Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

బాబు ముక్కుపిండి విద్యుత్ తెస్తం

ఏపీ సీఎం చంద్రబాబు ముక్కు పిండి మరీ తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను తీసుకొస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ పంటలను ఎండగట్టాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి విద్యుత్ అంశంపై రూల్ 304 ప్రకారం అడిగిన కొన్ని ప్రశ్నలకు సీఎం జవాబిచ్చారు. ఇప్పటికే నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణకు 54%, ఏపీకి 46% వాటా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని, కానీ ఏపీ ముఖ్యమంత్రి

KCR speech in Assembly

చట్టాన్ని అతిక్రమించారని కేసీఆర్ చెప్పారు. -విభజన చట్టాన్ని బాబు ఉల్లంఘించారు -మనకు ఇవ్వాల్సిన 54% వాటా ఇవ్వడం లేదు -తెలంగాణ పంటలు ఎండగట్టాలని కంకణం కట్టుకున్నడు -అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలనుకుంటే ప్రధాని సమయమివ్వలేదు -గత ప్రభుత్వాల తెలివితక్కువతనంవల్లే కేంద్రం వాటా దక్కలేదు -ఏపీ నిర్వకంపై అసెంబ్లీలో సీఎం చంద్రశేఖర్‌రావు ఫైర్ ఈ విషయంపై తాను, ప్రభుత్వ కార్యదర్శి అనేక పర్యాయాలు కేంద్రానికి తెలియజేశామని, లేఖలద్వారా కూడా ఫిర్యాదుచేశామని వివరించారు. ఏపీ సీఎం వ్యవహారం గురించి తాను స్వయంగా ప్రధాని మోదీకి సైతం ఫిర్యాదు చేశానని చెప్పారు. కృష్ణపట్నం ప్రారంభంకాకుండా ఆపారు. అక్కడ 500 మెగావాట్లలో మనకు 190 మెగావాట్లు రావల్సి ఉంది. కృష్ణపట్నంలో ఎంత విద్యుత్ జనరేట్ అవుతుందనేది ఆన్‌లైన్‌లో ఉంటుంది. అందరూ చూసుకోవచ్చు. గౌరవ సభ్యులు కావాలంటే నా దగ్గర లాప్‌టాప్ ఉంది. చూపిస్త అన్నారు. దిగువ సీలేరు, డొంకరాయి, ఎగువ సీలేరు కలిపి మొత్తం 725 మెగావాట్లలో మన వాటా కింద 390 మె.వా రావాలి.

అనంతపురంలో 570 మె.వా సంప్రదాయేతర ఇంధనంలో మనకు 307 మె.వా రావాలి. మాచకొండలోని 102 మె.వాలో మనకు 36 మె.వా రావాలి. హిందూజాలోని 1040 మె.వాలో మన వాటా కింద 561 మె.వా రావాలి అని సీఎం వివరించారు. వీటిలో ఏఒక్క ప్రాజెక్టు నుంచీ పవర్ ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన చట్టంలోని 12వ షెడ్యూల్‌లో సెక్షన్ 19పరంగా నూటికి నూరు శాతం ఏపీ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డారు.

రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ మే 8న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 20ని ఉల్లంఘించారు. గవర్నర్ స్వయంగా జారీ చేసిన జీవోను కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు అని చెప్పారు. విద్యుత్ పంపకాలు సక్రమంగా అమలు జరగకపోతే గ్రిడ్ కుప్పకూలే పరిస్థితి ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కూడా ఏపీని ఆదేశించినా ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదు మేరకు కేంద్ర విద్యుత్ మంత్రి నియమించిన నీరజా మాథూర్ కమిటీకూడా ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదు అని పేర్కొన్నారు.

పీపీఏలు రద్దు చేశామని ఏపీ జెన్కో చెప్పింది. ఇది తప్పని స్వయంగా ఏపీఈఆర్‌సీ పేర్కొంది. అలా చెప్పినందుకు హైకోర్టు జడ్జి హోదా కలిగిన ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను అప్రజాస్వామికంగా ఏపీ ప్రభుత్వం తొలగించింది. వాళ్లు తీర్పు చెప్పిన తేదీ తర్వాత, పాత తేదీ వేసి వాళ్లను తొలగిస్తున్నట్లు ఏపీ చెప్పింది. ఇది వింతల్లోకి వింత. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదన్నారు.

