రాష్ట్రంలో కల్లు గీత కార్మికులు రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మరో పక్షంరోజుల్లో హాస్టల్ విద్యార్థుల మెస్‌చార్జీలను పెంచబోతున్నట్లు తెలిపారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర బయటపడిందన్న కేసీఆర్.. చంద్రబాబు దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు. పట్టపగలు దొరికి.. పెడబొబ్బలతో గాయిగాయి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అన్నారు.

-పట్టపగలు దొరికిన దొంగ చంద్రబాబు -ఆయనను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు -గీత కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా -హాస్టల్ పిల్లలకు మెస్ చార్జీలు పెంచబోతున్నం -చిల్లర రాజకీయాలు తప్ప కాంగ్రెసోళ్లకు అభివృద్ధి కనబడదు -నల్లగొండలో జరిగిన తెలంగాణ ప్రగతి పథం సభలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ నీ అబ్బ జాగీరు కాదని చంద్రబాబును హెచ్చరించారు. సోమవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించిన సీఎం.. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. తదుపరి నల్లగొండ పట్టణంలో జరిగిన తెలంగాణ ప్రగతి పథం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఇంటింటికి నీరు, కరెంటు ఇచ్చే రెండు బృహత్తర ప్రాజెక్టులను నల్లగొండ జిల్లాలోనే ప్రారంభించడం తనకెంతో తృప్తిగా ఉందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
2019 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రం: ప్రతి ఇంటికీ విద్యుత్ వెలుగులిచ్చే కార్యక్రమం నల్లగొండలోనే శంకుస్థాపన చేసుకున్నాం. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం 2019 నాటికి దేశంలోనే అత్యంత మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలుస్తుంది. రూ.91,500 కోట్లతో 25వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే పెద్దదైన నాలుగువేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (యూఎంపీపీ)కు భూమి పూజచేసి వచ్చాను. అదేవిధంగా మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తెలంగాణలో ప్రతి ఇంటికీ, ప్రతి గుడిసెకు, దూరంగా ఉన్న బస్తీకి కూడా ప్రభుత్వమే ఖర్చుపెట్టి (మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. సుమారు రూ.40వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ అమలుచేస్తున్నాం. మొత్తం లక్షా 30 వేల కోట్లతో ఒకే రోజు అభివృద్ధి కార్యక్రమాలు పారంభించుకోవడం నాకెంతో తృప్తిగా ఉంది.
చంద్రబాబూ తస్మాత్ జాగ్రత్త!: ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కుపోయిన చంద్రబాబు.. తిరిగి ప్రతిసవాళ్లు విసరడంపై, హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. హైదరాబాద్ చంద్రబాబు అబ్బ జాగీరుకాదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతాడు ఇయ్యాల! ఆంధ్రాల పోయి మీటింగ్ పెట్టి అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించిండ్రని! ఇరికితే ఇరికేవాడేనా చంద్రబాబు నాయుడు? ఇరికించేటోడివే తప్ప నువ్వు ఇరికేటోడివా? కొంపలు కూల్చుడు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏమి మాట్లాడుతావు నువ్వు చెయ్యాల్సిందంతా చేసి! పక్కరాష్ట్రంవోడు వచ్చి ఈడ అధికారపార్టీ ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్సీ గెలిపిస్తానంటే మేము చేతులు ముడుచుకుని కూసోవాల్నట! నోరు అప్పగించి కూసోవాల్నట! దొంగతనం చేసేటోడ్ని దొంగ అని అనొద్దట! పట్టుకోవద్దట! మొత్తం బండారం బయటపడింది.. మీరే చూసిండ్రు టీవీలల్ల!! నిజానికి పట్టపగలు దొరికిన దొంగ, ఇయ్యాల పెద్దగా మాట్లాడుతున్నాడు. నిన్ను