-కూటమికి సిద్ధాంతాలు తక్కువ.. రాద్ధాంతాలు ఎక్కువ -ఛీకొట్టినా గాంధీభవన్ దగ్గర కోదండరాం పడిగాపులు -కాంగ్రెస్ నాడు ఉద్యమానికి, నేడు అభివృద్ధికి దూరం -విజయ్ మాల్యా అనుచరులకు బీజేపీ టికెట్లు -ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ పార్టీ ఖాళీ -నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు -టీఆర్ఎస్లో చేరిన సంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు
ఏపీ సీఎం చంద్రబాబు పెత్త నం తెలంగాణలో చెల్లదని.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ది అవకాశవాద కూటమి అని నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. ఈ పార్టీలకు సిద్ధాంతాలు తక్కువ.. రా ద్ధాంతాలు ఎక్కువని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తే తీవ్ర సంక్షోభమే వస్తుందని చెప్పారు. బీజేపీ రియల్టర్లు, పెట్టుబడిదారుల పార్టీగా మారిందని.. విజయ్‌మాల్యా అనుచరులకు ఆ పార్టీ టికెట్లు ఇస్తున్నదని విమర్శించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, తెలుగుప్రజలపై ఢిల్లీ పెత్తనం చెల్లదని అన్నా రు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే.. చంద్రబాబు ఆ పార్టీ తో పొత్తుపెట్టుకొని ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబుతో కోదండరాం అంటకాగడం సిగ్గుచేటన్నారు.
సీట్ల కేటాయింపు కోసమే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కూటమి పార్టీలు.. అధికారంలోకి వస్తే తెలంగాణను ఏం ఉద్ధరిస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఛీకొడుతున్నా రెండుసీట్లయినా ఇవ్వండంటూ కోదండరాం గాంధీభవన్ మెట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నాడు ఉద్యమానికి, నేడు అభివృద్ధికి దూరమని మండిపడ్డారు. సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి టీఆర్ఎస్లో చేరికతో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ పూర్తిగా ఖాళీ అయిందని హరీశ్‌రావు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పిన అమిత్‌షా, బీజేపీకి 70 సీట్లు వస్తాయన్న పరిపూర్ణానందస్వామి ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే ఆ పార్టీ నుంచి రోజుకొక నాయకుడు బయటకువెళ్లిపోవడంతో ఖాళీ కనిపిస్తుందని ఎద్దేవాచేశారు. మనపై కత్తులు దూస్తున్న కూటమిని తెలంగాణ ప్రజలంతా ఏకమై పత్తాలేకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ను గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బీజేపీలో 28 ఏండ్లపాటు పనిచేశానని, కానీ సామాన్యులకు ఆ పార్టీలో గుర్తింపు లేదనిచెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎం శ్రీనివాస్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, నరహరిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, రాధాబాయి, లక్ష్మి, మాణిక్యం, మనోహర్‌గౌడ్, సువర్ణ, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాబుది రెండుకండ్ల సిద్ధాంతం.. రాహుల్‌ది కన్నుకొట్టే రాద్ధాంతం సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: కుట్రలు, కుయుక్తులతో ఏర్పడిన మహాకూటమికి తెలంగాణ ప్రజల చేతుల్లో మహాఓటమి తప్పదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. డిసెంబర్ 11 తరువాత కూటమి కట్టిన పార్టీలు, నాయకులు జాడలేకుండా పోవడం ఖాయమన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ఇప్పటివరకు ఢిల్లీకే గులాంగిరి చేసిన కాంగ్రెస్ నాయకులు ఇక మీదట అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదని ఎద్దేవాచేశారు. మహాకూటమిలో టిక్కెట్ల పంపకాలను రాహుల్‌గాంధీ.. చంద్రబాబుకు అప్పగించారని, ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ టిక్కెట్ల కేటాయింపును ఈ నెల 9కి వాయిదా వేశారని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం తలపెడుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్ ఏ విధంగా పొత్తుపెట్టుకుంటుందని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్‌కు, ఇటు టీడీపీకి ఒంటరిగా పోటీచేసే దమ్ము లేకనేఅపవిత్ర పొత్తులు పెట్టుకుంటున్నాయన్నారు.
చంద్రబాబుది రెండుకండ్ల సిద్ధాంతం, రాహుల్‌ది కన్నుకొట్టే రాద్ధాంతమని, ఈ ఇద్దరూ తెలంగాణాకు అవసరం లేదని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు. అన్నివర్గాల ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటున్న సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని హరీశ్‌రావు అన్నారు. స్థానికంగా ఉండకుండా నెలకో రెండునెలలకోసారి వచ్చిపోతున్న గీతారెడ్డికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నియోజకవర్గానికి రారు, ఇంటికెళితే తలుపులేసి ఉంటాయని, ఇలాంటి వారితో ప్రజాసమస్యలు పరిష్కారం కావన్నారు. స్థానికుడు, సౌమ్యుడు మాణిక్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జహీరాబాద్ బైపాస్ రోడ్డులోని ఇందిర ప్రసన్న వెంచర్ నుంచి బస్టాండ్ వరకు బైకులతో టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్‌రావు, మాజీఎమ్మెల్యే చెంగల్ బాగన్న పాల్గొన్నారు.