ఏపీ నుంచి 980 మెగావాట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తెలంగాణకు 980 మెగావాట్లు రావాలని, కానీ ఏపీ ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యుత్ సమస్యను అధిగమించడానికి తాము ప్రయత్నిస్తుంటే, అవాస్తవాలు చెప్పడానికి కొందరు యాత్రలు చేస్తున్నారని పరోక్షంగా టీడీపీని ఉద్దేశించి అన్నారు.వ్యక్తుల మధ్య భేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం కరెంట్ కోతలులేవని,డిమాండ్ తగ్గిందని తెలిపారు. ఖరీఫ్ అయిపోవచ్చిందని, రబీ ప్రారంభం కానుందన్నారు.

ఇటీవల రాజ్‌భవన్‌లో కలిసినప్పుడు నేనే చొరవచేసి, స్వయంగా చంద్రబాబుని కలిసి పరస్పరం సహకరించుకుందాం అని చెప్పిన. అందుకు గవర్నర్‌కూడా అభినందించారు. గవర్నర్ ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. అందరం పోయి మాట్లాడుకున్నం. అయినా ఏనాడూ బాబు సహకరించలేదు అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణపై వివక్ష జరిగింది. మన రైతాంగాన్ని కాపాడుకోవాలి. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపుదాం. మేం ప్రయత్నాలేమీ చేయటంలేదని, ఢిల్లీ వెళ్లటంలేదని బీజేపీ సభ్యులు ఆరోపిస్తన్నరు. ఆల్ పార్టీ డెలిగేషన్‌కోసం ప్రధానిని టైమ్ అడిగనం.

మన సీఎస్‌గారు 10రోజులు ప్రయత్నించిండ్రు. ఎందుకో కానీ ప్రధాని మనకు సమయం ఇవ్వలేదు. ఆల్‌పార్టీ డెలిగేషన్ ఢిల్లీ పోదం.మేల్కొనకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుద్ది అని సీఎం చెప్పారు. ఆయనెవరో పరకాల ప్రభాకర్ అంట! మనకు చట్టాలు తెలియవని, అసలు చదువు కూడా రాదంటున్నడు. మేమేం బెగ్గర్స్ కాదు. హక్కుదారులం. ఏపీ జెన్కో, డిస్కంలో మనవి 550 కోట్ల వాటాలున్నాయి అని తెలిపారు.

వచ్చే ఏడాది చివరికల్లా 2100 మె.వా 2015చివరికల్లా 2100మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. సింగరేణిలో విద్యుత్‌ఉత్పత్తి చేయదలిచినం. సింగరేణిలో 1200 మెగావాట్ల యూనిట్లు రెండు కడతున్నం. వచ్చే ఆగస్ట్ 15నాటికి మొదటి యూనిట్ కింద 600 మెగావాట్లు ఇస్తమని చెప్పినరు. భూపాలపల్లిలో 600 మె.వా, కేంద్రంనుంచి సీజీఎస్‌కింద 300 మె.వా.. అంటే మొత్తం 1500 మె.వా అందుబాటులోకి వస్తుంది. 2015 చివరినాటికి మరో 600 మె.వా వస్తుంది. మొత్తం 2100 మె.వా మనకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలో ఒక్క గుంటకూడా ఎండిపోదు. కోతల దౌర్భాగ్యాన్ని ఎత్తివేస్తం. కృష్ణపట్నం, హిందూజాలలో 54% వాటా వస్తుంది అని సీఎం వివరించారు.

గత ప్రభుత్వాల నిర్వాకం… తెలంగాణలో విద్యుత్ సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదని సీఎం చెప్పారు. ఘనత వహించిన గత ప్రభుత్వాల నిర్వాకంవల్లే, ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఎక్కడ బొగ్గు ఉంటే అక్కడే పరిశ్రమ (పిట్ హెడ్) పెట్టాలి. కానీ అలా జరగలేదు. మణుగూరులో పెట్టవలసిన 1760 మెగావాట్ల పరిశ్రమను విజయవాడలో వీటీపీఎస్ అని పెట్టుకున్నరు. రామగుండం పిట్‌హెడ్‌పై పెట్టాల్సిన 1320 మె.వా పెట్టలేదు. సత్తుపల్లి పిట్ హెడ్ మీద పెట్టాల్సిన 600 మె.వా పరిశ్రమకు ప్రభుత్వం ముందుకురాలేదు. మొత్తం 3680 మెగావాట్ల థర్మల్‌పవర్ రాకుండా చేసిండ్రు.