ఇరికించే ఖర్మ మాకెందుకు? మాకేమన్న కాలు చెయ్యి గులగుల పెట్టినాయా? మాకేమి పనిలేకుండా ఉన్నామా? మా తెలంగాణ.. మా సమస్యలు.. మా పనులు మేము చేసుకోవవడానికి 24 గంటల సమయం కూడా మాకు సరిపోదు. రోజుకు 18, 20 గంటలు పనిచేసినా సరిపోయే పరిస్థితిలో మేమే లేం. నీ బాధ మాకెందుకు? రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లు! ఢిల్లీలో ఆనాడు ఇచ్చినోళ్లు తెలంగాణ ఇచ్చినా ఈ దిక్కుమాలిన దంద మాకెందుకు పెడుతున్నారయా అని అడిగిన! అనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే పదేండ్లు ఉమ్మడి రాజధాని అని పెట్టిండ్రు. చంద్రబాబు నాయుడు ఇయ్యాల ఏమి మాట్లాడుతడు? కేసీఆర్.. హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో, నాకూ అంతే హక్కు ఉందంటడు! నీ అబ్బ జాగీరా చంద్రబాబునాయుడు? హైదరాబాద్ నీ తాతదా? ఇయ్యాల హైదరాబాద్‌కు నువ్వుకాదు ముఖ్యమంత్రివి.. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్‌లో నీ ఏసీబీ ఉండదు. హైదరాబాద్ మీద పోలీసులకు జురీడిక్షన్ ఉంటది. ఈ రాష్ట్ర డీజీపీకి ఉంటది.. నీ డీజీపీకి ఉండదు. నువ్వు దొంగతనం చేసి, దొరికి పోయి, నగ్నం పచ్చిగా పట్టుబడి, ఇయ్యాల అరిసి పెడబొబ్బలు పెట్టి గాయి చేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీ పెడబొబ్బలు, నీ అరుపులు ఈయ్యాల మొత్తం గ్రామ గ్రామాన గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే ఢిల్లీ దాకా నీ బతుకేందో, నీ రాజకీయాలేందో, నీలుచ్చా పనేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశానికి తెల్సిపోయింది. ఇయ్యాల తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది బడితే అది చేస్తానంటే చూడడానికి సిద్ధంగా లేదు.
నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్తి చేస్తరు జాగ్రత్త! ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడు. నీకు ఏసీబీ ఉన్నంత మాత్రాన ఈ కేసీఆర్ నీలాగా దొంగ కాడుకదా! నీలెక్క దొంగ రాజకీయాలు రావుకదా! నీలెక్క తప్పుడు పనులు మేము జేయంగదా! నేను ఒక్క మాట అడుగుతున్నా చంద్రబాబునాయుడు.. గెలిచే మెజారిటీ లేక ఎన్నికల గోదాలోకి దిగిన పార్టీ ఏదీ? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేంత ఓట్లు నీకు ఉన్నాయా? ఎందుకు దిగినవు? నీవు నీతిమంతుడివేకదా! సత్యహరిశ్చంద్రుడి ఇంటి వెనకాలే నీ ఇల్లు ఉన్నది కదా! మరి ఎందుకు పెట్టినవు పోటీలో? ఇతరపార్టీలోళ్ళను గుంజుకుని, లఫంగతనం చేసి, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి, రాజకీయాలను భ్రష్టుపట్టించే పని నువ్వు జేసినవ్.
నువ్వు చేసే దుర్మార్గాన్ని స్టీఫెన్‌సన్ అనే తెలంగాణ బిడ్డ.. అంగ్లో ఇండియన్.. నువ్వు పైసలు ఇవ్వడానికి పంపిస్తే, ఆయన మొత్తం ఏసీబీకి కైంప్లెంట్ ఇచ్చి పట్టించిండు నీ ఎమ్మెల్యేను. ఇయ్యాల నీ ఎమ్మెల్యే జైళ్ళ ఉన్నడు. ఆ సందర్భంలో నీ పేరు కూడా బయటకు వస్తా ఉన్నది, నువ్వు ఫోన్లల మాట్లాడింది బయటకు వస్తాఉన్నది, నిన్నేదో మేము అమాయకంగా ఇరికించినామా ? కనబడతలేదా ప్రపంచానికి! పట్టపగలు దొరికిన దొంగతనాన్ని కూడా నీ అరుపులతోని, పెడబొబ్బలతోని గాయిచేసి మూసేద్దామనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేరు జాగ్రత్త! నిన్నేవ్వడూ కాపాడలేడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏశాస్తి కావాలో ఆశాస్తి అయ్యి తీరుతది జాగ్రత్త, ఇంకా ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బొబ్బిలి.. ఈరోజు స్వయం పాలనతో, ఆత్మగౌరవంతో కాలర్ ఎగురేసుకుని దేశం ముందుకు నిలబడి నేనురా తెలంగాణ అంటున్నది. ఈ గడ్డమీద నీ కిరికిరి చెల్లదు తస్మాత్ జాగ్రత్తా. జరిగే చరిత్ర అంతా మీరు చూస్తున్నరు.
దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ బారిన నల్లగొండ -ఫ్లోరోసిస్ బాధితులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ కంకణం -ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తలాపున గోదావరి నది ఉన్నా సమైక్య పాలనలో నల్లగొండ జిల్లా వెనుకబడ్డది. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు ఉండడమే ఈ జిల్లా ప్రజలు చేసుకున్న తప్పా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉన్నట్లు.. ఈ జిల్లా నుంచే గోదావరి నీళ్లు పారుతున్నా.. తాగునీరు ఇయ్యలేక పోయిండ్రు. ఆ పాలకులు చేయలేనిది మేం చేస్తున్నందుకు విమర్శలు చేస్తుండ్రు. ఎవరు ఎన్ని చేసినా, ఏమన్నా రాబోయే నాలుగేండ్లలో రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరిచ్చి దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ బారిన పడ్డ నల్లగొండ ప్రజల గొంతు తడుపుతాం అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
సోమవారం ఆయన నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో జరిగిన తెలంగాణ ప్రగతిపథం బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. ఆంధ్రపాలకుల పాలనవల్ల మునుగోడుకే పరిమితమైన ఫ్లోరోసిస్ క్రమంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించిందన్నారు. జిల్లాలో 1.50లక్షల మంది ఫ్లోరోసిస్ బారిన పడి జీవచ్చవాలుగా మారారన్నారు. అప్పట్లో ఉద్యమ నాయకుడిగా జిల్లాలో పర్యటించి ఫ్లోరోసిస్ వ్యధను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వాటర్‌గ్రిడ్ ద్వారా ఈ మహమ్మారిని తరిమికొట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆరు నెలల్లో విద్యుత్ సమస్యను తీర్చారు: మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారంలోకి వస్తే ఏడాదిలోపే కరెంటు కష్టాలను తీరుస్తానన్న కేసీఆర్..ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే దానిని చేసి చూపించారని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, నల్లగొండపై ప్రత్యేక ప్రేమ చూపి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాకు అనేక వరాలిచ్చిన సీఎం.. యాదాద్రి పవర్ ప్రాజెక్టును, వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను ఇక్కడినుంచే మొదలుపెట్టడం శుభ పరిణామమన్నారు. వెనుకబడిన జిల్లా అయిన నల్లగొండపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.
అడగకుండానే వరాలిచ్చిన దేవుడు కేసీఆర్: ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎన్నికల మ్యానిపేస్టోలో చెప్పకుండానే ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ సీఎం కేసీఆర్ ప్రజల పక్షపాతిగా నిలుస్తున్నారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. చెప్పకుండానే జిల్లాను దత్తత తీసుకుని ఏ జిల్లాకు ఇవ్వని వరాలను నల్లగొండ జిల్లాకు ఇస్తున్నారని, యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. సభలో టీఆర్‌ఎస్ నేతలు దుబ్బాక నర్సింహారెడ్డి, బండా నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్, నోముల నర్సింహయ్య, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, లాలూనాయక్, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, గుత్తా జితేందర్‌రెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, జెల్లా మార్కండేయులు, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, సామేలు, తేరా చిన్నపరెడ్డి, ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాలె శరణ్యారెడ్డి పాల్గొన్నారు.