిళా ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన వీ-హబ్‌తో గుజరాత్ ఐ-హబ్ అవగాహన ఒప్పందం చేసుకున్నది.
ఇన్నోవేషన్ రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతున్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇన్నోవేషన్ రంగంలో.. ప్రత్యేకించి వీ-హబ్ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వీ-హబ్ ద్వారా అనేక స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. మహిళా ఇన్నోవేషన్ బలోపేతానికి తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్, గుజరాత్‌లోని ఐ-హబ్ మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి కేటీఆర్, గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమ, శిశు సంక్షేమ, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి విభావరి బెన్ దవే సమక్షంలో ఇరు రాష్ట్రాల సీనియర్ అధికారులు జయేశ్‌రంజన్, అంజుశర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వర్చువల్ విధానంలో నిర్వహిం చిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘2017 నవంబర్‌లో మేము మహిళా ఔత్సాహిక యువత కోసం వీ-హబ్ పేరిట ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటుచేశాం. తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న విజన్, నిబద్ధత చాలా మందికి అప్పుడు అర్థంకాలేదు. మూడేండ్లుగా అనేకమంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్‌లకు ప్రభుత్వం నుంచి చేయూత అందింది. ఇరు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం ద్వారా ఈ రంగంలో మరింత అద్భుత ప్రగతిని సాధిస్తామన్న విశ్వాసం ఉన్నది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు రాష్ట్రాలకు చెందిన మహిళా స్టార్టప్‌లకు తగిన గుర్తింపు లభిస్తుంది. అవి మరింత ప్రగతి సాధిస్తాయి. ఈ ఒప్పం దం నిజమైన ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో.. సామర్థ్యమే ప్రామాణికంగా మహిళా ఇన్నోవేషన్ మరింత ముందుకుపోతుంది. దేశంలో ముందువరుసలో ఉన్న రెండు చురుకైన రాష్ర్టాలు (తెలంగాణ, గుజరాత్) మహిళా ఇన్నోవేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయడం చరిత్రలో నిలిచిపోతుంది. ఇరు రాష్ర్టాల అనుభవాలు, నాలెడ్జ్.. దేశ ఇన్నోవేషన్రంగానికి మరింత ఊతాన్నిస్తాయి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

పూర్తి సహకారం దేశంలోనే తొలిసారి మహిళా ఇన్నోవేషన్ రంగంలో రెండు కీలక రాష్ట్రాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల్లోని మహిళలు నడిపే స్టార్టప్‌లకు ప్రీ ఇంక్యుబేషన్, ఇంక్యుబేషన్, పాలసీ స్టేక్హోల్డర్లతో అవసరమైన సంప్రదింపులకు సంబంధించి అన్ని విధాలా మద్దతు లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఒప్పందంలో భాగస్వాములైనందుకు వీ-హబ్‌కు గుజరాత్ మంత్రులు అభినందనలు తెలిపారు. ఒప్పందం ద్వారా దేశంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారుచేసే దిశగా కార్యాచరణ ఉండబోతుందని గుజరాత్ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి అంజు శర్మ చెప్పారు.
వీ-హబ్ అనుభవంతో ముందుకు మూడేండ్లుగా వీ-హబ్ దాదాపు 3,500 మం ది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పనిచేసిందని సీఈవో దీప్తి రావుల తెలిపారు. 11 స్టార్టప్ ప్రోగ్రాంలను పూర్తిచేసిందని, 148 స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయడంలో విజయం సాధించిందని చెప్పారు. ఇన్నోవేషన్రంగంలో వీ-హబ్‌కు సమకూరిన అనుభవాన్ని, జ్ఞానాన్ని గుజరా త్ ఐ-హబ్‌కు అందిస్తామన్నారు. మహి ళా ఇన్నోవేషన్‌కు భారత్‌ను అంతర్జాతీయ రాజధానిగా మార్చేందుకు ఇలాంటి భాగస్వామ్యాలు ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఒప్పందంతో చేయూత తెలంగాణ వీ-హబ్, గుజరాత్ ఐ-హబ్ మధ్య ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాలకు చెందిన ఎడ్యుటెక్, మెడిటెక్, ఫిన్‌టెక్ వంటి రంగాల్లోని సుమారు 240 మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ఎంచుకుంటారు. వారి స్టార్టప్‌లకు చేయూతను అందిస్తారు. ప్రత్యేకించి అవి మరింత మూలధనాన్ని అందుకునేలా ఒప్పంద కార్యాచరణ ఉంటుంది. మూడు నెలలపాటు ప్రీ ఇంక్యుబేషన్ ద్వారా శిక్షణ ఇస్తారు. స్టార్టప్‌లకు వీ-హబ్, ఐ-హబ్ అన్ని రకాలుగా మద్దతు అందిస్తాయి.