
-ఆంధ్రకు వరాలు కురిపించేందుకు తెలంగాణలో మీటింగా? -తెలంగాణ ప్రజలను గాయపర్చిన సోనియా వ్యాఖ్యలు -కూటమి ముసుగులో తెలంగాణలో పాగాకు చంద్రబాబు కుట్ర -టీఆర్ఎస్తో వెలుగులు.. కాంగ్రెస్‌తో చీకటి -తుమ్మిళ్ల మాదిరిగానే గట్టు పూర్తిచేస్తాం -ఆత్మకూరు రోడ్‌షో, మక్తల్, ధరూర్ సభల్లో మంత్రి హరీశ్‌రావు
ఆంధ్ర సీఎం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును కాంగ్రెస్ ఎన్నికల సభలో సోనియాగాంధీ చదివారని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తున్నదన్న భయంతోనే సోనియాగాంధీకి దుఃఖం పొంగుకువస్తున్నదని ఎద్దేవాచేశారు. ప్రజలకు ఎన్నో మంచి పనులుచేస్తున్న కేసీఆర్ వంటి వ్యక్తి తమ పార్టీలో లేడన్న బాధ కూడా సోనియాలో కనిపించిందన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు అనంతరం వనపర్తి జిల్లా ఆత్మకూరు రోడ్‌షోలో, మక్తల్‌తోపాటు జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ఆశీర్వాదసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్లు ఆయన మాట్లాడారు. తెలంగాణను చూస్తే సోనియాగాంధీకి దుఃఖమెందుకు వస్తున్నదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొన్న తర్వాత అధికారాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనతను సాధించారన్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రశంసలు లభిస్తుంటే.. సోనియాగాంధీ మాత్రం మేడ్చల్ బహిరంగసభలో తెలంగాణను చూస్తుంటే దుఃఖం వస్తుందనడం ఒక రకంగా తెలంగాణ ప్రజల హృదయాలను గాయపర్చడమే అన్నారు.
సోనియాగాంధీ తమ పార్టీ తెలంగాణకు ఏమి చేస్తుందో చెప్పకుండా.. ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించడంపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో చంద్రబాబు అవసరమైతే తెలుగు ప్రజలను కలిపేసత్తా తనకు ఉన్నదంటూ మాట్లాడిన సందర్భాలను మంత్రి గుర్తుచేశారు. ఆంధ్రాకు వరాలు కురిపించేందుకే సోనియాగాంధీ తెలంగాణకు వచ్చినట్టు ఉన్నదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల సభ అమరావతిలో ఏర్పాటుచేసుకున్నట్టుగా ఉన్నదని ఛలోక్తి విసిరారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టిన చంద్రబాబు మళ్లీ కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాలో లాఠీ పట్టుకుని కూటమి అభ్యర్థి దయాకర్‌రెడ్డి స్వయంగా ఉద్యమకారులపై దాడులకు పాల్పడిన విషయం మరువద్దన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేస్తే తెలంగాణ చీకటిమయం అవుతుందని, వెలుగుల తెలంగాణకోసం టీఆర్ఎస్కు ఓటువేసి కేసీఆర్‌ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.
వద్దు, రద్దు.. వాళ్ల నినాదాలు వద్దు, రద్దు.. ఈ రెండు డిమాండ్లతో వస్తున్న కూటమి పార్టీలకు తగిన బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను ఆపుతామని కోమటిరెడ్డి చెప్తే.. మరో నాయకుడు సమన్వయ సమితులను రద్దుచేసి రైతుబంధును నిలిపివేస్తామంటున్నాడని, ఇంకొక నాయకుడు డ్రంకన్‌డ్రైవ్‌ను రద్దుచేస్తామని చెప్తున్నారని మంత్రి ఉదహరించారు. తప్పిజారి కాంగ్రెస్‌కు ఓటేస్తే సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలన్నింటినీ రద్దుచేస్తారని చెప్పారు. 15 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవులు అనుభవించిన డీకే అరుణ ఎందుకు గట్టు ఎత్తిపోతలను నిర్మించలేకపోయారని, గద్వాలను ఎందుకు జిల్లాగా సాధించలేకపోయారని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు ఓటేసి కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపిస్తే తుమ్మిళ్ల లెక్క యుద్ధప్రాతిపాదికన గట్టు ఎత్తిపోతలను పూర్తిచేసి 33 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని మంత్రి హరీశ్ హామీఇచ్చారు.

కేసీఆర్ వల్లే పాలమూరు సాగునీరు మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 67 ఏండ్లకుపైగా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన పట్ల విసిగివేసారిన ప్రజలు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మరోసారి అధికారమిచ్చేందుకు డిసెంబర్ ఏడు పోలింగ్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కేవలం నాలుగేండ్లలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు దక్కిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషివల్లనే నేడు ఎక్కడచూసినా నిండిన చెరువులు, పచ్చని పొలాలు పాలమూరులో కనిపిస్తున్నాయన్నారు. ఈ సమావేశాల్లో దేవరకద్ర అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, గద్వాల అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితోపాటు ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, శాట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవర మల్లప్ప, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శివకుమార్, మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహగౌడ్, ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, నాయకులు నరేశ్‌రెడ్డి, లలితమ్మ, తిప్పారెడ్డి, కృష్ణమూర్తి, రవికుమార్‌యాదవ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.