1966నుంచి 2014వరకు తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తూనే వచ్చినరు. హైడ్రో పవర్ విషయంలోనూ ఇదే పరిస్థితి. ప్రాణహిత-చేవెళ్లలో, ఇచ్చంపల్లిలో 600 మె.వా, సింగారెడ్డి 192 మె.వా, దిండి 21 మె.వా, శంకర్‌పల్లి గ్యాస్ పవర్ స్టేషన్ 1400 మె.వా పెండింగ్‌లో ఉంది. గ్యాస్ కేటాయింపులు జరగలేదు. కరీంనగర్ జిల్లా నేదునూరులో 2100 మె.వా గ్యాస్ ప్రాజెక్టుకు గ్యాస్ ఇవ్వలేదు. గ్యాస్, హైడెల్ కలిపి 4617 మె.వా రాలేదు. థర్మల్, గ్యాస్, హైడల్.. మొత్తంకలిపి తెలంగాణకు 8297 మె.వా రావలసి ఉండగా, రాకుండా చేసినరు. 234 మె.వా జూరాల హైడల్ ప్రాజెక్టుకోసం ఇప్పటివరకు రూ.2వేల కోట్లు ఖర్చుచేశారు. అక్కడ మొత్తంమీద 20నుంచి 25 రోజులు కూడా విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేం. అదో వైట్ ఎలిఫెంట్. వృథా ప్రాజెక్టును తెలంగాణ నెత్తిన పెట్టినరు అని సీఎం వివరించారు.

తెలివి తక్కువ ప్రభుత్వాలు… ఇంతకు ముందువరకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల తెలివితక్కువతనంవల్ల స్థాపిత కరెంట్‌లో కేంద్రంనుంచి ఎక్కువ వాటా పొందలేకపోయారని సీఎం కేసీఆర్ విమర్శించారు. 2001 ఏపీ లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 8.45 కోట్లు. కేంద్రంనుంచి తీసుకోవాల్సిన స్థాపిత కరెంట్‌లో హైడ్రో, గ్యాస్, థర్మల్ కలిపి ఏపీకి దక్కిన వాటా 16,719 మెగావాట్లు మాత్రమే. తమిళనాడు జనాభా 7 కోట్లుంటే వాళ్ల వాటా 21,192 మె.వా, 6 కోట్ల జనాభా కలిగిన కర్ణాటకకు 14,269 మె.వా, మనకంటే చిన్న రాష్ట్రమైన గుజరాత్ జనాభా 6 కోట్లు.

వాళ్లకు దక్కిన వాటా 28,423 మె.వా. ఇక నిన్నగాక మొన్న పుట్టిన చిన్న రాష్ట్రం(ఛత్తీస్‌గఢ్), మొన్ననే నేనుబోయి 1000 మె.వా ఒప్పందం చేసికొని వచ్చిన. ఆ రాష్ట్ర జనాభా 2.5 కోట్లు, విద్యుత్ వాటా 10,570 మె.వా. మనకంటే కొంచెం పెద్దదైనా మహారాష్ట్ర జనాభా 10 కోట్లు, దాని వాటా 35,000 మె.వా. ఏపీలో పని చేసిన ప్రభుత్వాల తెలివి తక్కువగా పని చేశాయి. వారసత్వంగా వచ్చిన దరిద్రం ఇది అని సీఎం వ్యాఖ్యానించారు.

సభలో గందరగోళం… సీఎం విద్యుత్ సమస్యల గురించి విశదీకరిస్తున్నప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి అంశం ప్రస్తావనకు వచ్చింది. సాగర్, శ్రీశైలంలో ఉత్పత్తి మొదలుపెడితే ఏపీ సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మినిస్టర్ నానా యాగీచేశారు. తెలంగాణ పంట లు ఎండగట్టాలని బాబు కంకణం కట్టుకున్నడు అని సీఎం ఆరోపించారు. దీంతో టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

తాను సభ నియమ నిబంధనలను అనుసరించే మాట్లాడుతున్నానని, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడితే పర్మిషన్ తీసుకోవాలని, తాను ముందే స్పీకర్ దగ్గర అనుమతి తీసుకున్నానని సీఎం వివరించారు. టీడీపీ సభ్యులు శాంతించకుండా గందరగోళం సృష్టించారు.

ఈ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం లేచి చంద్రబాబు తొత్తుల్లారా? ఖబడ్దార్..తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో సీఎం జోక్యం చేసుకొని ఏపీ సీఎం ముక్కుపిండి మన విద్యుత్ తీసుకొస్తం. బాబు నిర్వాకం గురించి మాట్లాడితే మీకు ఎందుకు పౌరుషం పొడుచుకొస్తున్నది? ఇవి వాస్తవాలు కావా? అని నిలదీశారు. ఎర్రబెల్లి స్పీకర్ పొడియంవద్దకు చేరుకుని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. గందరగోళం నెలకొనడంతో స్పీకర్ 11.55 గంటలకు పావు గంట పాటు టీ బ్రేక్ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.